అభివృద్ధి పరుగులు పెట్టాలి | Minister Harish Rao Review With Officials on Medak District Development | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పరుగులు పెట్టాలి

Published Tue, Sep 17 2019 11:09 AM | Last Updated on Tue, Sep 17 2019 11:10 AM

Minister Harish Rao Review With Officials on Medak District Development - Sakshi

అసెంబ్లీ సమావేశ మందిరంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి

సాక్షి, మెదక్‌: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. మెదక్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం ఆయన హైదరాబాద్‌లోని శాసన సభ మీటింగ్‌ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు.

జిల్లాలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అర్బన్‌ పార్కులను వేగంగా పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మెదక్‌ పట్టణంలో సైతం అర్బన్‌ పార్కు నిర్మాణానికి రెండు రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని సూచించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా ఏయే ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్‌గా చేస్తే బాగుంటుందనే అంశంపై పూర్తి సమాచారంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాను పర్యాటక రంగంలో ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.

‘భగీరథ’ పనులపై ఆరా.. అధికారులపై ఆగ్రహం
మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పనులపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుండటంపై కాంట్రాక్టర్లు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముందుగా జిల్లా కేంద్రంతోపాటు మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ పనుల పరిస్థితిని కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి మున్సిపాలిటీలో దసరాలోపు ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. భగీరథ పనులను పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తమ దృఫ్టికి వచ్చిందని.. ఇక ఆలస్యం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో రోడ్లన్నీ ధ్వంసమై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణం మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ఘనపురం ఎత్తు పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌
ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపునకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించామని.. పనుల ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ముందుగా ఎత్తు పెంపునకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇప్పటికే జరిగిన పనులకు సంబంధించి రూ.5 కోట్లు ట్రెజరీలో ఫ్రీజింగ్‌లో ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తే తక్షణం విడుదల చేయిస్తామని.. మిగతా రూ.8 కోట్లకు సంబంధించి టోకెన్‌ చేసి ఆ వివరాలను సైతం అందజేయాలని మంత్రి సూచించారు.

డిసెంబర్‌లోపు చెక్‌డ్యాంలు పూర్తి కావాలి..
జిల్లాకు మంజూరైన చెక్‌డ్యాంల విషయంలో రాజీపడొద్దని మంత్రి అన్నారు. అన్ని చెక్‌డ్యాంలను ఈ ఏడాది డిసెంబర్‌లోపు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. చెక్‌డ్యాంల నిర్మాణంలో భాగంగా ఇరువైపులకు వెళ్లేలా రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో కాళేశ్వరం కాల్వల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.

సింథటిక్‌ ట్రాక్‌కు నిధుల మంజూరుపై సానుకూల స్పందన
జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి అవసరమైన రూ. 70 లక్షల నిధులు మంజూరు చేయాలని ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు.  అదేవిధంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని.. ఇప్పటికే పూర్తయిన వాటిని అర్హులైన లబ్ధి దారులకు కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని ప్రారంభించేందుకు సైతం తగిన ఏర్పాట్లు చేయా లన్నారు.

ఇంత ఆలస్యం ఎందుకు?
అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మెదక్, దుబ్బాక శాసన సభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ టెండర్లు పిలవలేదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలతోపాటు అదనపు గదుల నిర్మాణాలను సైతం త్వరగా పూర్తి చేయాలన్నారు. 

‘ప్రత్యేక’ నిధుల మంజూరు
30 రోజుల ప్రణాళిక అమలుకు సంబంధించి ట్రాక్టర్లు, ఆటోలు, చెత్తబుట్టల పంపిణీకి నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మెదక్‌ నియోజకవర్గానికి రూ.40 లక్షలు, నర్సాపూర్‌ మున్సిపాలిటీకి రూ.40 లక్షలు, చేగుంట, పెద్దశంకరంపేట మండలాల కు రూ.20 లక్షలు, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్‌ మండలాలకు రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్‌కు అందజేయాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. కల్యాణలక్ష్మి నిధులు పెండింగ్‌ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్‌ వివరాలను అధికారుల వద్ద ఆరా తీసిన హరీశ్‌రావు.. వెంటనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.

అయితే కల్యాణలక్ష్మికి సంబంధించి అనర్హులు దరకాస్తు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇలాంటి వారిని గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. భూప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆర్డీఓలకు సూచించారు. సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డితోపాటు జిల్లా అధికారులు సీతారామారావు, వెంకటేశ్వర్లు, సుధాకర్, శ్రీనివాసులు, శైలేశ్వర్‌రెడ్డి, రసూల్‌బీ, జయరాజ్, యేసయ్య, పద్మజారాణి, ఆర్డీఓలు శ్యాం ప్రకాష్, సాయిరాం, అరుణతోపాటు మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement