సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పారిశుధ్య చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. ఈ మేరకు చట్టంలో పలు నిబంధనలను పొందుపరిచింది. అనుమతి లేకుండా మాంసం విక్రయించినవారికి రూ.200, జంతువధశాల బయట గొర్రెలు, మేకలు, పశువులను వధిస్తే రూ.2 వేలు జరిమానా విధిస్తారు. తాగునీటి వనరులకు రెండు వందల మీటర్ల లోపు జంతు కళేబరాన్ని పారవేసినా, పాతిపెట్టినా.. రోడ్డుపై, మార్కెట్ వద్ద, బావుల దగ్గర, చెరువుల వద్ద వినోద కార్యక్రమాలను నిర్వహించినా రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ దుకాణాలు ప్రారంభించకుండా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రభుత్వస్థలంలోగానీ, రోడ్డుపైనగానీ ప్రైవేటు మార్కెట్‌ను నిర్వహిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తారు.
పంచాయతీ పాలక వర్గానికి అధికారం
పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ నిబంధలను కఠినతరం చేశారు. అనుమతి లేకుండా చెట్టు నరికితే ఏకంగా రూ.2 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. పంచాయతీ ఆస్తులు ఆక్రమించితే చర్యలతోపాటు ఇదే మొత్తంలో అపరాధ రుసుమును విధించే అధికారం గ్రామపంచాయతీకి ఉంటుంది. రోడ్డు నిర్మాణాలు, ఇతర తవ్వకాల సమయంలో మట్టిని, రాళ్లను అక్కడి నుంచి తరలించే విషయంలో జాప్యం చేసినా రూ.2 వేలు జరిమానా ఉం టుంది. రోడ్డుపై, ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ఎడ్ల బండ్లను నిలిపినా ఇదే రకమైన చర్యలు ఉంటాయి. అనధికారికంగా ఇంటి నంబరు మార్చినా, కనిపించకుండా చెరిపేసినా రూ.50 జరిమానా ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించే అధికారం పూర్తిగా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఉంటుంది. గ్రామ పంచాయతీ తరఫున కార్యదర్శి నిర్ణయాలను అమలు చేస్తారని చట్టంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment