
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తొలిసారిగా శాసనమండలిలో 2019–20 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సోమవారం అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా మండలిలో ఆయన బడ్జెట్ ప్రతిపాదనలను శాఖల వారీగా వివరిస్తూ ప్రసంగించారు. 2004–05లో యువజన సర్వీసులు, 2014–18 మధ్య కాలంలో నీటిపారుదల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్థిక మంత్రి హోదాలో కౌన్సిల్‌లోనూ ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. సభ మొదలుకాగానే చైర్మన్ స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్ వివిధ పత్రాలు సభ ముందు ఉంచినట్టుగా ప్రకటించి, బడ్జెట్ ప్రసంగం చేయాల్సిందిగా మంత్రి హరీశ్‌కు సూచించారు. ఉదయం 11.30కి బడ్జెట్ ప్రసంగపాఠాన్ని చదవడం మొదలుపెట్టిన హరీశ్ 40 నిమిషాల్లో తన ప్రసంగం ముగించారు.
స్పష్టమైన ఉచ్ఛారణతో తడబాటు లేకుండా బడ్జెట్ ప్రతిపాదనలను చదివి వినిపించారు. సోమవారం సభా కార్యక్రమాలు మొదలు కావడానికి కొంత సమయం ముందే మండలి హాలులోకి అడుగుపెట్టిన హరీశ్‌ను మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరీ సుభాష్‌రెడ్డి తదితరులు అభినందించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యవతి రాథోడ్‌ను టీఆర్‌ఎస్ ఇతర ఎమ్మెల్సీలు అభినందించారు. తొలిసారిగా మండలికి వచ్చిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, రఘోత్తంరెడ్డిలను చైర్మన్ స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్ సభకు పరిచయం చేశారు. కౌన్సిల్ సమావేశాలను 11వ తేదీ ఉదయం 11.30కి వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉన్నందున మండలి 11న సమావేశం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment