పంచాయతీరాజ్ చట్టంలో సమూల మార్పులు
సవరణకు సర్కారు యోచన
పనిచేయని సర్పంచులు, కార్యదర్శుల తొలగింపు
వందశాతం పన్నులు వసూలు చేస్తే ప్రోత్సాహకాలు
పంచాయతీలకు ర్యాంకింగ్‌లు, నిధుల వ్యయంపై సామాజిక తనిఖీ
తండాలను పంచాయతీలుగా మార్చడంపై ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు ఆదేశం
బ్రాడ్‌బ్యాండ్ వసతి ఉన్న గ్రామాల్లో నెట్ కనెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు విశేష అధికారాలు కల్పించడంతోపాటు, పనితీరు సరిగాలేని పంచాయతీలపై చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్ట సవరణ చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రామ పంచాయతీలు వందశాతం పన్నులు వసూలు చేస్తే..వాటికి ర్యాంకింగ్‌లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే ఏమాత్రం పనిచేయని సర్పంచులు, కార్యదర్శులకు ఉద్వాసన పలికే విధంగా చట్టంలో మార్పు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఉన్నతస్థాయివర్గాలు వివరించాయి. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లలోనూ ఆయా పంచాయతీల పనితీరు ఆధారంగా నిధులు విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఒకసారి ఎన్నికైతే ఐదేళ్లు నిశ్చింతంగా ఉండొచ్చనే అలసత్వ ధోరణి వల్లే పంచాయతీల అభివృద్ధి జరగడం లేదని, అన్నింటికీ ప్రభుత్వం వైపు చూడడం స్థానిక సంస్థలకు తగదన్న సందేశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వృద్ధి, స్వయం పాలన దిశగా స్థానిక సంస్థలు ఎదగాలన్న నిర్ణయం మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తిగా సవరించనున్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీలు అధికారాలు కావాలని కోరుతున్నాయని, వాటితోపాటు జవాబుదారీతనం కూడా ఉండాలన్నది ప్రభుత్వ అభిప్రాయంగా కనిపిస్తోంది. గ్రామ పంచాయతీలే ఇకపై ఉపాధి హామీ పథకంలో పనులు గుర్తించడం, అమలు చేయడం, కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు, ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ, వ్యవసాయం తదితర అంశాలను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి ఆయా పంచాయతీలే వేతనాలు చెల్లించుకునేలా స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంటుంది. కేవలం గ్రామ కార్యదర్శులకు మాత్రమే ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో అందిస్తున్న అన్నిరకాల సేవలను గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు కూడా అందించడానికి వీలుగా వాటిని బలోపేతం చేయనున్నారు. పంచాయతీల్లో వినియోగించే నిధులకు సంబంధించి సామాజిక తనిఖీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంచాయతీలుగా మారనున్న 1,193 తండాలు
500 జనాభా దాటిన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్పు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన మేరకు.. కొత్తగా 1,193 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కానున్నాయి. జిల్లాల నుంచి ఆయా పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. పంచాయతీల మ్యాపులతో సహా, అక్కడి జనాభా తదితర వివరాలను పంపించాలని కోరింది.
పంచాయతీలే.. ఈ-సేవ కేంద్రాలు
దాదాపు 2,400 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే కంప్యూటర్లు ఉన్నాయి. వాటికి బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ ఉన్నచోట నెట్ కనెక్షన్లు ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చే యనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థను బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. రెండు నెలల్లోగా ఈ పంచాయతీలన్నిటిలో ఈ-పంచాయతీ విధానం అమలు చేయాలని పట్టుదలతో ఉంది. పట్టణాలు, నగరాల్లో మీ-సేవ కేంద్రాలు అందిస్తున్న పలు రకాల సేవల కంటే మెరుగైన సేవలను గ్రామ పంచాయతీల్లో అందుబాటులోకి తేనున్నారు. కాగా, పంచాయతీలే స్వయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. అవినీతిని అరికడతాయన్న అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది.