‘దేశం’ దొంగాటకు దన్నుగా... ఆపరేషన్ పోలీస్ | Police to support TDP leaders | Sakshi
Sakshi News home page

‘దేశం’ దొంగాటకు దన్నుగా... ఆపరేషన్ పోలీస్

Published Wed, Jun 24 2015 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

Police to support TDP leaders

* టీడీపీ నేతలు పట్టుకొచ్చిన ఎంపీటీసీలకు ఖాకీల కౌన్సెలింగ్
తమను ప్రలోభపెట్టారని చెప్పిన మాటలు ఉపసం
హరించుకోవాలని ఒత్తిడి
తాము ఇష్టపూర్తిగానే వచ్చామన్న స్టేట్‌మెంట్లపై బలవంతపు సంతకాలు
వేకువజామున ఎంపీటీసీలను రహస్య ప్రాంతానికి తరలింపు
వీడియో ఫుటేజ్‌ల కోసం మీడియా వారితో పోలీసుల సంప్రదింపులు
టీడీపీ ప్రలోభాలు, శిబిరంపై ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
మాగుంట శ్రీనివాసులురెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్
* తన భర్తను టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారని ఎంపీటీసీ భార్య ఆరోపణ


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎమ్మెల్సీల ఎన్నికల్లో పోలీసులే అండగా మరింత బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రకాశంజిల్లాకు చెందిన 35 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను నెల్లూరులో దాచిపెట్టిన టీడీపీ నేతలను వదిలిపెట్టి, ఆ కుట్రను భగ్నం చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయించింది. పోలీసు అధికారులు కూడా అధికారపార్టీకి కొమ్ముకాస్తూ... తమకు రూ.3 లక్షలు ఇస్తామని చెప్పి రూ.50 వేలు అడ్వాన్సుగా ఇచ్చారని మీడియా ముందు చెప్పిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎంపీటీసీలపై ఒత్తిడి తెస్తున్నారు. తమంతట తామే ఇష్టపూర్వకంగా వచ్చామనే స్టేట్‌మెంట్లపై ఎంపీటీసీలతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారని తెలిసింది.
 
 టీడీపీ దుర్మార్గ చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు హైదరాబాద్‌లో ఉభయ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్‌కు, ఒంగోలులో రిటర్నింగ్ అధికారి హరి జవహర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి శిబిరాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. తన భర్తను టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారని ఓ ఎంపీటీసీ భార్య ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ప్రకాశం జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు 35 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను నెల్లూరు సప్తగిరి లాడ్జిలో దాచిపెట్టగా... నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం చాకచక్యంగా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా లాడ్జిలో ఉన్న ఎంపీటీసీలను పిలిపించి ఎమ్మెల్యేలు మాట్లాడారు. టీడీపీ నేతలు ఓటు వేసేందుకు రూ.3 లక్షలు ఇస్తామని చెప్పి రహస్యంగా నెల్లూరుకు తీసుకొచ్చి దించారని 8 మంది ఎంపీటీసీలు మీడియా ముందు అంగీకరించారు. అందులో భాగంగా అడ్వాన్సుగా రూ. 50 వేలు ఇచ్చారని కూడా చెప్పారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు అధికారపార్టీకి అనుగుణంగా పావులు కదిపారు. అర్ధరాత్రి న్యూసెన్స్ ఏమిటంటూ ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. బలవంతంగా లాడ్జి షట్టర్ వేసి అందరినీ అక్కడ్నుంచి పంపించేశారు.
 
 అయితే ఎంపీటీసీలు అంతకుముందే మీడియా ముందు మాట్లాడిన విషయం తెలుసుకుని అధికారపార్టీని కాపాడేందుకు చర్యలు ప్రారంభించారు. ఒంగోలు నుంచి వచ్చిన ముగ్గురు టీడీపీ నాయకులను పోలీసులే లోపలకు తీసుకెళ్లి ఎంపీటీసీలతో మంతనాలు జరిపారని తెలిసింది. తమను ఎవరూ తీసుకురాలేదని, తామే స్వతహాగా వచ్చామని ఎంపీటీసీలనుంచి బలవంతంగా స్టేట్‌మెంట్ రికార్డు చేసి, సంతకాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేసినట్లు తెలిసింది.
 
 అందుకు అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ఎంపీటీసీలపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే అందుకు వారు ససేమిరా అనటంతో చేసేది లేక వారిని మీడియా కంటికి కనిపించకుండా లాడ్జి నుంచి మరో ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత టీడీపీ ముఖ్యనేతల ఒత్తిడి మేరకు లాడ్జి మేనేజర్ దాశరథిపై ఒత్తిడి తీసుకువచ్చి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయించారు. నెల్లూరు రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా లాడ్జీలోకి ప్రవేశించి ఎంట్రీ రిజిస్ట్రర్‌ను లాక్కున్నారని, కొంతమంది సిబ్బందిని నిర్బంధించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకు మూడో పట్టణ పోలీసులు నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులపైనా కేసు నమోదు చేశారు. మరోవైపు సప్తగిరి లాడ్జిలో సోమవారం జరిగిన సంఘటనలను చిత్రీకరించిన వీడియో పుటేజ్‌లను మాయం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అనర్హత వేటు వేయాలి
మాగుంటపై రిటర్నింగ్ అధికారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్సీ ఓట్ల కోసం ఒక్కో ఎంపీటీసీకి రూ.3 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టి నెల్లూరులో క్యాంపు ఏర్పాటు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారి హరి జవహర్‌లాల్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ అభ్యర్థి అట్లా చినవెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి రిటర్నింగ్ అధికారిని కలసి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల వద్ద ఉన్న 35 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను 24 గంటల్లో తీసుకువచ్చి అప్పగించాలని డిమాండ్ చేశారు.
 
 ఓట్లు కొనుగోలుకు పాల్పడినట్లు మీడియాలో స్పష్టంగా వచ్చినందున ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేయాలని కోరారు. పోలీసులు తమ సొంత ఎస్కార్ట్‌తో గుర్తుతెలియని ప్రదేశానికి ఎంపీటీసీలను తరలించారని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు లాడ్జీలో పట్టుబడ్డ ఎంపీటీసీలను పోలీసులే దగ్గరుండి వేరేచోటికి తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కూరుకుపోయినా వారికి సిగ్గు రాలేదని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement