రూ.10,095 కోట్లకేంద్ర నిధులు పెండింగ్‌ | Harish Rao Says Rs 10095 Crore Of Central Funds Pending | Sakshi
Sakshi News home page

రూ.10,095 కోట్లకేంద్ర నిధులు పెండింగ్‌

Published Wed, Sep 16 2020 3:48 AM | Last Updated on Wed, Sep 16 2020 3:48 AM

Harish Rao Says Rs 10095 Crore Of Central Funds Pending - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి హక్కుగా, గ్రాంట్‌గా కేంద్రం నుంచి రావాల్సిన రూ.10,095 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇవే కాకుండా జీఎస్టీ కింద రూ.6,016 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.2,812 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు, ఇంకా మరిన్ని నిధులు రాలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకున్నా, ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా గత 5 నెలల్లో రూ.55,638 కోట్లు వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించారు. శాసనమండలిలో ఆర్థికశాఖకు సంబంధించిన మూడు బిల్లులపై వేర్వేరు సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆయన ఆయా అంశాలు ప్రస్తావించారు. 

షరతులు ఒప్పుకోం.. 
తెలంగాణ ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌  బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుపై హరీశ్‌ మాట్లాడుతూ అప్పు కోసం కేంద్రం విధించే షరతులకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. గోడౌన్లు కట్టుకుని, ఉచిత కరెంటు అందించి రైతును సంపన్న వర్గాలుగా మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమయంలో కేంద్రం రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా షరతులు పెట్టింది. వీటిని అమలు చేసేది లేదు. వ్యవసాయ పంపుసెట్లు వాడే చోట మీటర్లు పెట్టాలని అప్పుడే అప్పు ఇస్తామని మెలిక పెట్టింది. ఇలాంటివి సరికాదని ప్రధానికి, ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పెంపునకు కేంద్రం అనుమతిచ్చినా.. రాష్ట్రానికి నష్టం జరిగే షరతులకు తలొగ్గేది లేదని సీఎం చెప్పారు. అప్పులను చూసే ముందు.. రాష్ట్ర అప్పులు, ఆదాయాన్ని కలిపి చూడాలి. మన రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదల 2014కు ముందు రూ.4 లక్షల 52 వేల కోట్లయితే ఈనాడు రూ.11 లక్షల 5 వేల 349 కోట్లు. ప్రస్తుత సవరణ ద్వారా వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తుంది. గతంలో కార్పొరేషన్లకు రాష్ట్ర ఆదాయంలో 90 శాతం వరకు గ్యారంటీ ఇచ్చే అవకాశముంది. దాన్ని 200 శాతానికి పెంచడం జరుగుతుంది. కరోనా కంటే ముందు మన దేశ జీడీపీ క్రమేపీ గత 8 క్వార్టర్లు తగ్గుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో మైనస్‌ 24 శాతానికి తగ్గింది. ఈ పరిస్థితుల్లోనూ మన రాష్ట్రం మాత్రం డబుల్‌ డిజిట్‌ ఉంది. ఫెర్టిలైజర్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రూ.లక్షా 85 వేల కోట్లు తెస్తే ఆ డబ్బు రాయితీల కోసం ఖర్చు చేశారు. కాళేశ్వరం మీద డబ్బులు ఖర్చు చేయడం ద్వారా లక్ష కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మీద ఖర్చయింది’అని మంత్రి వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement