సాక్షి, హైదరాబాద్
రైతుబంధు పథకం కింద లబ్ధిదారులకు అందించే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో లాంఛనంగా పెంచింది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్లలో ఒక్కో రైతుకు ఎకరానికి రూ. 8 వేలు ఇవ్వగా 2019–20 ఖరీఫ్, రబీల నుంచి ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఖరీఫ్‌లో ప్రతి రైతుకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున, రబీలో ఎకరాకు మరో రూ. 5 వేల చొప్పున అందించనుంది. 2018–19 బడ్జెట్‌లో రైతుబంధుకు రూ. 12 వేల కోట్లు కేటాయించగా ఈసారి కూడా అంతే మొత్తం కేటాయించింది. ఎందుకంటే గత ఖరీఫ్, రబీలకు కలిపి ఇప్పటివరకు కేవలం రూ. 9,554 కోట్లు అందించగా ఇంకా కొంత మేరకు ఇవ్వాల్సి ఉంది.
దీంతో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకొని ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించినట్లు అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం–కిసాన్ కింద ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6వేలు అందించనుండగా తెలంగాణలో మాత్రం కేంద్ర పథకంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందనుంది. పీఎం–కిసాన్ పథకానికి తెలంగాణ నుంచి దాదాపు 26 లక్షల మంది అర్హులుగా తేలారు. వారు కేంద్ర పథకం ద్వారానూ, రాష్ట్ర పథకం ద్వారానూ రెండు విధాలుగా లాభం పొందనున్నారు. ఉదాహరణకు ఐదెకరాలున్న రైతు కేంద్ర పథకం ద్వారా రూ. 6 వేలు పొందితే, అదే రైతు రైతుబంధు ద్వారా వచ్చే ఏడాదికి రూ. 50 వేలు పొందుతాడు. రెండింటి ద్వారా మొత్తంగా రూ. 56 వేల ఆర్థిక సాయం అందుకుంటాడు.
పూర్తిస్థాయిలో అందని రబీ సొమ్ము...
గతేడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతుబంధు కింద చెక్కులను పంపిణీ చేసి 51.80 లక్షల మంది రైతులకు రూ. 5,280 కోట్లు అందజేసింది. అయితే ఎన్‌ఆర్‌ఐలు, ఇతరత్రా వివాదాలుగల వారు ఉండటంతో మరికొందరికి ఇవ్వలేకపోయింది. రబీలోనూ చెక్కుల ద్వారా ఇవ్వాలనుకున్నా ఎన్నికల కారణంతో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే అందజేసింది. ఇప్పటివరకు రబీ సీజన్ కింద 43.60 లక్షల మందికి రూ. 4,724 కోట్లు రైతుబంధు సొమ్ము అందజేశారు. గతేడాది డిసెంబర్ 4 వరకు సక్రమంగానే అందజేసినా ఎన్నికల తర్వాత కొన్ని రోజులు నిధుల కొరతతో సొమ్ము ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. తర్వాత దాదాపు రూ. 700 కోట్లకుపైగా గత బిల్లులను పాస్ చేసి ట్రెజరీ అధికారులు ఎన్‌ఐసీకి సమాచారం ఇవ్వగా అందులో సగం సొమ్ము మాత్రమే బ్యాంకులకు వెళ్లింది. మిగిలిన సొమ్ము వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిధులు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment