సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం దెబ్బ విద్యాశాఖపైనా పడింది. పొదుపు పాటిస్తూ ప్రగతిపద్దుతోపాటు నిర్వహణ పద్దులోనూ కోత పెట్టింది. గతేడాది ప్రతిపాదిత అంచనాలతో పోల్చితే ఈసారి రూ.3,378.35 కోట్లకు కోత పెట్టగా, సవరించిన అంచనాలతో పోల్చితే రూ. 2,929.75 కోట్లకు కోత పడింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ విద్యారంగం వాటా 7.6 శాతం ఉండగా, ఈసారి మాత్రం 6.75 శాతానికి విద్యారంగం బడ్జెట్ తగ్గిపోయింది. గతేడాది బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.13,278.19 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానిని రూ. 12,823.57 కోట్లకు సవరించింది. ఈసారి రూ.1,46,492 కోట్ల మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.9,899.82 కోట్లు కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.8,209.03 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యకు రూ.1,367.88 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.322.91 కోట్లు కేటాయించింది.
ఇవీ విభాగాల వారీగా కేటాయింపులు..
పాఠశాల విద్యకు కేటాయించిన మొత్తంలో పాఠశాలవిద్యకు రూ.7,781.5 కోట్లు, ప్రభుత్వ పరీ క్షల విభాగానికి రూ.24.62 కోట్లు, వయోజన విద్యకు రూ.22.76 కోట్లు, ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.51.35 కోట్లు, జవహర్ బాలభవన్ కు రూ.4.21 కోట్లు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి రూ.35.9 కోట్లు, రాష్ట్ర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు రూ.147.52 కోట్లు, సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ. 135.4 కోట్లు, ఇతరాల కింద మిగతా నిధులను కేటాయించింది. ప్రగతిపద్దులో రూ.693.3 కోట్లే కేటాయించడంతో పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు ఈ కేటాయింపులు సరిపోవని విశ్లేషకులు అంటున్నారు.
కేంద్ర పథకాల కేటాయింపుల్లో కోత..
గతేడాదితో పోల్చితే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన మొత్తాల్లో భారీగా తగ్గించింది. సమగ్ర శిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ , ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సివిల్ వర్క్స్ వంటి వాటిల్లో కేటాయింపులను తగ్గించింది. ఈసారి ఈ పథకాల కోసం రూ.491.56 కోట్లు కేటాయించింది.
వర్సిటీలకు మొండిచేయి
రాష్ట్రంలో ఉన్నత విద్యకు, ముఖ్యంగా యూనివర్సిటీల వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించింది. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల నిర్వహణ కోసం, వాటిల్లో పనిచేసే అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది వేతనాల కోసం నిర్వహణ పద్దు కింద రూ.1,312.55 కోట్లు కేటాయించింది. గతేడాది ఇందుకోసం రూ.1,663.63 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి అందులోనూ దాదాపు రూ.351 కోట్లు కోత పెట్టింది. ప్రగతి పద్దు కింద మొత్తంగా రూ.55.32 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం యూనివర్సిటీలకు పెద్దగా నిధులను ఇవ్వలేదు. యూనివర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధనలు, నిర్మాణాలు ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణకు పైసా ఇవ్వలేదు. ఒక్క తెలుగు యూనివర్సిటీకి మాత్రం ఇతర సహాయక గ్రాంట్ల కింద కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. మిగతా యూనివర్సిటీలకు పైసా ఇవ్వలేదు. ప్రగతిపద్దు కింద 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.420.89 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానిని రూ. 375.64 కోట్లకు సవరించింది. 2018–19 ఆర్థికసంవత్సరంలో రూ.210.42 కోట్లను కేటాయించిన ప్రభుత్వం దాన్ని రూ.173.16 కోట్లకు సవరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఎన్‌ఎస్‌ఎస్, రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద రూ.14.85 కోట్లు కేటాయించింది.
సాంకేతిక విద్యాభివృద్ధికి రూ. 2.62 కోట్లు
సంప్రదాయ యూనివర్సిటీల తరహాలోనే సాంకేతిక విశ్వవిద్యాలయం, విశ్వ విద్యాలయాల కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధనలకు పైసా కేటాయించలేదు. యంత్రాల కొనుగోళ్ల కోసం రూ.2 కోట్లు, ఇతర చెల్లింపులకు రూ.60 లక్షలు, స్కాలర్‌షిప్‌ల కోసం రూ.2 లక్షలు కేటాయించింది. దీంతో అవి ఏ మూలకు సరిపోవని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గతేడాది ప్రగతి పద్దు కింద రూ.60.85 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, దానిని రూ.50.07 కోట్లకు సవరించింది. ఈసారి మాత్రం రూ.2.62 కోట్లతో సరిపెట్టింది. జీతభత్యాలు, ఇతరత్రా నిర్వహణ, ప్రయాణ ఖర్చుల కింద అవసరమైన నిధులను మాత్రమే కేటాయించింది. నిర్వహణ పద్దు కింద గతేడాది రూ.361.44 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి దానిని రూ. 320.29 కోట్లకు పరిమితం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment