పట్నానికి పైసల్లేవ్‌! | Telangana State Budget 2019 Special Story | Sakshi
Sakshi News home page

పట్నానికి పైసల్లేవ్‌!

Published Tue, Sep 10 2019 10:28 AM | Last Updated on Mon, Sep 23 2019 9:52 AM

Telangana State Budget 2019 Special Story - Sakshi

గ్రేటర్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. ప్రభుత్వం బడ్జెట్‌లో మొండిచేయి చూపింది.విశ్వనగరం ఆశలపై నీళ్లు చల్లింది. ఊహకందని లెక్కలతో నగరజీవిని ఆశ్చర్యానికి గురిచేసింది. మునుపెన్నడూ లేని విధంగా అరకొర నిధులతో ఉసూరుమనిపించింది. కనీసం ఒక్క విభాగానికైనా సరిపడా నిధులు కేటాయించలేకపోవడం బాధాకరం. ఈ నేపథ్యంలో ఈ నగరం ఇలా ఉండాల్సిందేనా? అని నగరవాసులుప్రశ్నిస్తున్నారు. ఇంకెన్ని రోజులు గుంతల రోడ్లపై ప్రయాణం చేయాలని? ఉప్పొంగే నాలాలతో సహవాసం చేయాలని? ఆస్పత్రుల్లో గంటల తరబడి లైన్లలోనిలబడాలని? రహదారులపై ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకోవాలని? చాలీచాలని సౌకర్యాలతో చదువులు కొనసాగించాలని? నిలదీస్తున్నారు. రాష్ట్ర రాజధానికేఈ మేర నిధులు కేటాయిస్తే ఎలా? అని వాపోతున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి లాంటి కీలకమైన విభాగాలకు అరకొర నిధులే కేటాయించడంతో నగర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపుముఖ్యమైన పోలీస్‌ విభాగానికి ఈసారి నిధులు గణనీయంగా తగ్గడం, గతేడాదితో పోలిస్తే 90శాతం తక్కువ ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు.   

ఔరా! రూ.25 కోట్లు.. రూ.20 లక్షలు
నగరంలో కీలకమైన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు బడ్జెట్‌లోకేటాయించిన నిధులివి. హైదరాబాద్‌ను విశ్వనగరంగాతీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం బల్దియాకు ఇంత తక్కువ స్థాయిలో నిధులు కేటాయించడం విస్మయం కలిగిస్తోంది.మరోవైపు ఆదాయం సమకూర్చే హెచ్‌ఎండీఏకు ఎప్పుడూ లేని విధంగా కేవలం రూ.20 లక్షలే కేటాయిచడంపై అసంతృప్తివ్యక్తమవుతోంది.

సిటీ పోలీస్‌కు ‘మమ’
సాక్షి,సిటీబ్యూరో: రాజధాని నగరంలోని మూడు కమిషనరేట్లకు బడ్జెట్‌ కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సిటీ పోలీసు కమిషనరేట్‌కు 90 శాతం మేర నిధులు తగ్గాయి. అత్యంత కీలకమైన ప్రాజెక్టులకూ అవసరమైన స్థాయిలో కేటాయింపులు లేవు. హైదరాబాద్‌ పోలీస్‌ శాఖకు రూ.56 కోట్లు, సైబరాబాద్‌కు రూ.14 కోట్లు, రాచకొండకు రూ.13 కోట్లు మాత్రమే విదిల్చారు. సిటీకి కేటాయించిన వాటిలో టెక్నాలజీ కోసమే రూ.50 లక్షల ఎలాట్‌మెంట్‌ జరిగింది. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌–క్వార్టర్స్‌ అండ్‌ ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఈ ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యం. దీనికి 2015 బడ్జెట్‌లో రూ.302 కోట్లు మంజూరు చేయగా.. 2016–17 బడ్జెట్‌లో మరో రూ.140 కోట్లు కేటాయించారు. 2017–18లో రూ.145 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.280.8 కోట్లు ఇవ్వగా ఈ బడ్జెట్‌లో దీనికి దక్కింది కేవలం రూ.10 వేలు మాత్రమే. గ్రేటర్‌ నగరం మొత్తాన్ని సీసీ కెమెరా నిఘాలో ఉంచడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి లక్ష సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించారు.

ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే రూ.69 కోట్లు కేటాయించగా 2017–18లో రూ.225 కోట్లు ఇచ్చింది. గత బడ్జెట్‌లో రూ.140 కోట్లు కేటాయించింది. ఈసారి దీనికి కూడా కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. ఆధునిక హంగులతో ఠాణాల నిర్మాణం, ఉన్నవాటికి అదనపు సౌకర్యాల కోసం గత ఏడాది రూ.10 కోట్లు కేటాయించగా... ఈ బడ్జెట్‌లో అది రూ.10 వేలకే పరిమితమైంది. పోలీసు క్వార్టర్స్‌ నిర్మాణం, ఉన్న వాటి అభివృద్ధి, అధికారుల కార్యాలయాలు, సిబ్బందికి బ్యారెక్స్‌ నిర్మాణం, యంత్ర సామగ్రి కొనుగోలు కోసం రూ.50 లక్షలు మాత్రమే నగర కమిషనరేట్‌కు ఈ బడ్జెట్‌లో దక్కాయి. సిటిజన్‌ సెంట్రిక్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ పథకం కింద గత ఏడాది రూ.10 కోట్లు ఇవ్వగా ఈసారి ఆ మొత్తం రూ.10 వేలకు పరిమితమైంది. సైబర్‌ నేరాల కట్టడికి అవసరమైన సాఫ్ట్‌వేర్స్, ఇతర ఉపకరణాలు ఖరీదుతో పాటు క్రైమ్‌ డేటా విశ్లేషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి సంబంధించిన నగర పోలీసులు పంపిన ప్రతిపాదనలపై స్పందించిన సర్కారు గత ఏడాది రూ.12 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ మొత్తం రూ.50 లక్షలకు తగ్గిపోయింది. సైబరాబాద్‌లో మహిళల రక్షణకు రూ.25 లక్షలు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ వింగ్‌కు రూ.2.22 కోట్లు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలుకు రూ.లక్ష, సీసీ కెమెరాల కోసం మరో రూ.లక్ష కేటాయించారు. మొత్తమ్మీద టెక్నాలజీ సమకూర్చుకోవడానికి రూ.10 లక్షల లోపే విదిల్చారు. రాచకొండలో పోలీసుస్టేషన్ల అభివృద్ధికి రూ.7 లక్షలు, సీసీ కెమెరాల ప్రాజెక్టుకురూ.60 లక్షలు, కొత్త పోలీసు కమిషనరేట్‌ నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ మరికొన్నాళ్లు నేరేడ్‌మెట్‌కే పరిమితం కానుంది. 

ఆస్పత్రులకు మొండి చేయి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రభుత్వం బడ్జెట్‌లో మొండి చేయి చూపించింది. నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రులకు మినహా ఇతర ఏ ఒక్క ఆస్పత్రికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పటికే నిధుల లేమితో కునారిల్లుతున్న ఆయా ఆస్పత్రులకు ప్రభుత్వం ఈ సారి కూడా దయ చూపకపోవడంతో మరింత సంక్షోభంలో కూరుకపోన్నాయి. నగరంలో ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్, ఈఎన్‌టీ, సరోజినిదేవి, ఛాతి, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సహా ఏడు ఏరియా ఆస్పత్రులు, 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 105 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. అయితే, నిమ్స్‌ సిబ్బంది వేతనాల కోసం రూ.102.56 కోట్లు కేటాయించింది. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు రూ.25.32 కోట్లు కేటాయించింది.  

‘ఉస్మానియాకు’ పైసల్లేవ్‌
ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికే రెండు, మూడు అంతస్తులను కూడా ఖాళీ చేయించారు. ఇక్కడ కొత్త భవనాలు నిర్మించాలని ఏడాది కాలం నుంచి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్‌ సహా ఒకటో అంతస్తులోనే రోగులను సర్దుతున్నారు. పడకలు ఉన్నప్పటికీ.. అనువైన గదులు లేకపోవడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని దుస్థితి. దీంతో చాలా మంది రోగులను నేలపైనే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. కొత్తగా రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు బడ్జెట్‌లో దాని ఊసే ఎత్తలేదు. ఈ బడ్జెట్‌లో కూడా కేటాయింపులు లేకపోవడంతో ఆస్పత్రి వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

వేతనాలతోనే సరి..
పేద రోగులకు వైద్య సేవలు అందించడంలో గాంధీ జనరల్‌ ఆస్పత్రి పాత్ర కీలకం. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిలో ప్రస్తుతం 2200 మందికి పైగా ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేవు. క్యాజువాలిటీ పునరుద్ధరణ, అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన ఆపరేషన్‌ థియేటర్లు, వైద్య పరికరాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక పేట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సహా కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి, ఛాతి, మానసిక చికిత్సాలయం ఊసెత్తకపోవడం గమనార్హం. ఆయా ఆస్పత్రులకు కేవలం వేతనాల చెల్లింపుతోనే సరిపెట్టింది. ఏరియా ఆస్పత్రులతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల ప్రస్తావన లేకపోవడంతో భవిష్యత్‌లో అవి మరింత సంక్షోభంలో కూరుకపోయే ప్రమాదం లేకపోలేదని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

జలమండలికి నిరాశే
సాక్షి,సిటీబ్యూరో: తాజా రాష్ట్ర బడ్జెట్‌ జలమండలిని తీవ్రంగా నిరాశపరిచింది. మహానగరం పరిధిలో కీలక తాగునీరు, మురుగునీటి పారుదల మాస్టర్‌ప్లాన్‌కు భారీగా నిధులు వస్తాయని ఆశించిన బోర్డు వర్గాల ఆశలు అడియాశలయ్యాయి. ఈ సారి రూ.2300 కోట్ల అంచనాలతో రాష్ట్ర ఆర్ధికశాఖకు ప్రతిపాదనలు సమర్పిస్తే కేవలం రూ.825 కోట్ల నిధులను మాత్రమే విదిల్చారు. ఈ నిధులను కూడా జలమండలి గతంలో వివిధ ఆర్థికసంస్థల నుంచి చేసిన రుణాల వాయిదాల చెల్లింపునకు మాత్రమే ఇవ్వడం గమనార్హం. గతంలో కృష్ణా రెండు, మూడోదశ , గోదావరి మొదటి దశ పథకంతో పాటు, గ్రేటర్‌లో విలీనమైన శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో చేపట్టిన పట్టణ మిషన్‌ భగీరథ పథకానికి హడ్కో నుంచి జలమండలి తీసుకున్న సుమారు రూ.3500 కోట్ల రుణానికి వాయిదాల చెల్లింపునకే తాజా బడ్జెటరీ నిధులు కనాకష్టంగా సరిపోతాయని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. కేశవాపూర్‌ భారీ స్టోరేజి రిజర్వాయర్‌ నిర్మాణం, ఔటర్‌ చుట్టూ జలహారం, ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌–2 తాగునీటి పథకం, రోజూ నీటి సరఫరా, సీవరేజీ మాస్టర్‌ప్లాన్‌ అమలు, పాతనగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థ అధునికీకరణ తదితర అభివృద్ధి పథకాలకు పైసా విదిల్చకపోవడం గమనార్హం. కాగా గతేడాది జలమండలికి రూ.1420 కోట్ల మేర బడ్జెటరీ నిధులు కేటాయించినప్పటికీ ఇందులో కేవలం రూ.890 కోట్లు మాత్రమే మూడు వాయిదాలుగా విడుదల చేశారు. ఇందులోనూ రూ.690 కోట్లు రుణ వాయిదాలు చెల్లించేందుకు వినియోగించినట్లు బోర్డు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మరిప్పుడు కేటాయించిన రూ.825 కోట్ల నిధుల్లో ప్రభుత్వం ఎన్ని రూ.కోట్లు ఇస్తుందో
వేచిచూడాలి.  

ఒక్క రూపాయీ లే‘దయా’
ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించ లేదు. దీంతో మెట్రో రెండోదశ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ప్రాజెక్టు విస్తరణ చేపట్టేందుకు అవసరమైన ఆస్తుల సేకరణకు ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం, ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మూడు మెట్రో కారిడార్లలో స్ట్రీట్‌ ఫర్నిచర్‌ అభివృద్ధి, సుందరీకరణ పనులు, గార్డెనింగ్, ప్రజోపయోగ స్థలాలను అభివృద్ధి చేయడం వంటి పథకాలకు పైసా నిధులు కేటాయించలేదు. దీంతో ఈ పనులు ముందుకుసాగే పరిస్థితి లేదు. గతేడాది బడ్జెట్‌లో హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థకు రూ.323 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ.. ఈ సారి అదేస్థాయిలోనైనా నిధులు విడుదల చేస్తారనుకున్న హెచ్‌ఎంఆర్‌ వర్గాలకు తాజా బడ్జెట్‌ షాక్‌నిచ్చింది.

యూనివర్సిటీలకూ అరకొరే
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విశ్వవిద్యాలయాలకు అరకొర నిధులతోనే సరిపెట్టింది. కేవలం ఉద్యోగుల వేతనాల కోసమే కేటాయింపులు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.309 కోట్లు కేటాయించగా, జేఎన్‌టీయూకు రూ.16 కోట్లు, తెలుగు విశ్వవిద్యాలయానికి రూ.22 కోట్లు, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి రూ.16 కోట్ల చొప్పున కేటాయించారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త హాస్టళ్ల నిర్మాణం, అదనపు తరగతులు, ఫర్నిచర్‌ కొనుగోలు, ప్రయోగశాలల్లో పరికరాలు, కంప్యూటర్లు, ఇతర వస్తువుల కొనుగోలుకు నిధులు కేటాయించక పోవడం గమనార్హం.  

‘మహా’ ఆశలు తలకిందులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్‌ తీవ్ర ప్రభావం చూపించనుంది. ఓఆర్‌ఆర్‌ జైకా రుణం, ఓఆర్‌ఆర్‌ బీవోటీ అన్యూటీ చెల్లింపుల కింద గతంలో పెండింగ్‌లో ఉన్న వాటితో కలిపి రూ.1800 కోట్లు కేటాయించాలని హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలిస్తే ప్రభుత్వం కేవలం రూ.20 లక్షలు మాత్రమే విదిల్చింది. 2019–20లో ఓఆర్‌ఆర్‌ జైకా రుణం కింద కాంట్రాక్టర్లకు రూ.70 కోట్లు, బీవోటీ అన్యూటీ పేమెంట్‌ కింద రూ.331.38 కోట్లు హెచ్‌ఎండీఏ చెల్లించాలి. ఇప్పుడు బడ్జెట్‌ కేటాయింపుల్లో సంస్థకు నిధులు ఇవ్వకపోవడంతో ఈ ఏడాదికి చెల్లించాల్సిన రూ.401.38 కోట్లలో రూ.401.18 కోట్లు హెచ్‌ఎండీఏ సమకూర్చుకోవలి. అయితే హెచ్‌ఎండీఏకు ఆదాయం సమకూరే ఓఆర్‌ఆర్‌ టోల్‌ ఫీజు ఆదాయంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు, బిల్డింగ్, లేఅవుట్‌ పర్మిషన్ల రూపంలో వచ్చే రెవెన్యూతో పూడ్చాల్సి ఉంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏకు ఎల్‌ఆర్‌ఎస్‌ రూపంలో సమకూర్చిన రూ.1000 కోట్లలో రూ.600 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో చాలావరకు సగంలో ఉన్నాయి. వీటికి మరిన్ని నిధులు అవసరముంది. బాలానగర్‌ ఫ్లైఓవర్, మంగళ్‌పల్లి, బాటాసింగారం లాజిస్టిక్‌ హబ్‌లు, హుస్సేన్‌సాగర్‌ వద్ద లేక్‌ఫ్రంట్‌ పార్కు, హరితహరం కింద మొక్కల పెంపకం మిగిలిన నిధులు ఖర్చుపెట్టాలనే ప్రణాళిక ఉంది. ఉప్పల్‌ భగాయత్‌ ద్వారా సమకూరిన రూ.600 కోట్లను ఓఆర్‌ఆర్‌ గ్రోత్‌ కారిడార్‌లోని రోడ్ల అనుసంధానం, అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్ల నిర్మాణం, రేడియల్‌ రోడ్లు, ఓఆర్‌ఆర్‌ చుట్టూ గ్రీనరీ, ఉప్పల్‌ భగాయత్‌లో మినీ శిల్పరామం రెండో విడత ప్రాజెక్టుకు వ్యయం చేయాలని నిర్ణయించారు. కోకాపేటలో భూముల విక్రయం ద్వారా వచ్చే వేల కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వానికే బదలాయించాల్సిన పరిస్థితి. ఈ లెక్కన హెచ్‌ఎండీఏకు వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు చెల్లింపులకు ఉపయోగించాల్సిందే. దీంతో ఇది అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుందని హెచ్‌ఎండీఏ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

అవి కాగితాలకే పరిమితమా!
నగరంపై పడుతున్న ట్రాఫిక్‌ను తగ్గించేందుకు మియాపూర్‌లో నిర్మించాలనుకున్న ఇంటర్‌సిటీ బస్‌ టెర్మినల్‌(ఐసీబీటీ) ఇప్పటికి మొదలుకాలేదు. పెద్దఅంబర్‌పేటలో ఐసీబీటీ, శంషాబాద్‌లో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు, శంషాబాద్, మనోహరబాద్, పటాన్‌చెరు, శామీర్‌పేటలోనూ లాజిస్టిక్‌ హబ్‌లను ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపడితే రూ.200 కోట్ల వరకు వ్యయం అవవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో నిధుల కేటాయింపు లేకపోవడంతో ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే పరస్థితి లేదు. 

మినీ పట్టణాలు ఇక లేనట్టే!
మాస్టర్‌ ప్లాన్‌ గ్రోత్‌ కారిడార్‌(2008) ప్రకారం దాదాపు 158 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఇరువైపులా దాదాపు 764 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్‌ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం లక్ష ఎకరాలు అవసరమవుతాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఇలా దాదాపు 30 వేల ఎకరాలు పోనుంది. పది వేల ఎకరాలు ప్లాటింగ్‌ చేసిన భూములున్నాయి. వీటిని కూడా ఏం చేసేందుకు వీలులేదు. మిగిలిగి 60 వేల ఎకరాల్లో గ్రిడ్‌ రోడ్లు అభివృద్ధి చేస్తే నగర శివారు ప్రాంతాలు మినీ పట్టణాలుగా అభివృద్ధి చెందడం ఖాయం. కానీ భూసేకరణ కష్టమని, వేల కోట్ల ఖర్చవుతుందని ఆ ఊసెత్తడం లేదు. ఇప్పడూ తాజా బడ్జెట్‌ పరిస్థితి చూశాక హెచ్‌ఎండీఏపైనే భారం పడటంతో ఈ మినీ పట్టణాలు కష్టమే కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

ఓఆర్‌ఆర్‌కు చెల్లించాల్సింది రూ.1,229.83 కోట్లు  
హెచ్‌ఎండీఏ సొంతంగా రుణంతీసుకొని రూ.500 కోట్లతోగచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు 24.38 కి.మీ రోడ్డును 2010 జూలై నాటికి పూర్తి చేసింది. తర్వాత బీవోటీ పద్ధతిన నార్సింగ్‌ నుంచి పఠాన్‌చెరు, శామీర్‌పేట నుంచి పెద్దఅంబర్‌పేట 62.30 కి.మీ 2011 ఆగస్టులో పూర్తిచేసింది. అప్పటి నుంచి ఏటా బీవోటీ అన్యూటి పేమెంట్‌ కింద రెండు వాయిదాల్లో రూ.331.38 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. ఈ చెల్లిపుంఉల 2022 డిసెంబర్‌తో పూర్తి చేయాలి. జైకా రుణాలతో పటార్‌చెరు నుంచి శామీర్‌పేట, శామీర్‌పేట నుంచి పెద్దఅంబర్‌పేట వరకు 71.32 కిలోమీటర్ల రోడ్డు వేశారు. ఈ పనులకు దాదాపు రూ.2,300 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించిన జైకా తర్వాత నుంచి రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే హెచ్‌ఎండీఏ కోసం కాంట్రాక్టర్లు చేసిన పనికి డబ్బులు చెల్లించి ఆ క్‌లైయిమ్‌ బిల్లులను హెచ్‌జీసీఎల్‌ ద్వారా జైకాకు పంపితే అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ద్వారా చెల్లింపులు చేస్తోంది. ఇలా 2016 నుంచి హెచ్‌ఎండీఏ కాంట్రాక్టర్లకు రూ.390 కోట్లుచెల్లించింది. 2020 డిసెంబర్‌ నాటికి పూర్తికానున్న ఈ జైకా రుణానికి మరో రూ.70 కోట్లు ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌కు చెల్లించాలి. అలాగే బీవోటీ పద్ధతిన కాంట్రాక్టర్లకు మరో ఏడు అన్యూటీలు అంటే 2022 డిసెంబర్‌ వరకు రూ.1,159 కోట్లు చెల్లించాల్సి ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు అంటున్నారు. అయితే, తాజా బడ్జెట్‌తో బోర్డు ఆశలన్నీ గల్లంతయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement