సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆర్థిక మాంద్యం ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహుమతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితిని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అంతేగానీ బడ్జెట్‌లో కేటాయింపులేవీ తగ్గించలేదని పేర్కొన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం మాత్రమే బడ్జెట్ తగ్గించడానికి కారణమేమిటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఆర్థిక మాంద్యం ఉందని కేసీఆర్ చెబుతున్నారు. అలాంటప్పుడు సచివాలయం కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించడం అవసరమా. కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి..
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్..తన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ‘ఉత్సవాలను నిర్వహించడం కేంద్ర ప్రభుత్వంలోని అంశం కాదు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతాము అని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment