ఫైనలియర్‌కే పరీక్షలు | CM KCR Review Meeting With Education Department About Academic Year | Sakshi
Sakshi News home page

ఫైనలియర్‌కే పరీక్షలు

Published Fri, Jul 17 2020 1:43 AM | Last Updated on Fri, Jul 17 2020 1:49 AM

CM KCR Review Meeting With Education Department About Academic Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యావ్యవస్థ పవిత్ర తను కాపాడే ఉద్దేశంతో యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని.. మిగిలినవారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు. కరోనా మహమ్మారి వల్ల విద్యాసంస్థలు మూతబడి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి ఏం చేయాలనే అంశంపై గురువారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరం ప్రారం భించాలని సూచించారు. విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుం దని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాలల ఎప్పుడు పునఃప్రారంభించాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం అనాథ ఆడపిల్లలు కస్తూర్బా పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్నారని.. తర్వాత వారి చదువుకు కావల్సిన ఏర్పాట్లు చేసే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని సీఎం స్పష్టంచేశారు. దీనిపై త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.

విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి...
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షలు, సిలబస్‌ తదితర విషయాలపై యూజీసీ,ఏఐపీటీఈ వంటి సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగుపరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నాం. విద్యుత్‌ సమస్య పరిష్కారమైంది. మంచినీటి గోస తీరింది. సాగునీటి సమస్య పరిష్కారం అవుతోంది. వ్యవసాయ రంగం కుదుటపడుతోంది. భూకబ్జాలు లేవు. పేకాట క్లబ్బులు పోయాయి. గుడుంబా బట్టీలు ఆగిపోయాయి. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుతున్నాం. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతాం’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్‌షాప్‌ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘కేసీఆర్‌ కిట్స్‌ పథకం అమలు చేయడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగపడింది. ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఓపీ పెరిగింది. వైద్యరంగంలో దోపిడీ ఆగింది. అదే విధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. దోపిడీ ఆగిపోతుంది’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

సామాజిక కార్యక్రమాలు చేస్తున్నవారిని ప్రోత్సహించాలి..
విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా ఇద్దరు అధ్యాపకుల ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అధికారులు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాటనీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ డాక్టర్‌ పీర్‌ మహ్మద్‌ షేక్‌ గురించి సీఎంకు చెప్పారు. వారిద్దరూ తాము పనిచేస్తున్న చోట పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని తెలిపారు. దీంతో వారిద్దరినీ ప్రోత్సహించాలని, ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. 

సదాశివయ్యకు సీఎం ఫోన్‌..
జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, అక్కడ తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించిన సదాశివయ్యతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడారు. ‘సదాశివయ్యగారూ.. మీ గురించి అధికారులు బాగా చెప్పారు. మీ కృషిని టీవీల్లో స్వయంగా చూశాను. మీ అంకితభావం గొప్పది. మీకు హదయ పూర్వక అభినందనలు. మీరు సంకల్పించినట్లుగానే జడ్చర్లలో బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించండి. దానికి కావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మీలాంటి వాళ్లే సమాజానికి కావాలి. ఈ స్పూర్తిని కొనసాగించండి. పాలమూరు యూనివర్సిటీలో కూడా పెద్దఎత్తున మొక్కలు పెంచండి. మంచి ఉద్దేశంతో చేస్తున్న మీ సామాజిక కార్యక్రమాలను కొనసాగించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’అని సీఎం పేర్కొన్నారు. బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, సీనియర్‌ అధికారులు నవీన్‌ మిట్టల్, ఉమర్‌ జలీల్, దేవసేన పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement