సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు(కేసీఆర్) వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామి ఉందని అన్నారు. 2019–20 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఆయన ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందని, తమ ప్రభుత్వ విధానాలతో మూల ధన వ్యయం పెరుగుతూ వస్తోందని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 10.2 శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయిందన్నారు. ఐటీ రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 8.1 శాతం వృద్ధి నమోదయినట్టు చెప్పారు. ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికిపైగా పెరిగిందని, పారిశ్రామిక రంగంలో అదనంగా అభివృద్ధి సాధించామన్నారు.
గత ఏడాదిన్నర దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 5 శాతం అభివృద్ధి మాత్రమే నమోదైందని కేసీఆర్ తెలిపారు. ఆర్థిక మాంద్యం ఉందన్న విషయాన్ని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయని, దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందన్నారు. వాహనాల కొనుగోలులో 10.6 శాతం తగ్గుదల కనిపిస్తోందని, విమానయాన రంగంపైనా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందని వెల్లడించారు. గూడ్స్ రైళ్ల బుకింగ్ కూడా తగ్గిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి పతనమైందని, డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.40కు పడిపోయిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు. మోటార్ వాహనాలు, ఎక్సైజ్ పాటు అన్ని రంగాల్లో ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నేతర వ్యయం 29 శాతం తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టిందని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉందని వెల్లడించారు. రైతు బంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టత నిచ్చారు. (చదవండి: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్)
Comments
Please login to add a commentAdd a comment