
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సమీక్ష కోసం జిల్లా విద్యాశాఖాధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. జాగ్రత్తలు చూసుకోకుండానే తమ జిల్లాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించి తప్పుడు వివరాలు సమర్పించారు. వాస్తవంగా జీతాలు తీసుకుంటున్న టీచర్లు, ఉద్యోగులు, సిబ్బంది కంటే తక్కువ ఉన్నట్లుగా లెక్కలు చూపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి శాఖల వారీగా ఆర్థికశాఖ కేడర్ స్ట్రెన్త్ వివరాలను సేకరించింది. ఇందులో భాగంగా జిల్లాల్లో డీఈవోల నుంచి విద్యాశాఖకు సంబంధించిన వివరాలను తీసుకుంది.
వాటిపై సీఎం సమీక్ష చేయనున్న నేపథ్యంలో ఆ సమాచారా న్ని మరోసారి పరిశీలించింది. అయితే అందులో తప్పుడు సమాచారం ఉన్నట్లు గుర్తించింది. ట్రెజరీల నుంచి వేతనాలు తీసుకుంటున్న పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులు, టీచర్లు, సిబ్బంది కంటే తమ వద్ద ఉన్న వారి సంఖ్యను తక్కువగా ఇచ్చినట్లు తేల్చింది. సీఎం సమీక్ష కోసం సిబ్బంది లెక్కలు అడిగితే తప్పుడు లెక్కలు ఇస్తారా? అని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. ఈనెల 2లోగా సరైన లెక్కలు ఇవ్వాలని ఆదేశించింది. కేడర్ స్ట్రెన్త్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను tg.dse.ao@gmail.comకి పంపించాలని డీఈవోలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment