సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో కోత పడేందుకు కేంద్రం విధానాలే కారణమని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సహా కేంద్రం తీసుకున్న పలు విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని, దాని ప్రభావం రాష్ట్రంపై పడిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఏమాత్రం లేద ని తేల్చి చెప్పారు. శనివారం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన మొత్తాలను కేంద్రం కోత పెట్టినప్పుడు చేసేదేముంటుందని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సవాళ్లున్నాయని, వాటి నుంచి ఇబ్బంది లేకుండా బయటపడుతుందనే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
వివిధ శాఖల్లో పేరుకుపోయిన బకాయిలను చెల్లించిన తర్వాతనే కొత్త ప్రాజెక్టులు చేపడతామని ఇటీవల బడ్జెట్‌లో సీఎం పేర్కొన్న విషయాన్ని ప్రస్తుతించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న వారు, కేంద్రంలోని తమ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత ఉందని పరోక్షంగా బీజేపీని ప్రశ్నించారు. జాతి నిర్మాణంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన భూమికను పోషించబోతోందని, కానీ దాని గొప్పదనాన్ని జాతీయ మీడియా చూపించటం లేదన్నారు. అన్ని విషయాల్లో ఎంఐఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అం డగా ఉంటుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో మైనారిటీలకు రూ.6,518 కోట్లు ప్రకటిస్తే వాస్తవం గా ఖర్చు చేసింది రూ.3,899 కోట్లేనని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తామన్న మాటలు నిజం కాలేదని ఆరోపించారు. నల్లమలలో యురేనియం వెలికితీత ప్రతిపాదనను తాము వ్యతిరేకమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment