గ్రామీణ వికాసానికి గాలి వీస్తోంది | Dileep Reddy Article On Rural Development | Sakshi
Sakshi News home page

గ్రామీణ వికాసానికి గాలి వీస్తోంది

Published Fri, Feb 8 2019 12:29 AM | Last Updated on Fri, Feb 8 2019 12:29 AM

Dileep Reddy Article On Rural Development - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రైతు కేంద్రంగా పాలకుల విధానాలు మారుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి వంటి పథకాలతో ప్రజానుకూల ప్రభుత్వ విధానాలు, నేరుగా ప్రజలకు ఫలాలు అందించడం అనే పద్ధతికే ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీలో అన్ని వ్యవహారాలు పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో సాగించే పంథాను బాబు ఎంచుకున్నారు. పార్టీ శ్రేణుల్ని పాలనలో దొడ్డిదారి భాగస్వాముల్ని చేయడం ద్వారా, స్థానిక పంచాయతీ పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ చీకటిని తొలగించే కొత్త వెలుగు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిరీక్షిస్తున్నారు. మార్పు కోసం ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీలు ఎదురుచూస్తున్నాయి.

పల్లెకు మంచి రోజులొస్తున్నాయి. సానుకూల వాతావరణం పెరుగుతోంది. ఇక ‘కనిపించని కుట్రల’ను ఛేదించే చొరవ గ్రామస్తులే తీసుకోవాలి. పల్లె కన్నీరు తుడవాలి. సుదీర్ఘకాలం వ్యవసాయం కుదేలవటం వల్ల గ్రామ స్వరూపం మారింది. చేతి వృత్తులు భంగపడి గ్రామం బోసి పోయింది. ఉద్యోగ–ఉపాధి అవకాశాలు సన్నగిల్లి పట్టణాలు, నగరాలకు వలసలు పెరిగాయి. పాలకుల నిర్లక్ష్యమూ తోడై చాన్నాళ్లుగా పల్లె కళ తప్పింది. నిన్నా, ఇవాల్టి వరకు ఏ ఊరు చూసినా జీవం కోల్పోయిన అచే తన కొట్టొచ్చినట్టు కనిపించేది. పరిస్థితులు మెలమెల్లగా మారుతు న్నాయి. పట్టణ, నగర జీవుల్లోనూ పుట్టినూరుపై మమకారం పెరుగు తోంది. చుట్టపు చూపుగానైనా సాగే సొంతూరు పర్యటనలు పెరుగుతున్నాయి. పల్లెతో బంధాన్ని పెనవేస్తున్నారు. పెరిగిన శాస్త్రసాంకేతిక పుణ్యమా అని గ్రామాల్లోనే ఏదైనా సమకూర్చుకునే వెసలుబాటొచ్చింది. నగర జీవనంపై మొహం మొత్తిన సంపన్నులూ, విడిదిలానైనా బాగుంటుందని ఊరితో బంధం పునరుద్దరిస్తున్నారు.

పాలకుల విధానాల్లో, రాజకీయ దృక్కోణంలోనూ గ్రామీణ భారతానికి ప్రాధాన్యత పెరుగు తోంది. నాయకుల ఓట్ల గురి కావచ్చు, సంక్షోభం నుంచి రైతును గట్టె క్కించే సర్కార్ల చేయూత కావచ్చు, మారిన పరిస్థితుల్లో గ్రామాలకు నేరుగా నిధులు రావడం కావచ్చు.. కారణం ఏమైతేనేం పల్లెకు ప్రాధా న్యత లభిస్తోంది. కేంద్రం ప్రకటించిన పలు అభివృద్ధి–సంక్షేమ కార్యక్ర మాల్లోనూ గ్రామం కేంద్రబిందువుగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ పరిస్థితులు ఆశావహంగా కనిపిస్తు న్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలై తాజా సర్కారు ఏర్పడ్డ క్రమం లోనే పంచాయతీ ఎన్నికలూ ముగిసి గ్రామాలకు కొత్త పాలకులొచ్చారు. పంచాయతీరాజ్‌ కొత్త చట్టం విస్తృతాధికారాలు కల్పించడంతో పాటు స్థానిక పాలకుల బాధ్యతల్నీ పెంచింది. ఏపీ రాష్ట్రం ఇపుడు శాసనసభ ఎన్నికల ముంగిట్లో నిలిచింది. గ్రామీణ పాలనా విధానం సమూల మార్పు సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త వెలుగుకోసం జనం నిరీ క్షిస్తున్నారు. పల్లెల పునరుద్ధరణకు తెలుగునాట ఇది మంచి తరుణం.

విభజనతో రెండు నమూనాలు
విభజన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ, ఏపీల్లో రెండు వేర్వేరు గ్రామీణ పాలనా నమూనాలు ఆవిష్కృతమయ్యాయి. తెలంగాణలో ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఒక నమూనా అమలు చేస్తే, ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు మరో నమూనాతో వెళ్లారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారుల ఎంపిక నుంచి అన్ని వ్యవహారాలు పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో సాగించే పంథాను బాబు ఎంచుకున్నారు. పార్టీ శ్రేణుల్ని పాలనలో దొడ్డిదారి భాగస్వాముల్ని చేశారు. స్థానిక పంచాయతీ పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ దేశంలో బహుళ ప్రచారంలో ఉన్న కమ్యూనిస్టు పాలకుల ‘పశ్చిమ బెంగాల్‌’ నమూనానే ఆయన నమ్ముకున్నారు. తద్వారా సుదీర్ఘకాలం అప్రతిహతంగా రాజ్యం చేయాలనుకున్నారు. పార్టీ శ్రేణులతో జన్మభూమి కమిటీల ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. కానీ, అదొక విఫల నమూనాగా ధ్రువపడిన విష యాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోలేదు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ కూడా బెంగాల్‌లో అదే నమూనాతో ‘పార్టీ శ్రేణుల’ కేంద్రకంగా సాగిస్తున్న పాలన క్రమంగా బెడిసికొడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లోనూ అవే సంకేతాలు, అవినీతి ప్రజల కళ్లకు కట్టినట్టు కనిపించడం ఈ నమూనాలో బహిరంగ రహస్యం! దీనిపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్‌ భిన్నమైన పంథాలో పాలనసాగించారు. ప్రజానుకూల ప్రభుత్వ విధానాలు, అధికార యంత్రాంగంపై సరైన అజమాయిషీ, నేరుగా ప్రజలకు ఫలాలు అందించడం.. అనే పద్ధతికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి.. ఇవన్నీ ఇటువంటివే! పార్టీ శ్రేణుల్ని పాలనలోకి జొరనివ్వలేదు. అందుకే, తమ వ్యక్తిగత అవసరాలు తీర్చలేదని స్థానిక నాయకత్వంపైన, ప్రజాప్రతినిధులపైన ప్రజల్లో బలమైన అసంతృప్తి ఉన్నా, వ్యతిరేకత వెల్లువెత్తినా... ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్‌ అన్నీ తానై ప్రచారం చేసి ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలిచారు. ఘన విజయం సాధించారు. ఇటీవలి కాలంలో పాలకపక్ష శ్రేణులు ప్రజాభిప్రాయాన్ని సర్కా రుకు అనుకూలంగా మలచలేకపోతున్నాయనే ఒక అధ్యయన నివేదిక కేసీఆర్‌ను బాగా ప్రభావితం చేసినట్టుంది. అందుకే ఆయన తొలి నుంచి జాగ్రత్త పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పుష్కరకాలం పైగా ఉద్యమించిన పార్టీ అయినా, అధికారంలోకి వచ్చాక పార్టీ శ్రేణుల విచ్చలవిడితనాన్ని ఆయన ప్రోత్సహించలేదు. అట్టడుగుస్థాయిలో జనాభిప్రాయాన్ని పాలక పక్ష శ్రేణులు ఓటుగా మలిచే ప్రభావం క్రమంగా సన్నగిల్లుతోందని ‘అభి వృద్ధి సమాజాల అధ్యయన కేంద్రం’(సీఎస్డీఎస్‌) పరిశీలనలో వెల్లడైంది.

పార్టీలకతీతంగా గ్రామాలు ఎదగాలి
తెలంగాణలో కొత్త పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చింది. వారం కిందటి నుంచి కొత్త సర్పంచులు, పాలకమండళ్ల పాలన మొదలయింది. పార్టీలతో నిమిత్తం లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో యువతరం ఉత్సాహం పతాకస్థాయికి చేరింది. పెద్ద సంఖ్యలో యువత సర్పం చులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రధాన పార్టీలు కూడా పెద్దగా పట్టింపులకు వెళ్లలేదు. ఒక పార్టీకే చెందిన ఇద్దరు, ముగ్గురు కూడా పోటీ చేశారు. పదేళ్లపాటు రిజర్వేషన్లు మారవనేది ప్రభావం చూపింది. బాగా పనిచేస్తే మరో దఫా ఎన్నికవొచ్చన్న భరోసా కలిగింది. ఈ సారి పట్టణాలు, నగరాల్లోని వ్యాపార–వాణిజ్య వేత్తలు, సంప న్నులు, మేధావులు తమ సొంతూళ్ల పంచాయతీ ఎన్నికల పట్ల ఆసక్తి చూపారు. అక్కడక్కడ తమ వారనుకునే అభ్యర్థులకు మద్దతో, సహాయ సహకారాలో అందించారు. పలుచోట్ల పట్టుబట్టి గెలిపించుకున్నారు. ఇదొక ప్రగతి సంకేతం! గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేయడంలో, నిధుల్ని సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధి సాధించడంలోనూ ఈ సహకారం కొనసాగాలి. పల్లె పట్టణం పెనవేయాలి.

త్వరలో పంచాయతీ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వనున్న శిక్షకులను చైతన్యపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీయార్‌ ప్రభుత్వ సంకల్పాన్ని విస్పష్టంగా చెప్పారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తులే బాధ్యత వహించాలన్నారు. పాల కమండళ్లు నిబద్దతతో, లక్ష్యసాధనపై గురి–జవాబుదారితనంతో పనిచే యాలని పిలుపునిచ్చారు. 15వ ఆర్థిక సంఘం, కేంద్ర–రాష్ట్ర పథకాలు, ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ–ఎంపీల అభివృద్ధి నిధులు.. ఇలా వివిధ పద్దతుల్లో గ్రామాలకు రాబోయే అయిదేళ్లలో నలబై వేల కోట్ల రూపాయలు రాను న్నాయని చెప్పారు. తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీలు న్నాయి. ఇదొక సువర్ణావకాశం. కొత్త చట్టం ఎన్నో అవకాశాల్ని కల్పి స్తోంది. ప్రతి రెండు నెలలకోసారి జరిగే గ్రామ సభలో గ్రామస్థులు విధిగా పాల్గొని, అభివృద్ది–సంక్షేమాన్ని గరిష్టంగా సాధించుకోవాలి. అధికారాలే కాకుండా వైఫల్యాలకు ప్రజాప్రతినిధుల్ని బాధ్యుల్ని చేసే, అవసరమైతే సర్పంచ్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేసే నిబంధనలు కూడా చట్టంలో ఉన్నాయి. అలా అని, పాలకపక్షం తన రాజకీయ ప్రయోజ నాలు నెరవేర్చుకునే సాధనంగా, దీన్ని సర్పంచుల ‘తలపై నిరంతరం వేలాడే కత్తి’ చేయకుండా ప్రజలే ప్రతిఘటించాలి. అవినీతిని అడ్డగించి, మంచిని సాధించుకునేలా నిఘావేయాలి.

రాజ్యాంగేతర శక్తులకు చరమగీతం
విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి అవకాశాలు క్రమంగా సన్నగిల్లాయి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది దారుల ఎంపికలో ఏ రాజ్యాంగబద్దత లేని జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యతనివ్వటంతో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ చీకటిని తొల గించే కొత్త వెలుగు కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. చట్టబద్దమైన గ్రామసచివాలయాన్ని కేంద్రబిందువుగా చేసి, గ్రామీణ వికాసానికి బాటలు పరుస్తామని విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి చెబుతున్న మాటలు ఇక్కడి ప్రజల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. దానికి కారణం, గ్రామీణ పాలనా వ్యవస్థను ఏపీలో బాబు ప్రభుత్వం బలహీనపరచడమే! ప్రజలతో ఎన్నికైన సర్పంచులు, పాలక మండళ్లను నిర్వీర్యం చేసి, పార్టీ కార్యకర్తలు కీలకంగా ఉండే జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించింది. రేషన్‌కార్డులు, ఇళ్లు, పెన్షన్లు... ఇలా ఏ ప్రయో జన  లబ్దిదారుల ఎంపికలోనైనా వారిదే కీలక భూమిక! కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా రాష్ట్ర కేంద్రీకృత పథకాలకు దారి మళ్లించడం ఇక్కడ రివాజయింది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిదులకు కూడా దిక్కులేని పరిస్థితి! రెండు వేల జనాభా ఉన్న గ్రామాలకు కూడా ఏటా 9 లక్షల రూపాయలకు తగ్గని నిధులు వస్తున్నా, అవి నేరుగా గ్రామాభివృద్ధికి దక్కడం లేదు. చంద్రన్న బాట, సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌.. ఇలా ఏవేవో పథకాల్లోకి మళ్లించి వ్యయం చేస్తున్నారు. స్థానికంగా పన్నులు విధిం చడం ద్వారా ఏటా లభించే దాదాపు 500 కోట్ల రూపాయల్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కేంద్రీకృత కార్యక్రమాల్లో వ్యయం చేస్తున్నారు. గ్రామాల స్థానిక పరిస్థితిని బట్టి, అక్కడి అవసరాలు తీర్చుకునే వెసు లుబాటు కూడా వారికి లేకుండా చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగనున్న వేళ, ఈ దుస్థితిని తప్పించే అవకాశం కోసం ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీలు నిరీక్షిస్తున్నాయి.

ఇదే మంచి తరుణం
గ్రామీణ వికాసానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్టు ఇటీవలి బడ్జెట్‌ స్పష్టం చేసింది. రైతుకు పెట్టుబడి, అసంఘటిత కార్మికులకు పెన్షన్, వైద్య పథకం విస్తరణ, గ్రామీణ రోడ్లు 3 రెట్లు పెంచడం, ‘గ్రామ్‌ జ్యోతి’ ప్రాధాన్యత, లక్ష గ్రామాల డిజిటలైజేషన్, ఉపాధిహామీకి నిధుల పెంపు... వంటివన్నీ గ్రామీణ వికాసానికి సానుకూల చర్యలే! కేంద్ర రాష్ట్రాలు కలిసి గ్రామాలను ఆర్థిక, ఉత్పత్తి కేంద్రాలుగా చేయాలి. గ్రామీణ గ్రోత్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మార్కెట్‌ సదు పాయాలు పెంచాలి. స్థానికంగా ఉద్యోగ–ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగుపరచాలి. ఇదొక మంచి తరుణం. గ్రామీణ ప్రజానీకం, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చు కోవాలి, సానుకూలంగా మలచుకోవాలి. ప్రగతి పల్లవించాలి, మళ్లీ పల్లెలు వికసించాలి. గడపగడపన ఆనందం వెల్లివిరియాలి. పూజ్య బాపూజీ కలలుకన్న ‘గ్రామస్వరాజ్యం’ విరాజిల్లాలి.


దిలీప్‌ రెడ్డి 

ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement