
గౌరవ వేతనం
- స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 9 నెలలుగా అందని వైనం
- తాజాగా మూడు నెలలకే బడ్జెట్ విడుదల చేసిన సర్కారు
- మూడు నెలల ముచ్చటేనా!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని నిలబెడతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా వారికి గౌరవ వేతనాలను కూడా చెల్లించడంలేదు. కేవలం మూడు నెలలకు సరిపడా నిధులను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులకు గతంలో నెల వేతనం రూ.750 ఉండగా, ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 1 నుంచి రూ.5 వేలకు పెంచింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు గౌరవ వేతనాల పద్దు కింద ప్రభుత్వం రూ.13.23 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచులకు కూడా మరో రూ.7.18 కోట్లు మంజూరు చేస్తూ ఇంతకుముందే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినవిగా పేర్కొంది.
అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా గౌరవ వేతనాలు చెల్లించాల్సి ఉంది. బకాయిలపై స్పందించకుండా, గత మూడు నెలలకు బడ్జెట్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ప్రజాప్రతినిధులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గౌరవ వేతన నిధుల కోసం ప్రతినెలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, గత ఆర్థిక సంవత్సరంలోని రెండు త్రైమాసికాల బడ్జెట్ విడుదల కోరుతూ మరోమారు లేఖ రాస్తామని చెప్పారు.
నిరీక్షణంటే అగౌరవమే
గౌరవ వేతనం కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి రావడం అగౌరవంగానే భావిస్తున్నాం. ప్రభుత్వం కనీసం మూడు నెలలకు ఒకమారైనా బడ్జెట్‌ను విడుదల చే స్తే మేలు. స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
- మెంటేపల్లి పురుషోత్తమ్, సర్పంచుల సంఘం రాష్ట్ర కన్వీనర్
నెలానెలా చెల్లించాలి
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవ వేతనాలను ప్రభుత్వం ఇకపై ప్రతినెలా చెల్లించే ఏర్పాటు చేయాలి. తొమ్మిది నెలలైనా వేతనాలు అందకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరుకూలీ పనులకు వెళ్లక తప్పని దుస్థితి ఏర్పడింది.
- యు.మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి