సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో ఆదివారం ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికోసమే అప్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో అప్పులు 40 శాతం ఉన్నాయని, అదేక్రమంలో రాష్ట్ర అప్పులు 21 శాతం ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించటంలేదని, కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలోనే కట్టి రికార్డులు నమోదు చేశామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులేవీ కనబడటం లేదా అని ప్రశ్నించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క శనివారం చేసిన విమర్శల్ని కేసీఆర్ ఆక్షేపించారు. విక్రమార్క సొంత జిల్లాలో ఏడాదికాలంలోనే భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మించామని సభ దృష్టికి తెచ్చారు. ఏ అంశంపైనైనా అవగాహన పెంచుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.
బడ్జెట్‌లో ప్రతిపైసాకు లెక్కలు చెప్పామని, ఆర్థిక మాంద్యంతో తలెత్తిన ఇబ్బందులను కూడా వివరించామని చెప్పారు. ప్రస్తుతం దేశ ఆర్థికస్థితి బాగోలేదని.. ప్రతి అంశాన్ని పరిశీలించి బడ్జెట్ రూపొందించామని తెలిపారు. బడ్జెట్‌లో కోతపెట్టిన విషయం బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పానని, ఎందుకు కోతపెట్టాల్సి వచ్చిందో కూడా వెల్లడించామన్నారు. అవాస్తవాలు, సత్యదూరమైన విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment