చాలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మనకంటే మరింత అధ్వానంగా ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. కర్ణాటక, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల వృద్ధి మైనస్‌లోకి వెళ్లగా తెలంగాణ పరిస్థితి కొంత నయంగా ఉంది. స్థిరమైన ఆర్థిక ప్రగతి, ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన పరపతితో ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకోగలుగుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి, కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరి çస్తున్నాం. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆర్థిక సంస్థలు, మూలధన వాటాను కలిపి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణం యథాతథంగా కొనసాగుతుంది.
సాక్షి, హైదరాబాద్: ‘‘ఏడాదిన్నరగా ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు 5%గా నమోదై కనిష్ట స్థాయికి చేరుకుంది. రాష్ట్రంపైనా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. జీఎస్టీ పరిహారం అవసరం లేదనుకున్న తెలంగాణ కూడా తప్పనిసరి పరిస్థితిలో కేంద్రం నుంచి దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆర్థిక వృద్ధి తీవ్రంగా దిగజారుతున్న ఇలాంటి పరిస్థితిలో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి రావడానికి చింతిస్తున్నా. అయినా గుడ్డిలో మెల్లలా మనం చాలా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాం. ఇంతటి తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్నా అత్యంత ప్రధానమైన వ్యవసాయ రంగానికి, ప్రజాసంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించాం. పేదలు, రైతుల జీవితాల్లో వెలుగు తీసుకురావాలన్న చిత్తశుద్ధిని మరోసారి ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. పూర్తి ఆశావహ దృక్పథంతో వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల హామీలను నెరవేరుస్తూ 2019–20 బడ్జెట్‌ను రూపొందించాం. అన్ని రంగాల్లో శీఘ్రగతి అభివృద్ధి సాధించే దిశలో ఈ బడ్జెట్ దోహదపడుతుందని ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది’’అని ’సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం 2019–20 ఆర్థిక ఏడాదికిగాను మిగిలిన కాలానికి రూ. 1,46,492.3 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి పద్దు మొత్తాన్ని భారీగా కుదించడానికి మాంద్యం ప్రభావమే కారణమంటూ సీఎం సోదాహరణం గా వివరించారు. సీఎం బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
దేశంలోనే అగ్రగామిగా నిలిచాం..
అవతరించిన ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆకర్షించాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన మొద టి ఏడాది నెలకు రూ. 6,247 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగే పరిస్థితి. ఐదేళ్ల తర్వాత నెలకు రూ. 11,305 కోట్లు ఖర్చుపెట్టే స్థాయికి చేరింది. 2014కు ముందు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) సగటు వృద్ధిరేటు కేవలం 4.2%. 2018–19లో రెండున్నర రెట్లకుపైగా పెరిగి 10.5% నమోదైంది. మూలధన వ్యయంలో అట్టడుగున ఉండే తెలంగాణ, నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఐదేళ్లలో 11.2%నుంచి గత ఆర్థిక ఏడాదిలో 16.9 శాతానికి చేరుకుంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం రూ. 1,65,167 కోట్లు. అన్ని రంగాల్లో సాధిస్తున్న పురోగతి ఫలితంగా గత ఐదేళ్లలో రాష్ట్రం 21.49% సగటు ఆదాయ వృద్ధిరేటు సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఈ గణాంకాలన్నీ కాగ్ నిర్ధారించి అధికారికంగా ప్రకటించినవే.
ఆర్థిక మాంద్యంతో అతలాకుతలం..
ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. 2018–19 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 8% నమోదైనా మూడో త్రైమాసికానికి 6.6 శాతానికి, చివరి త్రైమాసికానికి 5.8 శాతానికి పడిపోయింది. ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి 5% కనిష్ట వృద్ధిని నమోదు చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యు ఫాక్చరర్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33% తగ్గింది. వాహన విక్రయాలు 10.65% క్షీణించాయి. ఫలితంగా ప్రముఖ కంపెనీలు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి వ్యాట్ తగ్గిపోయింది. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. గతేడాది విమాన ప్రయాణికుల వృద్ధి 11.6% ఉంటే ఈ ఏడాది మెనస్ 0.3 % నమోదైంది. సరుకు రవాణా వృద్ధి ఏకంగా 10.6% తగ్గింది. రైల్వే గూడ్సు వ్యాగన్ల బుకింగుల వృద్ధిరేటు 4.1% నుంచి 1.6 శాతానికి పడిపోయింది. చాలా పరిశ్రమలు మూతపడడంతో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి శాతం 10.6 నుంచి మైనస్ 5.1 శాతానికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్టంగా రూ.72.43కి పడిపోయింది. మాంద్యం వల్ల ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కేంద్రం నుంచి రూ. 175 కోట్లు, జూన్, జూలై నెలల్లో రూ. 700 కోట్లను జీఎస్టీ పరిహారంగా తీసుకోవాల్సి వచ్చింది.
వాస్తవిక దృక్పథంతోనే బడ్జెట్ ప్రతిపాదనలు
రాష్ట్ర ఆర్థికశాఖ తీవ్ర మేథోమధనం చేసి అనేక మంది ఆర్థిక గణాంక నిపుణులతో చర్చించి నిర్ధారణ చేసుకున్న వాస్తవిక దృక్పథంతో 2019–20 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 22.69% వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే 2019–20 తొలి త్రైమాసికంలో 1.36% మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలో 15 % ఆదాయాభివృద్ధిని ఆశిస్తే కేవలం 5.46 శాతమే సాధ్యమైంది. గత ఐదేళ్లలో రాష్ట్రం వాణిజ్య పన్నుల విభాగంలో 13.6% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఆర్థిక ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 6.61 శాతమే సాధించగలిగింది. ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఈ ఏడాది మొదటి 4 నెలల్లో కేవలం 2.59 శాతమే వృద్ధిరేటు సాధ్యమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది వరకు 19.8% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి 4 నెలలు 17.5 శాతమే వృద్ధిరేటు నమోదైంది. మోటార్ వాహనాల పన్ను రూపంలో ఆదాయం దారుణంగా పడిపోయింది. గత ఐదేళ్లలో 19% సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మైనస్ 2.06 శాతానికి పడిపోయింది. పన్నేతర ఆదాయం లోనూ గత ఆర్థిక సంవత్సరం వరకు 14.9% నమోదైన సగటు వార్షిక వృద్ధిరేటు... ఈ ఏడాది గడిచిన 4 నెలల్లో మైనస్ 14.16 శాతానికి పడిపోయింది. దీనికితోడు2019–20 ఆర్థిక ఏడాదికి పన్నుల్లో వాటా కింద రాష్ట్రా నికి రావాల్సిన నిధు ల్లో కేంద్రం 4.19% కోత పెట్టింది.
విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహకారం..
రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఇప్పటివరకు రూ. 20, 925 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించాం. ఉదయ్ పథకం ద్వారా డిస్కమ్‌లకు ఉన్న రూ. 9,695 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వమే భరించింది. విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిపడిన రూ. 5,772 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ. 42,632 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ప్రగతి సూచికల్లో తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.
బకాయిలు చెల్లించాకే కొత్త పనులు..
ఉన్నది ఉన్నట్లు చెప్పేందుకు, వాస్తవాలను జనం ముందు ఉంచే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఆర్థిక మాంద్యం కారణంగా కేంద్రం, రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా తగ్గిన మాట కఠిన వాస్తవం. ఈ వాస్తవాల ఆధారంగానే ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసింది. అన్ని శాఖల్లోనూ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాం. దీనికి అనుగుణంగానే ఆయా శాఖలు ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధులు ఖర్చు చేయాలని మంత్రులు, కార్యదర్శులకు ఆర్థికశాఖ సూచనలు చేసింది.
భవిష్యత్తులో అంచనాలు సవరించొచ్చు
మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు మనకు ఉంది.
కేంద్రం నిధులు అంతంతే..
ప్రభుత్వ పన్నుల ద్వారా రాష్ట్రం నుంచి గత ఐదేళ్లలో కేంద్రానికి రూ. 2,72,926 కోట్లు అందగా ఈ నిధుల్లో తెలంగాణ వాటాగా మనకు రూ. 31,802 కోట్లు వచ్చాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను తెలంగాణకు ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నా ఓ ఏడాది నిధులను కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కోసం గత ఐదేళ్లలో అక్షరాలా రూ. 5,37,373 కోట్లు ఖర్చు పెడితే అందులో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం రాష్ట్రానికి అందిన నిధులు రూ.31,802 కోట్లు మాత్రమే.
ఐటీ ఎగుమతుల్లో మేటిగా..
ప్రభుత్వ ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో వృద్ధిరేటు నమోదైంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో గత ఐదేళ్లలో 6.3% అదనపు వృద్ధితో 2018–19 ఆర్థిక ఏడాది నాటికి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటు నమోదు చేయగలిగింది. పారిశ్రామిక రంగం అదనంగా 5.4% అదనపు వృద్ధి సాధించి 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8% నమోదు చేసింది. 2014–15లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లయితే 2018–19 నాటికి రూ. 1.10 లక్షల కోట్లకు చేరుకుంది.
‘ఆయుష్మాన్’కన్నా ఆరోగ్యశ్రీ మెరుగు..
కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పథకాల కోసం ప్రజాధనాన్ని వృథా చేయదలచుకోలేదు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ కంటే మనం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైంది, ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు ఖర్చు చేస్తే ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ. 250 కోట్ల విలువైన వైద్య సేవలే అందుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకే మేలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందవు. ఆయుష్మాన్ భారత్‌కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నోరెట్లు మెరుగైనది కాబట్టి మనం కేంద్ర పథకాన్ని వద్దనుకున్నాం.
పట్టణాలు, గ్రామాలకు మంచి రోజులు..
కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులకు సమానంగా నిధులు జమచేస్తాం. ఈ రెండింటినీ కలిపి గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ. 339 కోట్లను అందించాలని నిర్ణయించాం. ఈ నెల నిధులను ఇప్పటికే గ్రామ పంచాయతీలకు విడుదల చేశాం. ఇదే తరహాలో పట్టణాలకూ నిధుల ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు, పన్నులతోపాటు వివిధ రకాలుగా గ్రామ పంచా యతీలకు సమకూరే ఆదాయం కూడా స్థానిక సంస్థలకు ఉంటుంది. గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నాం.
సంక్షోభంలోనూ సాగుకు ఉచిత విద్యుత్..
ఆర్థిక సంక్షోభం ఉన్నా వ్యవసాయానికి ఉచిత కరెంటు యథాతథంగా కొనసాగుతుంది. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికయ్యే కరెంటు బిల్లుల భారం రైతులపై వేయ కుండా మేమే చెల్లించాలని నిర్ణయించాం. ఎన్నడూ లేనట్లు విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, 6 కిలోల బియ్యం పథకం లాంటి వాటికి నిధుల కొరత రానీయం. రైతుబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు, రైతు బీమా ప్రీమియం చెల్లింపులకు రూ. 1,137 కోట్లు, పంట రుణాల మాఫీకి రూ. 6 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించాం. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్‌లో రూ. 9,402 కోట్లను ప్రతిపాదించాం.
Comments
Please login to add a commentAdd a comment