సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు అయిన తర్వాత అవసరం లేకపోయినా ఆరు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్.. ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు ఎత్తేశారని విమర్శించారు. ప్రపోస్డ్ బడ్జెట్‌కే రూ.36వేల కోట్లు కుదించారని, బడ్జెట్ అమలులోకి వచ్చే సరికి ఇంకా తగ్గిస్తారన్నారు. మిగులు బడ్జెట్‌తో వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు.
(చదవండి : తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్)
‘గత ఐదేళ్ల పరిపాలన ఫలితం ఇప్పుడు కలిపిస్తోంది. సీఎం కేసీఆర్‌కు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే అప్పులు పెరిగాయి. ఆయన చేతకానితనాన్ని కేంద్రం మీద రుద్దేందుకు ప్రయత్నింస్తున్నారు. మొదటగా జీఎస్టీని పొడిగిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రాన్ని తిడుతున్నారు. కేసీఆర్ పాలన ఫలితాలు బయటకు రావడంతో కేంద్రాన్ని బదనాం చేస్తున్నారు. కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం నష్టపోతుదుంది’ అని భట్టి ఆరోపించారు.
సీఎం బడ్జెట్ ప్రసంగంలో డబుల్ బెడ్‌రూం, నిరుద్యోగ బృతి, ఉద్యోగ కల్పన మాటలే లేవని ధ్వజమెత్తారు. శ్రీపాద ఎల్లంపల్లితో హైదరాబాద్‌కు నీరు తెచ్చింది కాంగ్రెస్ అయితే... అది తన క్రెడిట్‌గా కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిందేమి లేదు కానీ జలకళ మొత్తం తెచ్చింది ఆయనే అనుకుంటున్నారని విమర్శించారు. మెట్రో రైలు కూడా కేసీఆర్ తీసుకురాలేదన్నారు. గత ప్రభుత్వాల పరిపాలన వల్ల వచ్చిన ఫలితాలను కేసీఆర్ తన ఫలితాలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.హైదరాబాద్‌లో ప్రజల భూములు తనాఖ పెట్టి అప్పులు తెచ్చే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. మియాపూర్‌లోని 800 ఎకరాల భూముల లెక్కలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ భూముల్లో పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్‌లను నిర్మించి ఇవ్వాలని లేదంటే తాము ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment