సాక్షి, హైదరాబాద్ : శాసనమండలిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 5 సార్లు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈటల.. తొలిసారి మండలిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో బడ్జెట్‌ను సమర్పించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆరే ఆర్థిక శాఖ నిర్వహిస్తుండటంతో శాసనసభలో స్వయంగా ఆయనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటలకు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. సుమారు 50 నిమిషాలపాటు బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని వినిపించిన ఈటల ప్రభుత్వ ప్రాధామ్యాలతోపాటు వివిధ శాఖల పద్దులను ప్రస్తావించారు. ఈటల ప్రసంగిస్తున్న సమయంలో ప్రభుత్వ సంక్షేమ, పథకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అధికార టీఆర్‌ఎస్ సభ్యులు హర్షం ప్రకటిస్తూ బల్లలు చరిచారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్లిన సభ్యులు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ప్రసంగంలో కనిపించిందని అభినందించారు. 2018–19 సంవత్సరపు అనుబంధ వ్యయ అంచనాలను కూడా సభకు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment