తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్న దళితులు, (ఇన్‌సెట్‌లో) టీడీపీ నేతల దాడిలో గాయపడిన నరేంద్ర
మాచవరం (గురజాల): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే అక్కసుతో రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకొని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై పోలీస్ స్టేషన్‌లోనే టీడీపీ నేతలు దాడిచేశారు. గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం మండలం కొత్తపాలెం దళితవాడలో ఇద్దరు చిన్నారుల మధ్య పాఠశాలలో వివాదం తలెత్తిన నేపథ్యంలో పత్తిపాటి మోషే, ఏకుల లక్ష్మయ్య కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. తనపై దాడి చేశారంటూ మోషే ఈ నెల ఒకటిన ఏకుల లక్ష్మయ్యపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని ఆదివారం మోషే కుటుంబసభ్యులపై ఏకుల లక్ష్మయ్య గొడవకు దిగాడు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు మోషే, అతడి భార్య ప్రమీల బంధువులతో కలసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అది గమనించిన గ్రామ సర్పంచ్ గుదె రామారావు, టీడీపీ నాయకుడు యామని రామారావు, మరికొందరు నేతలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్న మోషే, ప్రమీల, చావా ఏసోబు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేంద్రలపై దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే దుర్భాషలాడుతూ చొక్కాలు చింపి కొట్టారు. పోలీస్ సిబ్బంది వారించేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా వారే పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై కొద్దిసేపు బైఠాయించారు.
సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ పీవీ ఆంజనేయులు, రాజుపాలెం, బెల్లంకొండ, పిడుగురాళ్ల ఎస్‌ఐలు అమీర్, రాజశేఖర్, చరణ్ పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాధితులతో మాట్లాడారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణాపాయం ఉందని, రక్షణ కల్పించాలని బాధితులు ఆయనకు విన్నవించుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ప్రమీల, నరేంద్ర, లక్ష్మయ్యల ఫిర్యాదుల మేరకు కేసులు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment