సాక్షి, అమరావతి: ‘‘పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుపై ఇంతకు ముందే సవివరంగా చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ పూర్తయ్యాకే బిల్లును మండలికి పంపించారు. అక్కడ కొన్ని సవరణలతో ఆమోదం పొంది బిల్లు మళ్లీ శాసన సభకు వచ్చింది. ఈ బిల్లుపై ఇప్పటికే సుదీర్ఘ చర్చ జరిగినందున, మళ్లీ చర్చ జరపాలని ప్రతిపక్షం కోరడం సరైంది కాదు’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ సభ్యులకు హితవు పలికారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో చర్చ జరగకుండానే బిల్లును ఎలా ఆమోదిస్తారంటూ ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. (చదవండి: ఏపీ అసెంబ్లీ, మండలి: లైవ్ అప్‌డేట్స్)
ఈ క్రమంలో సీఎం జగన్ జోక్యం చేసుకుని ఈ మేరకు సభకు వివరణ ఇచ్చారు. ‘ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంది. పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి గతంలోనే సభలో చర్చ జరిగింది. ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత మండలికి పంపిస్తే, వారు దాన్ని వెనక్కి పంపించారు. ఆ తర్వాత మళ్లీ వారు నో చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ 151 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే సభలో ప్రభుత్వం గతంలో ఏమనుకుందో, దాన్నే తిరిగి ఆమోదిస్తున్నాం. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. అయితే ఇది కొత్తగా పెడుతున్నట్లు, వారికి ఏమీ తెలియనట్లు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా బిల్లు పెడతున్నట్లు అభ్యంతరం చెబుతున్నారు. ఎన్నికల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు ఖర్చు పెడితే, ఆ తర్వాత వారిపై చర్య తీసుకునే విధంగా వినూత్నంగా ఈ చట్టం చేస్తున్నాం. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టకుండా చేయడం కోసమే ఈ చట్ట సవరణ.
అదే విధంగా ఏ రకంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా మార్పులు చేస్తున్నాం. దీనిపై గతంలోనే విస్తృత చర్చ జరిగింది. ఇక్కడ ఆమోదించి మండలికి పంపిస్తే, వారు వెనక్కి పంపారు. కాబట్టి ఫార్మాలిటీగా ఇప్పుడు బిల్లును ప్రవేశపెట్టాం. అంతే తప్ప, ఆయన (చంద్రబాబు) ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు’’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ జరుగకుండానే ఆమోదం తెలిపారంటూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. వ్యవసాయంపై చర్చ కావాలని వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. అదే అంశంపై చర్చ జరుగుతుంటే సభ నుంచి నిష్క్రమించడం గమనార్హం. కాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే, ఏపీ పంచాయతీ రాజ్ చట్టం సవరణ బిల్లు–2020ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.(చదవండి: చంద్రబాబుది బషీర్‌బాగ్ కాల్పుల చరిత్ర)
Comments
Please login to add a commentAdd a comment