సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టంలో స్థానిక సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. గ్రామ పంచాయతీల తరహాలోనే మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గాల రిజర్వేషన్ల కేటాయింపును మార్చింది. రెండు వరుస ఎన్నికల్లోనూ ఒకే రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేసింది. జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీటీసీ సభ్యుడు, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ఎన్నికల విషయంలో పదేళ్లు ఒకే కేటగిరీకి కేటాయించనుంది. సర్పంచ్‌ల తరహాలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పోటీ విషయంలో ఎలాంటి విద్యార్హతలు ఉండవని చట్టంలో పేర్కొంది.
పాలకవర్గం ముగియగానే...
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రకారం కొత్త జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లు ఏర్పాటవుతాయని చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుత జెడ్పీలు, ఎంపీపీల పాలకవర్గాల పదవీకాలం ముగియగానే కొత్త జిల్లాలు, మండలాలను ప్రత్యేక యూనిట్‌గా మారుతాయి. తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం–1974 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల యూనిట్‌గా జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటవుతుంది. అలాగే కొత్త మండలం యూనిట్‌గా మండల ప్రజా పరిషత్ ఏర్పడుతుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం 2019 జూలైతో ముగిశాక కొత్త జెడ్పీలు, మండలాలు ఏర్పాటైనట్లుగానే భావించాల్సి ఉంటుంది.
30కి పెరగనున్న జెడ్పీలు...
రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో చేపట్టిన జిల్లాల పునర్విభజనలో జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి పెరిగింది. హైదరాబాద్ పూర్తిగా నగరపాలక సంస్థ పరిధిలో ఉండటంతో దీనికి జిల్లా ప్రజా పరిషత్ లేదు. ప్రస్తుతం తొమ్మిది జిల్లా ప్రజా పరిషత్‌లు ఉన్నాయి. వాటి పదవీకాలం ముగియగానే 30 జిల్లా ప్రజా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 438 మండల ప్రజా పరిషత్‌లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజనలో 96 గ్రామీణ మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన గ్రామీణ మండలాల సంఖ్యతో కలిపితే మండల ప్రజా పరిషత్‌ల సంఖ్య 534కు పెరగనుంది. అలాగే ప్రతి గ్రామీణ మండలం యూనిట్‌గా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) ఉంటుంది. ఈ లెక్కన జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య సైతం 534కు పెరగనుంది.
ప్రస్తుత విధానమే...
జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్‌లకు ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఎన్నికలు జరగనున్నాయి. మండలంలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఎంపీటీసీ సభ్యులు కలసి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులను మండలంలోని ఓటర్లు ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ సభ్యులు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ సభ్యుల్లో ఒకరిని జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఎప్పటిలాగే పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. పదేళ్లకోసారి రిజర్వేషన్లు మారుతాయి. రొటేషన్ విధానం అమలు చేస్తారు. రాజకీయ పార్టీల గుర్తులతోనే ఎన్నికలు జరుగుతాయి. పార్టీల తరఫున ఎన్నికైన వారికి ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో ఆయా పార్టీలు విప్ జారీ చేస్తాయి.
ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఐఏఎస్...
కొత్త పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహణ ప్రక్రియను మార్చారు. దీని ప్రకారం ముఖ్య కార్యదర్శి హోదాగల ఐఏఎస్ అధికారిని మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు గవర్నర్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను నియమిస్తారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటాయి. పంచాయతీరాజ్ సంస్థలకు గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment