బీఆర్వో విడుదల చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి రూ.222 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో)ను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.296 కోట్లు అవసరమని సెర్ప్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, తొమ్మిది నెలల(ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) మొత్తానికి ఒకేసారి బీఆర్వోను జారీచేసింది.
ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఆర్థికభృతి మొత్తాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు(జూన్ 2)న అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, ఒంటరి మహిళల ఆర్థికభృతి నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 36,643 దరఖాస్తులు అందినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. ఇందులో పట్టణాల నుంచి 4,390 దరఖాస్తులు రాగా, గ్రామాల నుంచి 32,253 మంది మహిళలు దరఖాస్తులను సమర్పించారు. ఇప్పటివరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నుంచి 3,500 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు.