సీఎం గారూ.. మమ్మల్ని ఆదుకోండి.. | dsc 1998 candidates appeals cm kcr for justice | Sakshi
Sakshi News home page

సీఎం గారూ.. మమ్మల్ని ఆదుకోండి..

Published Thu, Sep 6 2018 4:27 AM | Last Updated on Thu, Sep 6 2018 4:27 AM

dsc 1998 candidates appeals cm kcr for justice - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికారుల తప్పిదంతో నష్టపోయిన తమను సీఎం కేసీఆర్‌ ఆదుకోవాలని, తమకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని డీఎస్సీ–1998 అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత అసెంబ్లీ సమా వేశాల్లో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల వ్యవహారాన్ని పరిశీలిద్దాం అని పేర్కొన్న సీఎం ఈనెల 6న జరిగే కేబినెట్‌ భేటీలో తమ సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 2015 జనవరిలో కేసీఆర్‌ వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇచ్చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ తర్వాత ఒక సారి జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో 1998 డీఎస్సీ లో నష్టపోయిన వారే కాకుండా 2012 వరకు నిర్వహించి మిగతా 5 డీఎస్సీల్లోనూ నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారందరికీ పోస్టింగ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పలు కారణాలతో ఆచరణకు నోచుకోలేదు. దీంతో సీఎం తమను ఆదుకోవాలని, గురువారం తగిన నిర్ణయం తీసుకోవాలని 1998 డీఎస్సీ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

అసలేం జరిగిందంటే..
1998లో నిర్వహించిన డీఎస్సీలో 100 మార్కుల్లో 15 మార్కులు ఇంటర్వ్యూలకు పోగా 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహించింది. ఇందులో ఓసీలకు 50 మార్కులు, బీసీలకు 45 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ కేటగిరీ వారికి 40 మార్కులను అర్హత గా నిర్ణయించింది. పోస్టుల సంఖ్యకంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో రాత పరీక్షలో కనీస అర్హత మార్కులను 45, 40, 35కు కుదించింది. నియామకాల సందర్భంగా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూల్లో ఎక్కువ వేసి, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన తమను ఎంపిక కాకుండా చేశారని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ  అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై 1999లో ట్రిబ్యునల్‌ అర్హత మార్కులను తగ్గించడమే సరైందికాదని, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంది.

దీనిని సవాలు చేస్తూ 2000లో విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించగా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై విద్యాశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ తీర్పును అమలు చేయలేదు. అప్పటినుంచి 2010 వరకు ట్రిబ్యునల్, హైకోర్టులో మళ్లీ కేసు కొనసాగింది. చివరకు 2011 నవంబర్‌ 8న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, నియామక తేదీ నుంచి సీనియారిటీ, ప్రయోజనాలు కల్పించాలని పేర్కొన్నా అమలు చేయలేదు. అభ్యర్థులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యాశాఖ ఉద్యోగాలు ఇవ్వలేమని కోర్టుకు చెప్పింది. మానవతా దృక్పథంలో వారి అంశాన్ని పరిశీలిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వ రద్దు ఊహాగానాల నేపథ్యంలో ఈనెల 6న నిర్వహించనున్న కేబినెట్‌లో తమకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని 1998 డీఎస్సీ సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement