మళ్లీ అడ్డంగా దొరికారు.. | Prakasam MPTCs caught by Ysrcp MLAs | Sakshi
Sakshi News home page

మళ్లీ అడ్డంగా దొరికారు..

Published Tue, Jun 23 2015 12:47 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

Prakasam MPTCs caught by Ysrcp MLAs

ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను దాచి ఉంచిన నెల్లూరులోని సప్తగిరి లాడ్జికి వచ్చిన నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు (ఇన్‌సెట్లో) హోటల్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు

ప్రకాశం జిల్లాలో ఒక్కో ఎంపీటీసీకి టీడీపీ రూ.3 లక్షల ఆఫర్
అడ్వాన్సుగా రూ. 50 వేలు చెల్లింపు
నెల్లూరు లాడ్జిలో 30 మందితో క్యాంపు
దొంగాటను ఛేదించిన వైఎస్సార్‌సీపీ నేతలు
ఈ వ్యవహారం వెనుక మంత్రి నారాయణ హస్తం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిలో మాత్రం మార్పు రాలేదు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని ప్రయత్నించి టీడీపీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయి జైలులో ఉన్నా టీడీపీ నేతల తీరు మారలేదు. ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టేందుకు తెగబడ్డారు. మంత్రి నారాయణ నేతృత్వంలో వారిని నెల్లూరులోని ఓ హోటల్‌లో దాచిపెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు హోటల్‌కు వెళ్లి.. వారి పన్నాగాన్ని బట్ట బయలు చేశారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ పోటీపడుతున్నాయి.

టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా అట్లా చినవెంకటరెడ్డి తలపడుతున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకే బలం ఉంది. అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కంకణం కట్టుకున్న టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను ప్రలోభపెట్టడం ప్రారంభించారు. అందులో భాగంగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలపై వల వేశారు.  తాము అధికారంలో ఉన్నామనీ, తమతో కలవకుంటే కష్టాలు తప్పవని బెదిరించారు. నయానా భయానా 30 మంది ఎంపీటీసీలను దారిలోకి తెచ్చుకున్నారు. ఒక్కో ఎంపీటీసీకి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందస్తుగా రూ.50 వేలు ముట్టజెప్పారు.

మిగిలిన మొత్తం ఇస్తాం రమ్మని చెప్పి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి నెల్లూరులోని సప్తగిరి లాడ్జిలో దాచారు. ఈ విషయాన్ని పసిగట్టిన నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులతో లాడ్జిని చుట్టుముట్టారు. లాడ్జి నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో రిజిస్టర్ తెప్పించి పేర్లు పరిశీలించారు.

గదులు తీసుకున్నవారంతా ప్రకాశం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఆయా గదులవద్దకెళ్లి అందులో ఉన్నవారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారపార్టీ నేతలు తమను బలవంతంగా తీసుకొచ్చారని వారు స్పష్టంచేశారు. తాము అధికారంలో ఉన్నామనీ, తమతో కలవకుంటే కష్టాలు తప్పవని బెదిరించారని ఆరోపించారు. తాము పార్టీ మారబోమని, తమ గుండెల్లోనున్న వైఎస్సార్‌ను మరవబోమని వారు చెప్పారు.
 
పోలీసుల ఓవర్‌యాక్షన్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు లాడ్జిని చుట్టుముట్టిన విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీసులను ఎగదోశారు. అధికారపార్టీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు వచ్చిన పోలీసులు... ఎమ్మెల్యేలు, అనుచరులను వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. తాము ఎందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలు ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాయుధ బలగాలతో బలవంతంగా షట్టర్లువేసి పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబుకు నమ్మకస్తుడైన మంత్రి నారాయణ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రకాశంలో టీడీపీ ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న శ్రీనివాసులరెడ్డి కూడా నెల్లూరు జిల్లావాడే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement