MPTCs
-
దివిసీమ టీడీపీలో ఉప్పెన
మోపిదేవి (అవనిగడ్డ): కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మోపిదేవి మండల టీడీపీ నాయకుల మూకుమ్మడి రాజీనామాలు దివిసీమలో తీవ్ర చర్చలకు దారితీశాయి. మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబం నుంచే ఈ ముసలం పుట్టడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రులు నడకుదటి నరసింహారావు సోదరుడు, కొల్లు రవీంద్ర మేనమామ అయిన జనార్దనరావు అధిష్టానంపై రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఈయన మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతగా, రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. శనివారం ఉత్తర చిరువోలులంకలోని ఆయన ఇంటివద్ద టీడీపీకి, అవసరమైతే ఎంపీటీసీ పదవికి సైతం తాను, తన కుటుంబం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కమ్యూనిస్టు పార్టీలో కొనసాగామని, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు పిలుపు మేరకు ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి టీడీపీకి మండలంలో కంచుకోటగా గ్రామాన్ని బలోపేతం చేశానని చెప్పారు. సర్పంచ్‌గా తాను, తన భార్య జననీకుమారి బాధ్యతలు నిర్వహించామని గుర్తు చేశారు. 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీపీని చేస్తామని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేకపోయినా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్లీ పోటీచేయాలని, గెలిస్తే ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో తన భార్య జననీకుమారిని కార్యకర్తలు గెలిపించారని పేర్కొన్నారు. అయితే ఎంపీపీ పదవి ఇవ్వకుండా.. హామీని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను గడ్డిపరకలకన్నా హీనంగా చూస్తున్నారని అన్నారు. అవసరానికి మాత్రమే వాడుకుంటూ అవకాశం ఉన్నా.. తమకు పదవి ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన భార్య జననీకుమారి ఎంపీటీసీ పదవిని కూడా వదులు కోవడానికి సిద్ధంగా ఉందని జనార్దనరావు వివరించారు. కాగా, ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఎంపీటీసీ జెడ్పీటీసీలకూ పదేళ్ల రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టంలో స్థానిక సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. గ్రామ పంచాయతీల తరహాలోనే మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గాల రిజర్వేషన్ల కేటాయింపును మార్చింది. రెండు వరుస ఎన్నికల్లోనూ ఒకే రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేసింది. జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీటీసీ సభ్యుడు, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ఎన్నికల విషయంలో పదేళ్లు ఒకే కేటగిరీకి కేటాయించనుంది. సర్పంచ్ల తరహాలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పోటీ విషయంలో ఎలాంటి విద్యార్హతలు ఉండవని చట్టంలో పేర్కొంది. పాలకవర్గం ముగియగానే... రాష్ట్ర ప్రభుత్వం గతేడాది చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రకారం కొత్త జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లు ఏర్పాటవుతాయని చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుత జెడ్పీలు, ఎంపీపీల పాలకవర్గాల పదవీకాలం ముగియగానే కొత్త జిల్లాలు, మండలాలను ప్రత్యేక యూనిట్‌గా మారుతాయి. తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం–1974 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల యూనిట్‌గా జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటవుతుంది. అలాగే కొత్త మండలం యూనిట్‌గా మండల ప్రజా పరిషత్ ఏర్పడుతుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం 2019 జూలైతో ముగిశాక కొత్త జెడ్పీలు, మండలాలు ఏర్పాటైనట్లుగానే భావించాల్సి ఉంటుంది. 30కి పెరగనున్న జెడ్పీలు... రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో చేపట్టిన జిల్లాల పునర్విభజనలో జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి పెరిగింది. హైదరాబాద్ పూర్తిగా నగరపాలక సంస్థ పరిధిలో ఉండటంతో దీనికి జిల్లా ప్రజా పరిషత్ లేదు. ప్రస్తుతం తొమ్మిది జిల్లా ప్రజా పరిషత్‌లు ఉన్నాయి. వాటి పదవీకాలం ముగియగానే 30 జిల్లా ప్రజా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 438 మండల ప్రజా పరిషత్‌లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజనలో 96 గ్రామీణ మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన గ్రామీణ మండలాల సంఖ్యతో కలిపితే మండల ప్రజా పరిషత్‌ల సంఖ్య 534కు పెరగనుంది. అలాగే ప్రతి గ్రామీణ మండలం యూనిట్‌గా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) ఉంటుంది. ఈ లెక్కన జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య సైతం 534కు పెరగనుంది. ప్రస్తుత విధానమే... జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్‌లకు ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఎన్నికలు జరగనున్నాయి. మండలంలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఎంపీటీసీ సభ్యులు కలసి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులను మండలంలోని ఓటర్లు ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ సభ్యులు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ సభ్యుల్లో ఒకరిని జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఎప్పటిలాగే పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. పదేళ్లకోసారి రిజర్వేషన్లు మారుతాయి. రొటేషన్ విధానం అమలు చేస్తారు. రాజకీయ పార్టీల గుర్తులతోనే ఎన్నికలు జరుగుతాయి. పార్టీల తరఫున ఎన్నికైన వారికి ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో ఆయా పార్టీలు విప్ జారీ చేస్తాయి. ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఐఏఎస్... కొత్త పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహణ ప్రక్రియను మార్చారు. దీని ప్రకారం ముఖ్య కార్యదర్శి హోదాగల ఐఏఎస్ అధికారిని మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు గవర్నర్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను నియమిస్తారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటాయి. పంచాయతీరాజ్ సంస్థలకు గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. -
100 శాతం పన్ను వసూలు గగనమే
► ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా గ్రామాల్లో వసూలైంది 71 శాతమే ► ప్రజాప్రతినిధుల నుంచి అధికారులకు లభించని సహకారం ► పన్నులడిగితే ప్రజలు ఓట్లేయరనే భావనలో ప్రజాప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఓవైపు ఈ ఏడాది వందశాతం పన్ను వసూళ్లు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టగా, మరోవైపు తమ గ్రామాల్లో ప్రభు త్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయనం దున పన్నులెందుకు కట్టాలని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. పన్ను వసూళ్ల కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు సూచిస్తుం డగా, పన్నులు కట్టమని ప్రజలను అడిగితే రాబోయే ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరనే భావనలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంతే కాకుండా రెండేళ్ల కిందట ‘గ్రామజ్యోతి’ పేరిట అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకు ప్రభుత్వం ఎన్నో ఆశలు కల్పించిందని, ఆ మేరకు గ్రామాల అభివృద్ధికి సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో జనాల్లో నిరాశ నిస్పృహలు అలముకున్నాయని సర్పంచులు అంటున్నారు. స్థానిక సంస్థలకు మూడేళ్లుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అందలేదని, తాజా బడ్జెట్లోనూ కేటాయింపులు లేకపోవడం తమను మరింత నిరాశకు గురి చేసిందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆస్తి పన్నులు కట్టండంటూ ఇంటింటికీ తిరిగి చెబితే మరింత నవ్వులపా లవుతామని ఎంపీటీసీలు, సర్పంచులు అంటు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,695 గ్రామ పంచాయతీల్లో రూ.435కోట్ల ఆస్తి పన్ను వసూ లు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే.. మరో 10రోజులలో ఆర్థిక సంవత్సరం ముగి యనుండగా, ఇప్పటి వరకు కేవలం రూ.306.80 కోట్లు(71శాతం) మాత్రమే వసూ లైనట్లు అధికారులు లెక్కలు తేల్చారు. -
మండల సర్వసభ్యసమావేశాన్ని వాకౌట్ చేసిన ఎంపీటీసీలు
కోదాడరూరల్ : గ్రామాల అభివద్ధికి తమ కోటా కింద ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ అన్ని పార్టీల ఎంపీటీసీలు శనివారం జరగాల్సిన మండల సర్వసభ్యసమావేశాన్ని వాకౌట్ చేశారు. కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దీంతో సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ కనీస నిధులు కేటాయించక పోగా జనరల్ నిధులన్నింటినీ సర్పంచ్‌లకే కేటాయిస్తున్నారని వాపోయారు. నిధులు లేక గ్రామాల్లో తిరగలేని పరస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తమకు ప్రకటించిన రూ.5 వేల వేతనం కూడా అందడంలేదని... ఇప్పటికైనా నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మందలపు శేషు, ఎంపీటీసీల నియోజకవర్గ అధ్యక్షులు కొండపల్లి వాసు, నెల్లూరి వీరభద్రరావు, బాణోతు ప్రసాద్, బత్తుల వెంకన్న, పాముల మైసయ్య, అప్జల్, కొచెచ్చర్ల రమేష్, తూమాటి పుష్పావతి, ఇర్ల అన్నపూర్ణ, వీదమణి, మరియమ్మ, వెంకట్రావమ్మ , భవాని, భాగ్యమ్మ, తిప్పని రమ, కోఅప్షన్ సభ్యులు ఎండి.రఫి ఉన్నారు. సమావేశానికి హాజరు కాని అధికారులు..... ప్రజా సమస్యలపై మూడు నెలలకోసారి జరిగే మండల సమావేశానికి 16 శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉండగా సగం శాఖల అధికారులు హాజరు కాలేదు. వారం రోజుల క్రితమే సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులంతా హాజరు కాకపోవడంపై ఎంపీపీ, ఎంపీడీఓలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీపీ తెలిపారు. ఆర్టీసీ, ఐబీ, ఐకేపీ, ఎకై ్సజ్, గహ, సోషల్ వెల్ఫేర్, ఉపాధిహామీ శాఖల అధికారులు హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డేగరాణి, డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, తహసీల్దార్ వి.శ్రీదేవి, ఎంపీడీఓ ప్రేమ్‌కరుణ్‌రెడ్డి, పీఆర్ ఏఈ లక్ష్మారెడ్డి, ఎలక్ట్రికల్ రూరల్ ఏఈ మల్లెల శ్రీనివాసరావు, సీడీపీఓ కష్ణకుమారి, సూపరింటెండెంట్ సుగుణకుమార్, ఈఓఆర్డీ సాంబిరెడ్డి, డేగబాబు తదితరులు పాల్గొన్నారు. -
భిన్నాభిప్రాయాలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవుల రద్దుకు సర్కారు యోచన అధికారాలు లేనప్పుడు రద్దే మేలంటున్నవారు కొందరు పదవుల బలోపేతం దృష్టి పెట్టాలని మరికొందరి సూచన ఐదంచెల వ్యవస్థ రద్దుపై స్థానిక ప్రతినిధుల్లో చర్చ కరీంనగర్ సిటీ : ప్రస్తుతం ఉన్న ఐదంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రద్దు చేసి, గతంలోని మూడంచెల వ్యవస్థను తిరిగి తేవాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారాలు, నిధులు లేక సమాంతర పదవులతో అలంకారప్రాయంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేయాలని ప్రభుత్వం సంకల్పించడం తెలిసిందే. 1987లో ఎన్టీ.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీ సమితిల స్థానంలో మండల వ్యవస్థను తీసుకొచ్చారు. సర్పంచ్, మండలాధ్యక్షుడు, జిల్లా పరిషత్ అధ్యక్షుడి పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం మూడంచెల వ్యవస్థను ఐదంచెలుగా మార్చింది. గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, మండల స్థాయిలో ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులతో ఐదంచెల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అప్పటినుంచి గ్రామస్థాయిలో సర్పంచ్‌కు సమాంతరంగా ఎంపీటీసీ, మండల స్థాయిలో ఎంపీపీకి సమాంతరంగా జెడ్పీటీసీ పదవులు పుట్టుకొచ్చాయి. అలంకారప్రాయమే... ఐదంచెల వ్యవస్థలో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఏర్పడినా నిధులు, విధుల విషయంలో సమాన అధికారాలు దక్కలేదనే విమర్శలున్నాయి. పైపెచ్చు సమాంతర పదవుల్లో ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలతోపాటు ఎంపీపీ, జెడ్పీటీసీలు కలహించుకొనే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారింది. తాము కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినా సర్పంచ్‌లు, ఎంపీపీల స్థాయిలో తమకు గౌరవం, అధికారాలు, నిధులు దక్కడం లేదనే ఆవేదనను ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అనేక సందర్భాల్లో లేవనెత్తారు. నిధులు, విధుల కోసం ఆందోళనలు సైతం నిర్వహించారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అధికారాలు, నిధులు అంతంతమాత్రంగా ఉండగా ఇటీవలి కాలంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను నేరుగా గ్రామపంచాయతీలకే విడుదల చేయడంతో మండల పరిషత్, జిల్లా పరిషత్ వ్యవస్థలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. భిన్నాభిప్రాయాలు.. పంచాయతీరాజ్ వ్యవస్థలో గతంలో మాదిరిగా మూడంచెల వ్యవస్థనే మేలని కొంతమంది, ఐదంచెల వ్యవస్థను రద్దు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ పదవులను రద్దు చేయాలంటున్న వారు... ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఒకే స్థాయిలో సర్పంచ్–ఎంపీటీసీ, ఎంపీపీ–జెడ్పీటీసీ పదవులతో పాలనాపరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. కనీసం తమకు కార్యాలయాలు కూడా లేవని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పేర్కొంటున్నారు. అలాంటప్పుడు అలంకారప్రాయంగా మారిన పదవులు అవసరం లేదంటున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్, మండల స్థాయిలో మండల అధ్యక్షుడు, జిల్లాస్థాయిలో జెడ్పీ చైర్మన్లను నేరుగా ఎన్నుకొనే వ్యవస్థ కావాలంటున్నారు. ఇక ఐదంచెల వ్యవస్థ ఉండాలని కోరుతున్నవారు... ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీలే కాదు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు కూడా అధికారాలు, నిధుల విషయంలో సంతృప్తిగా లేరని ప్రస్తావిస్తున్నారు. సర్పంచ్‌లను మినహాయిస్తే స్థానిక సంస్థల వ్యవస్థలోని ఏ ఒక్క పదవికి పూర్తిస్థాయి అధికారాలు, నిధులు, విధులు లేవంటున్నారు. అలాంటప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టులు రద్దు చేసినంత మాత్రాన ఒనగూరే ప్రయోజనమేమీ లేదంటున్నారు. ఉన్న పదవులకు అధికారాలు బదలాయించి, నిధులు, విధులు అప్పగిస్తే స్థానిక సంస్థలు మరింత బలోపేతమవుతాయని సూచిస్తున్నారు. మూడంచెల వ్యవస్థే మేలు –తన్నీరు శరత్‌రావు, జెడ్పీటీసీ, బెజ్జెంకి రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం మంచిదే. అధికారాలు లేని పదవులు ఉన్నా ప్రజలకు ఎలాంటి ఫలితం ఉండదు. సమాంతర పదవుల కారణంగా పాలనాపరంగా సమస్యలు తలెత్తడం తప్పితే ప్రయోజనం లేదు. పూర్తిస్థాయి అధికారాలు ఉంటేనే ప్రజలకు మేలు చే యగలుగుతాం. గ్రామాలను అభివృద్ధి పరచగలుగుతాం. మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినా ఆ పదవులకు అధికారాలు కట్టబెడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రద్దుతో ప్రయోజనం లేదు –చల్ల నారాయణరెడ్డి, జెడ్పీటీసీ, కాటారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. అధికార వికేంద్రీకరణకు ప్రస్తుతమున్న ఐదంచెల వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. అధికారాలు, నిధుల్లో కోత విధించి ఆ పదవులకు విలువ లేకుండా చేసింది ప్రభుత్వాలే. ఐదంచెల వ్యవస్థను అలానే ఉంచి నిధులు, విధులు, అధికారాలతో బలోపేతం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. అధికారాలు లేని పదవులెందుకు? –దీకొండ భూమేశ్, ఎంపీటీసీ, ఐత్రాజుపల్లి ప్రజలు కోరితే కనీసం గ్రామంలో సొంతంగా ఒక పని కూడా చేయలేని దుస్థితిలో ఎంపీటీసీలు ఉన్నారు. పంచాయతీ కార్యాలయంలో ఒక చాంబర్ సైతం లేదు. ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి తప్పితే మాకు ఐదేండ్లు పనే లేదు. అధికారాలు, విధులు ఉంటేనే ప్రజలకు సేవచేయగలం. అధికారాలు లేని ఈ పదవులు అవసరం లేదు. మూడంచెల వ్యవస్థ అమలు చేయడం వల్ల స్థానిక సంస్థలు బలోపేతమవుతాయి. అధికారాలపై దృష్టిపెట్టండి –కల్లెపల్లి వెంకటమ్మ, ఎంపీటీసీ, గర్రెపల్లి పదవులను రద్దు చేయాలనే ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఆ పదవులను బలోపేతం చేయడంపై దృష్టి పెడితే మంచిది. ఐదంచెల వ్యవస్థలో ఉన్న పదవుల పరంగా అధికారాలు విభజించి, అందుకు సరిపడా నిధులు కేటాయిస్తే ఏ పదవిని రద్దు చేయాల్సిన అవసరం ఉండదు. పైగా నిధులు ఇవ్వకుండా, అధికారాలు బదలాయించకుండా మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసినా ఫలితం శూన్యమే. -
గౌరవ వేతనం
- స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 9 నెలలుగా అందని వైనం - తాజాగా మూడు నెలలకే బడ్జెట్ విడుదల చేసిన సర్కారు - మూడు నెలల ముచ్చటేనా! సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని నిలబెడతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా వారికి గౌరవ వేతనాలను కూడా చెల్లించడంలేదు. కేవలం మూడు నెలలకు సరిపడా నిధులను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులకు గతంలో నెల వేతనం రూ.750 ఉండగా, ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 1 నుంచి రూ.5 వేలకు పెంచింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు గౌరవ వేతనాల పద్దు కింద ప్రభుత్వం రూ.13.23 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచులకు కూడా మరో రూ.7.18 కోట్లు మంజూరు చేస్తూ ఇంతకుముందే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినవిగా పేర్కొంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా గౌరవ వేతనాలు చెల్లించాల్సి ఉంది. బకాయిలపై స్పందించకుండా, గత మూడు నెలలకు బడ్జెట్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ప్రజాప్రతినిధులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గౌరవ వేతన నిధుల కోసం ప్రతినెలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, గత ఆర్థిక సంవత్సరంలోని రెండు త్రైమాసికాల బడ్జెట్ విడుదల కోరుతూ మరోమారు లేఖ రాస్తామని చెప్పారు. నిరీక్షణంటే అగౌరవమే గౌరవ వేతనం కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి రావడం అగౌరవంగానే భావిస్తున్నాం. ప్రభుత్వం కనీసం మూడు నెలలకు ఒకమారైనా బడ్జెట్‌ను విడుదల చే స్తే మేలు. స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. - మెంటేపల్లి పురుషోత్తమ్, సర్పంచుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నెలానెలా చెల్లించాలి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవ వేతనాలను ప్రభుత్వం ఇకపై ప్రతినెలా చెల్లించే ఏర్పాటు చేయాలి. తొమ్మిది నెలలైనా వేతనాలు అందకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరుకూలీ పనులకు వెళ్లక తప్పని దుస్థితి ఏర్పడింది. - యు.మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సర్కారుపై ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల సమరభేరి..!
* అధికారాలకు కత్తెర వేస్తోందంటూ సర్పంచుల మండిపాటు * గ్రామజ్యోతిలో పక్కనపెట్టేశారంటూ ఎంపీటీసీల ఆవేదన * అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదంటూ జెడ్పీటీసీల ఆగ్రహం * ఈనెల 24న ‘చలో అసెంబ్లీ’కి జెడ్పీటీసీల ఫోరం పిలుపు * అక్టోబర్ 9న పంచాయతీరాజ్ చాంబర్ ‘చలో హైదరాబాద్’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారుపై స్థానిక ప్రజాప్రతినిధులు సమరానికి సిద్ధమవుతున్నారు. తమ అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేస్తోందని అటు సర్పంచ్‌లు, నిధులివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్రామజ్యోతి’లో తమకు తగిన ప్రాధాన్యం కల్పించకపోగా.. కేంద్రం ఇచ్చే నిధులకు సైతం ఎసరు పెడుతోందన్నది వారి ఆగ్రహానికి కారణమవుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణ జెడ్పీటీసీల ఫోరం ఈనెల 24న ‘చలో అసెంబ్లీ’కి పిలుపునివ్వగా.. తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అక్టోబరు 9న ‘చలో హైదరాబాద్ ’ పేరిట ఆందోళన చేపడుతున్నట్లు ప్రకటించింది. న్యాయమైన డిమాండ్లను సర్కారు పరిష్కరించని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ వివిధ ఫోరంల నేతలు పంచాయతీరాజ్ చాంబర్‌కు మద్దతు ప్రకటించారు. గ్రామజ్యోతి ఓ అభూత కల్పన! ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమం ఓ అభూత కల్పనగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొట్టి పారేస్తున్నారు. ఏటా ఐదారు వేల కోట్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో పాతిక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటూ సర్కారు అసత్యాలు చెబుతోందని దుయ్యబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 13, 14 ఫైనాన్స్ కమిషన్ల ద్వారా ఇచ్చే నిధులనే.. తామిస్తున్నట్లుగా రాష్ట్ర సర్కారు నమ్మబలుకుతోందని విమర్శిస్తున్నారు. గతంలో ఆర్థిక సంఘం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు 50 శాతం, జిల్లా పరిషత్‌లకు 30 శాతం, మండల పరిషత్‌లకు 20 శాతం నిధులు వచ్చేవి. అయితే ఆర్థిక సంఘం నుంచి వంద శాతం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. అంతేకాకుండా గతంలో కంటే 400 రెట్లు అధికంగా నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనను ఆసరా చేసుకొని రాాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఏటా రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల దాకా ఇస్తున్నట్లు చెప్పుకుంటోందని సర్పంచులు అంటున్నారు. రూ.25 వేల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు? గ్రామజ్యోతి ద్వారా వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తామంటున్న రూ.25 వేల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తుందో చెప్పాలంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ద్వారా రావాల్సిన 13వ ఆర్థిక సంఘం బకాయిలు, 14వ ఆర్థిక సంఘం నిధులు కలిపి సుమారు రూ.10 వేల కోట్లు ఉంటాయి. అంతేగాక ఉపాధి హామీ పథకం కింద వచ్చే నాలుగేళ్లలో సుమారు రూ.10 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది. స్థానిక పన్నులు (ఇంటి పన్ను, ఆస్తిపన్ను, వినోదపు పన్ను తదితరాలు) ద్వారా మరో రూ.5 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం గ్రామ పంచాయతీలకు సూచించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఎక్కడ అనే ది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా తయారైందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంటున్నారు. అధికారాలకు కత్తెరపై అసంతృప్తి.. ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు వస్తున్నందున వాటిని వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసే అధికారం సర్పంచులకు ఉంటుంది. అయితే గ్రామజ్యోతిలో కొన్ని కమిటీలను వేసి, వాటికి కొందరిని చైర్మన్లుగా నియమించారు. వారి ద్వారా నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒకరకంగా తమ అధికారాలకు కత్తెర వేయడమేనని సర్పంచులు భావిస్తున్నారు. ఉపాధి పథకం కింద కేంద్రం ఇచ్చే నిధుల వ్యయంతో గ్రామ సర్పంచులకు ఏమాత్రం సంబంధం లేదు. అయినా.. గ్రామానికి ఏటా రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కొన్నిచోట్ల ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందని ప్రజలు తమను దొంగలుగా చూస్తున్నారన్న భావన సర్పంచుల్లో నెలకొంది. ఎంపీటీసీలకు నిధులేవీ? ఎమ్మెల్యేలు, ఎంపీల మాదిరిగా తమకు నిధులు, అధికారాలను ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పించకపోవడంపై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన 29 అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించకపోవడంపైనా వీరు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వాలని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామజ్యోతిలో తమను భాగస్వాములను చేయకపోవడంతో ప్రజల దృష్టిలో ఉత్సవ విగ్రహాల కంటే హీనమైపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యం? పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు గ్రామజ్యోతిలో వీసమెత్తు విలువ ఇవ్వకుండా ప్రభుత్వమే అడ్డుపడుతోందని, స్థానిక సంస్థలు బలహీనపడితే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని రాష్ట్ర కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలకు సంబంధించి కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది. ప్రభుత్వం స్పందించని పక్షంలో అక్టోబరు 9న ‘చలో హైదరాబాద్’ పేరిట ఆందోళన చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర సర్పంచుల సంఘం కన్వీనర్‌గా మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మెంటేపల్లి పురుషోత్తమ్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, చాంబర్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పి.అశోక్‌రావు, బాదెపల్లి సిద్ధార్థ, ఎ.కృష్ణమూర్తి, అందె బాబయ్య, పి.బి.శ్రీశైలం, అంజనీప్రసాద్, అన్నయ్యగౌడ్, బెల్లం శ్రీనివాస్, మధుసూదన్ గుప్త, నర్సింగ్‌రావు, భీంరెడ్డి కుమార్‌గౌడ్, శశికళ యాదవ్ పాల్గొన్నారు. తీర్మానాల్లో ముఖ్యమైనవి.. = సీఎం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. = గ్రామ పంచాయతీల్లో జాయింట్ చెక్ పవర్‌ను వెంటనే రద్దు చేయాలి = రాజ్యాంగం ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలను బదలాయించాలి. = స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పెంచిన గౌరవ వేతనాలు వెంటనే ఇవ్వాలి. = రాష్ట్రవ్యాప్తంగా 8,836 గ్రామ పంచాయతీల్లో రూ.1,050 కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలి. = వీఆర్వో, వీఆర్ఏ, ఏఈవోలను సర్పంచుల ఆధీనంలోకి తేవాలి. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పురస్కారాలను అందజేయాలి. = అభివృద్ధి నిధుల కింద ఎంపీటీసీలకు రూ.25 లక్షలు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు రూ.50 లక్షల చొప్పున కేటాయించాలి. స్వేచ్ఛను హరిస్తే ఎలా! గ్రామజ్యోతి కార్యక్రమంతో స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు త లెత్తాయి. వివిధ రకాల కమిటీల పేరిట సర్పంచుల స్వేచ్ఛ హరిస్తున్నారు. సర్పం చులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను బదలాయించకపోవడం, పెంచిన గౌరవ వేతనాలను ఐదు నెలలుగా ఇవ్వకపోవడం పట్ల అందరిలోనూ ఆందోళన నెలకొంది. నెలాఖారులోగా ప్రజాప్రతినిధుల డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం. - చింపుల సత్యనారాయణరెడ్డి, పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్సీలు స్పందించడం లేదు ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓట్లతో గెల్చిన ఎమ్మెల్సీలు వారి సమస్యల పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. గ్రామజ్యోతి ద్వారా సర్పంచుల అధికారాలకు కోత పెట్టడం ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం తీరు మారకుంటే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం. - మెంటేపల్లి పురుషోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం కన్వీనర్ -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
పెద్దకొత్తపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా) : విద్యుత్ అధికారుల పనితీరుపై పెద్దకొత్తపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ వెంకటేశ్వర్రావు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు సత్యం, సురేష్‌రావు, వెంకటస్వామి, సుల్తానమ్మ, సులోచనమ్మలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలను సరఫరా చేయక పోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామాలకు మంజూరైన స్తంభాలను సరఫరా చేసి కొత్తగా లైన్లు వేస్తామని తెలిపారు. కరువు మండలంగా ప్రకటించాలని సభ్యులంతా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పాఠశాలలో వంట గదుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటి నిర్మాణాలను వెంటనే చేపట్టాలని గంట్రావుపల్లి సర్పంచ్ సులోచనమ్మ సభ దృష్టికి తెచ్చారు. ముష్టిపల్లి గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు గుడ్లు అందించకుండా అమ్ముకుంటున్నారని సర్పంచ్ సురేష్‌రావు సభ దృష్టికి తెచ్చారు. ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ సమావేశం నిర్వహించి మధ్యాహ్న భోజనంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని సభ్యులు కోరగా టెక్నికల్ అసిస్టెంట్లతో మాట్లాడి చెల్లిస్తామని ఏపీఓ అలీమోద్దీన్ తెలిపారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా ఉన్నాయి. జిల్లా పరిషత్ నిధుల నుంచి నిధులు మంజూరు చేయించాలని జడ్పీటీసీ వెంకటయ్యకు దేవల్‌తిర్మలాపూర్ సర్పంచ్ సత్యం సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ విజయ్‌కుమార్‌శర్మ, తహశీల్దార్ అశోక్, వైస్ ఎంపీపీ రాముడు, ఏఓ మధుశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘దేశం’ దొంగాటకు దన్నుగా... ఆపరేషన్ పోలీస్
* టీడీపీ నేతలు పట్టుకొచ్చిన ఎంపీటీసీలకు ఖాకీల కౌన్సెలింగ్ * తమను ప్రలోభపెట్టారని చెప్పిన మాటలు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి * తాము ఇష్టపూర్తిగానే వచ్చామన్న స్టేట్మెంట్లపై బలవంతపు సంతకాలు * వేకువజామున ఎంపీటీసీలను రహస్య ప్రాంతానికి తరలింపు * వీడియో ఫుటేజ్‌ల కోసం మీడియా వారితో పోలీసుల సంప్రదింపులు * టీడీపీ ప్రలోభాలు, శిబిరంపై ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు * మాగుంట శ్రీనివాసులురెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ * తన భర్తను టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారని ఎంపీటీసీ భార్య ఆరోపణ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎమ్మెల్సీల ఎన్నికల్లో పోలీసులే అండగా మరింత బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రకాశంజిల్లాకు చెందిన 35 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నెల్లూరులో దాచిపెట్టిన టీడీపీ నేతలను వదిలిపెట్టి, ఆ కుట్రను భగ్నం చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయించింది. పోలీసు అధికారులు కూడా అధికారపార్టీకి కొమ్ముకాస్తూ... తమకు రూ.3 లక్షలు ఇస్తామని చెప్పి రూ.50 వేలు అడ్వాన్సుగా ఇచ్చారని మీడియా ముందు చెప్పిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎంపీటీసీలపై ఒత్తిడి తెస్తున్నారు. తమంతట తామే ఇష్టపూర్వకంగా వచ్చామనే స్టేట్మెంట్లపై ఎంపీటీసీలతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారని తెలిసింది. టీడీపీ దుర్మార్గ చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు హైదరాబాద్‌లో ఉభయ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్‌కు, ఒంగోలులో రిటర్నింగ్ అధికారి హరి జవహర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి శిబిరాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. తన భర్తను టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారని ఓ ఎంపీటీసీ భార్య ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ప్రకాశం జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు 35 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నెల్లూరు సప్తగిరి లాడ్జిలో దాచిపెట్టగా... నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం చాకచక్యంగా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా లాడ్జిలో ఉన్న ఎంపీటీసీలను పిలిపించి ఎమ్మెల్యేలు మాట్లాడారు. టీడీపీ నేతలు ఓటు వేసేందుకు రూ.3 లక్షలు ఇస్తామని చెప్పి రహస్యంగా నెల్లూరుకు తీసుకొచ్చి దించారని 8 మంది ఎంపీటీసీలు మీడియా ముందు అంగీకరించారు. అందులో భాగంగా అడ్వాన్సుగా రూ. 50 వేలు ఇచ్చారని కూడా చెప్పారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు అధికారపార్టీకి అనుగుణంగా పావులు కదిపారు. అర్ధరాత్రి న్యూసెన్స్ ఏమిటంటూ ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. బలవంతంగా లాడ్జి షట్టర్ వేసి అందరినీ అక్కడ్నుంచి పంపించేశారు. అయితే ఎంపీటీసీలు అంతకుముందే మీడియా ముందు మాట్లాడిన విషయం తెలుసుకుని అధికారపార్టీని కాపాడేందుకు చర్యలు ప్రారంభించారు. ఒంగోలు నుంచి వచ్చిన ముగ్గురు టీడీపీ నాయకులను పోలీసులే లోపలకు తీసుకెళ్లి ఎంపీటీసీలతో మంతనాలు జరిపారని తెలిసింది. తమను ఎవరూ తీసుకురాలేదని, తామే స్వతహాగా వచ్చామని ఎంపీటీసీలనుంచి బలవంతంగా స్టేట్మెంట్ రికార్డు చేసి, సంతకాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేసినట్లు తెలిసింది. అందుకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వాలని ఎంపీటీసీలపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే అందుకు వారు ససేమిరా అనటంతో చేసేది లేక వారిని మీడియా కంటికి కనిపించకుండా లాడ్జి నుంచి మరో ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత టీడీపీ ముఖ్యనేతల ఒత్తిడి మేరకు లాడ్జి మేనేజర్ దాశరథిపై ఒత్తిడి తీసుకువచ్చి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయించారు. నెల్లూరు రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా లాడ్జీలోకి ప్రవేశించి ఎంట్రీ రిజిస్ట్రర్‌ను లాక్కున్నారని, కొంతమంది సిబ్బందిని నిర్బంధించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకు మూడో పట్టణ పోలీసులు నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులపైనా కేసు నమోదు చేశారు. మరోవైపు సప్తగిరి లాడ్జిలో సోమవారం జరిగిన సంఘటనలను చిత్రీకరించిన వీడియో పుటేజ్‌లను మాయం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనర్హత వేటు వేయాలి మాగుంటపై రిటర్నింగ్ అధికారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్సీ ఓట్ల కోసం ఒక్కో ఎంపీటీసీకి రూ.3 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టి నెల్లూరులో క్యాంపు ఏర్పాటు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారి హరి జవహర్‌లాల్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ అభ్యర్థి అట్లా చినవెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి రిటర్నింగ్ అధికారిని కలసి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల వద్ద ఉన్న 35 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను 24 గంటల్లో తీసుకువచ్చి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఓట్లు కొనుగోలుకు పాల్పడినట్లు మీడియాలో స్పష్టంగా వచ్చినందున ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేయాలని కోరారు. పోలీసులు తమ సొంత ఎస్కార్ట్‌తో గుర్తుతెలియని ప్రదేశానికి ఎంపీటీసీలను తరలించారని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు లాడ్జీలో పట్టుబడ్డ ఎంపీటీసీలను పోలీసులే దగ్గరుండి వేరేచోటికి తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కూరుకుపోయినా వారికి సిగ్గు రాలేదని దుయ్యబట్టారు. -
'పీఠం కదిలిపోతున్న టీడీపీ బుద్ధి మారలేదు'
-
మళ్లీ అడ్డంగా దొరికారు
-
మళ్లీ అడ్డంగా దొరికారు..
ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను దాచి ఉంచిన నెల్లూరులోని సప్తగిరి లాడ్జికి వచ్చిన నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు (ఇన్సెట్లో) హోటల్లో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు ప్రకాశం జిల్లాలో ఒక్కో ఎంపీటీసీకి టీడీపీ రూ.3 లక్షల ఆఫర్ ♦ అడ్వాన్సుగా రూ. 50 వేలు చెల్లింపు ♦ నెల్లూరు లాడ్జిలో 30 మందితో క్యాంపు ♦ దొంగాటను ఛేదించిన వైఎస్సార్సీపీ నేతలు ♦ ఈ వ్యవహారం వెనుక మంత్రి నారాయణ హస్తం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని ప్రయత్నించి టీడీపీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయి జైలులో ఉన్నా టీడీపీ నేతల తీరు మారలేదు. ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టేందుకు తెగబడ్డారు. మంత్రి నారాయణ నేతృత్వంలో వారిని నెల్లూరులోని ఓ హోటల్లో దాచిపెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హోటల్‌కు వెళ్లి.. వారి పన్నాగాన్ని బట్ట బయలు చేశారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ పోటీపడుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అట్లా చినవెంకటరెడ్డి తలపడుతున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీకే బలం ఉంది. అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కంకణం కట్టుకున్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభపెట్టడం ప్రారంభించారు. అందులో భాగంగా వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీలపై వల వేశారు. తాము అధికారంలో ఉన్నామనీ, తమతో కలవకుంటే కష్టాలు తప్పవని బెదిరించారు. నయానా భయానా 30 మంది ఎంపీటీసీలను దారిలోకి తెచ్చుకున్నారు. ఒక్కో ఎంపీటీసీకి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందస్తుగా రూ.50 వేలు ముట్టజెప్పారు. మిగిలిన మొత్తం ఇస్తాం రమ్మని చెప్పి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి నెల్లూరులోని సప్తగిరి లాడ్జిలో దాచారు. ఈ విషయాన్ని పసిగట్టిన నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులతో లాడ్జిని చుట్టుముట్టారు. లాడ్జి నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో రిజిస్టర్ తెప్పించి పేర్లు పరిశీలించారు. గదులు తీసుకున్నవారంతా ప్రకాశం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఆయా గదులవద్దకెళ్లి అందులో ఉన్నవారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారపార్టీ నేతలు తమను బలవంతంగా తీసుకొచ్చారని వారు స్పష్టంచేశారు. తాము అధికారంలో ఉన్నామనీ, తమతో కలవకుంటే కష్టాలు తప్పవని బెదిరించారని ఆరోపించారు. తాము పార్టీ మారబోమని, తమ గుండెల్లోనున్న వైఎస్సార్‌ను మరవబోమని వారు చెప్పారు. పోలీసుల ఓవర్‌యాక్షన్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు లాడ్జిని చుట్టుముట్టిన విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీసులను ఎగదోశారు. అధికారపార్టీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు వచ్చిన పోలీసులు... ఎమ్మెల్యేలు, అనుచరులను వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. తాము ఎందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలు ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాయుధ బలగాలతో బలవంతంగా షట్టర్లువేసి పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబుకు నమ్మకస్తుడైన మంత్రి నారాయణ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రకాశంలో టీడీపీ ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న శ్రీనివాసులరెడ్డి కూడా నెల్లూరు జిల్లావాడే కావడం గమనార్హం. -
'పీఠం కదిలిపోతున్న టీడీపీ బుద్ధి మారలేదు'
ప్రకాశం: స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేయడంపై ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు ఓటుకు కోట్లు కేసు నడుస్తున్నా కుక్క తోక వంకరన్నట్టు టీడీపీ బుద్ధి మారలేదని ఆయన ధ్వజమెత్తారు. నెల్లూరులోని ఓ లాడ్జీలో ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను దాచేశారు. దీన్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసివెళ్లి ఎంపీటీసీలను పక్కగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఓ పక్క ఓటుకు నోటు కేసులో పీఠం కదిలిపోతున్న అధికార టీడీపీకి సిగ్గురావడం లేదని విమర్శించారు. అయితే తాము మొదటి నుంచి అనుమానించినట్లే.. తమ సభ్యులను ప్రలోభపెట్టి టీడీపీ క్యాంప్‌కు తరలించదంటూ దుయ్యబట్టారు. ఇందులో భాగంగా టీడీపీ ప్రకాశం జిల్లాకు చెందిన తమ ఎంపీటీసీలను నెల్లూరు లాడ్జీలో నిర్భంధించారని చెప్పారు. టీడీపీ నీచ రాజకీయాలపై ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీడీపీ నేతలపై చర్య తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
పేరుకే ఆమె.. పెత్తనం ఆయనది
యాచారం: ఆకాశంలో సగం.. అన్నింటా సగం అంటున్నా.. అవకాశాలను అందిపుచ్చుకుని అడుగు ముందుకేసినా.. విమానాలు నడిపినా.. విల్లు ఎక్కుపెట్టినా.. రాజ్యాధికారం దక్కించుకున్నా.. అధికార పీఠమెక్కినా ఇంకా భర్త చాటు భార్యలే అవుతున్నారు. నడిచేది ఆమే అయినా వెనుకుండి నడిపించేది ఆయనే అవుతున్నాడు. రిజర్వేషన్లతో అధికారం చేజిక్కించుకున్నా పెత్తనం మాత్రం వారిదే. స్థానిక, ప్రాదేశిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించుకోగలిగినా... చాలామంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఇప్పటికీ వంటిం టికే పరిమితమవుతున్నారు. గ్రామాల్లో పర్యటించినా.. సమస్యలపై అధికారుల వద్దకు వెళ్లినా.. ఓ ఎమ్మెల్యేనో.. ఎంపీనో.. మంత్రినో... కలిసినా మహిళా ప్రజాప్రతినిధుల భర్తలో.. లేక బంధువులో దర్శనమిస్తున్నారు. ప్రజలు తమ బాధలు చెప్పుకోవాలన్నా వారికే చెప్పుకోవాలి. పనులు కావాలన్నా వారే చేయాలి. మండలంలోని 20 గ్రామాల్లో తొమ్మిది మంది మహిళా సర్పంచ్‌లుగా ఎన్నికవగా, 14 ఎంపీటీసీ స్థానాల్లో ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు. ఎంపీపీ పీఠం సైతం మహిళనే వరించింది. ప్రజాప్రతినిధులుగా గెలిచినా వారు తమ అధికారాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. గ్రామ, మండల సమావేశాల్లోనో.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే అధికారికంగా కనిపిస్తున్నారు. అధికారం మాత్రం సతులకు బదులు పతులే చలాయిస్తున్నారు. అధికారులు అత్యవసర సమయాల్లో మహిళా ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని ఫోన్ చేసినా చెప్పండి పరవాలేదు అంటూ వారి గొంతే వినిపిస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది పెద్దగా చదువుకోకపోవడం కూడా వారికి కలిసివస్తోంది. మహిళా సాధికారతను కాలరాయడమే.. ‘‘రిజర్వేషన్లతో వచ్చిన అవకాశాన్ని మహిళా ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలి. పాలనా వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తలు, బంధువుల జోక్యాన్ని సహించొద్దు. స్వతహాగా పరిపాలన చేసేలా చైతన్యం రావాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. సమావేశాల్లో, సదస్సుల్లో బాగా మాట్లాడాలి. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేయాలి’’ ఈనెల 24న మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ‘మన ఊరు-మన ప్రణాళిక ’ సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మహిళా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన మాటలివి. ఈ మాటలు మండలంలో చర్చనీయాంశమయ్యాయి. పాలనాపరమైన అనుభవలేమి నేపథ్యంలో కొంతవరకు కుటుంబ సభ్యులు సహాయపడినా పరవాలేదు కాని మొత్తంగా అధికారాన్నే లాగేసుకోవడం మహిళా సాధికారతను కాలరాయడమే అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా మహిళా ప్రజాప్రతినిధులు రిజర్వేషన్లతో తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని తోటి మహిళలు కోరుతున్నారు.