సాక్షి, హైదరాబాద్: రైతులు, పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలతో కాంగ్రెస్‌కు నీరసం, నిరుత్సాహం తప్ప మరేమీ మిగల్లేదని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆర్థికమాంద్యం కారణంగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో డీలాపడుతుందని కాంగ్రెస్ భావించిందని, అందుకు భిన్నంగా పింఛన్లకు రూ.10 వేల కోట్లు, రైతుబంధుకు రూ.12 వేల కోట్లు, రుణమాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించడంతో కాంగ్రెస్ సభ్యులు డీలాపడిపోయారని ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీలో సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టులంటే కొన్ని నెలలు, ఏళ్లలోనే పూర్తిచేయొచ్చని.. దేశానికే కొత్త దిశ, దశను తెలంగాణ అందించిందని పేర్కొన్నారు.అసెంబ్లీ నుంచి సీపీఐ, సీపీఎంల అడ్రస్ గల్లంతైనట్లే తమకూ అదే పరిస్థితి పడుతుందనే భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అర్థం తెలుసా అంటూ ఎగతాళి చేశారు.
రైతులకు పెట్టుబడి సాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలతో పాటు, దేశంలో తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనైనా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తికి 40 ఏళ్లు, శ్రీశైలం 38 ఏళ్లు, జూరాలకు 26 ఏళ్లు పట్టగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లో, తుమ్మిళ్లను 9 నెలల్లో, కాళేశ్వరం మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌజ్‌లను మూడున్నరేళ్లలోనే పూర్తిచేసి చరిత్ర తిరగరాసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసి దేశం నేర్చుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలో ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులని పేరు పడిందని, వాటిని కేసీఆర్ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ రూ.168 కోట్లు ఖర్చుచేసిందని, వారే వేసిన అంచనా ప్రకారం రూ.38,500 కోట్లు వ్యయం అవుతుందని అంటున్నారు.
వారి కళ్లు మండుతున్నాయి..
కాంగ్రెస్‌పై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం విమర్శనాత్మకంగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడి అభాసుపాలవుతోందన్నారు. తెలంగాణ గడ్డపై ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కాంగ్రెస్ నేతల కళ్లు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో గల్లిగల్లీకి పేకాట క్లబ్‌లు, పల్లె పల్లెకూ గుడుంబా, ఇసుక మాఫియా వంటివి ఉంటే టీఆర్‌ఎస్ పాలనలో వాటన్నింటిని బంద్ చేయించామన్నారు. కాంగ్రెస్‌హయాంలో పాలమూరులో వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటే, ప్రాజెక్టులు చేపట్టి పసిడి పంటలుగా మార్చి, వలసదారులను వెనక్కు తీసుకొచి్చన ఘనత సాధారణంగా వలస వెళ్లిన వారిని తిరిగి తీసుకొచి్చన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని కితాబిచ్చారు. మిషన్ కాకతీయ అద్భుతమైన కార్యక్రమమని, మొత్తం 27,584 చెరువుల్లో యుద్ధప్రాతిపదికన 26,690 చెరువుల్లో పూడిక పూర్తయి, 14.15 లక్షల ఎకరాల స్థిరీకరణ కావడం పట్ల యావత్ దేశం హర్షిస్తోందన్నారు.
హరీశ్ పనిరాక్షసుడు..
హరీశ్ పనిరాక్షసుడని కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కష్టించి పనిచేసే వారిలోముందు వరసలో ఉంటారని పేర్కొన్నారు. మార్చిలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని, ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని ఉదయసముద్రంతో పాటు ఏఎంఆర్ ప్రాజెక్టు, డిండి, మూసీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment