
'పీఠం కదిలిపోతున్న టీడీపీ బుద్ధి మారలేదు'
ప్రకాశం: స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేయడంపై ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు ఓటుకు కోట్లు కేసు నడుస్తున్నా కుక్క తోక వంకరన్నట్టు టీడీపీ బుద్ధి మారలేదని ఆయన ధ్వజమెత్తారు. నెల్లూరులోని ఓ లాడ్జీలో ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను దాచేశారు. దీన్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసివెళ్లి ఎంపీటీసీలను పక్కగా పట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఓ పక్క ఓటుకు నోటు కేసులో పీఠం కదిలిపోతున్న అధికార టీడీపీకి సిగ్గురావడం లేదని విమర్శించారు. అయితే తాము మొదటి నుంచి అనుమానించినట్లే.. తమ సభ్యులను ప్రలోభపెట్టి టీడీపీ క్యాంప్కు తరలించదంటూ దుయ్యబట్టారు. ఇందులో భాగంగా టీడీపీ ప్రకాశం జిల్లాకు చెందిన తమ ఎంపీటీసీలను నెల్లూరు లాడ్జీలో నిర్భంధించారని చెప్పారు. టీడీపీ నీచ రాజకీయాలపై ఎలక్షన్ కమీషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీడీపీ నేతలపై చర్య తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.