
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్
నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన.. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చెల్లారి వెంకట్రావు (45), టీడీపీకి చెందిన కూనపాం బాబూరావు, మింతులపల్లి శ్రీను, పెనుమాక వెంకటేశ్వరావు మంగళవారం సాయంత్రం కల్లు విక్రయ కేంద్రం వద్ద కల్లు తాగుతున్నారు. వీరి మధ్య గత ఎన్నికలపై చర్చ జరిగింది. మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది.
బాబూరావుపై వెంక్రటావు చేయి చేసుకోగా.. ఆగ్రహంతో బాబూరావు పక్కనే ఉన్న గునపంతో వెంకట్రావు తలపై కొట్టాడు. దీంతో వెంకట్రావుకు తీవ్ర గాయమైంది. అతడిని తొలుత తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి తణుకు, ఆపై కాకినాడ తరలించారు. కాకినాడలో చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున వెంకట్రావు మృతిచెందాడు. సీఐ రవికుమార్, నల్లజర్ల ఎస్‌ఐ కె.చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment