సర్కారుపై ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల సమరభేరి..! | Local represtentatives to movement of telangana govt | Sakshi
Sakshi News home page

సర్కారుపై ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల సమరభేరి..!

Published Tue, Sep 15 2015 3:10 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

సర్కారుపై ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల సమరభేరి..!

సర్కారుపై ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల సమరభేరి..!

* అధికారాలకు కత్తెర వేస్తోందంటూ సర్పంచుల మండిపాటు
* గ్రామజ్యోతిలో పక్కనపెట్టేశారంటూ ఎంపీటీసీల ఆవేదన
* అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదంటూ జెడ్పీటీసీల ఆగ్రహం
* ఈనెల 24న ‘చలో అసెంబ్లీ’కి జెడ్పీటీసీల ఫోరం పిలుపు
* అక్టోబర్ 9న పంచాయతీరాజ్ చాంబర్ ‘చలో హైదరాబాద్’

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారుపై స్థానిక ప్రజాప్రతినిధులు సమరానికి సిద్ధమవుతున్నారు. తమ అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేస్తోందని అటు సర్పంచ్‌లు, నిధులివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్రామజ్యోతి’లో తమకు తగిన ప్రాధాన్యం కల్పించకపోగా.. కేంద్రం ఇచ్చే నిధులకు సైతం ఎసరు పెడుతోందన్నది వారి ఆగ్రహానికి కారణమవుతోంది.
 
 మొన్నటికి మొన్న తెలంగాణ జెడ్పీటీసీల ఫోరం ఈనెల 24న ‘చలో అసెంబ్లీ’కి పిలుపునివ్వగా.. తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అక్టోబరు 9న  ‘చలో హైదరాబాద్ ’ పేరిట ఆందోళన చేపడుతున్నట్లు ప్రకటించింది. న్యాయమైన డిమాండ్లను సర్కారు పరిష్కరించని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ వివిధ ఫోరంల నేతలు పంచాయతీరాజ్ చాంబర్‌కు మద్దతు ప్రకటించారు.
 
 గ్రామజ్యోతి ఓ అభూత కల్పన!
 ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమం ఓ అభూత కల్పనగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొట్టి పారేస్తున్నారు. ఏటా ఐదారు వేల కోట్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో పాతిక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటూ సర్కారు అసత్యాలు చెబుతోందని దుయ్యబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 13, 14 ఫైనాన్స్ కమిషన్ల ద్వారా ఇచ్చే నిధులనే.. తామిస్తున్నట్లుగా రాష్ట్ర సర్కారు నమ్మబలుకుతోందని విమర్శిస్తున్నారు. గతంలో ఆర్థిక సంఘం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు 50 శాతం, జిల్లా పరిషత్‌లకు 30 శాతం, మండల పరిషత్‌లకు 20 శాతం నిధులు వచ్చేవి.
 
 అయితే ఆర్థిక సంఘం నుంచి వంద శాతం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. అంతేకాకుండా గతంలో కంటే 400 రెట్లు అధికంగా నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనను ఆసరా చేసుకొని రాాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఏటా రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల దాకా ఇస్తున్నట్లు చెప్పుకుంటోందని సర్పంచులు అంటున్నారు.
 
 రూ.25 వేల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు?
 గ్రామజ్యోతి ద్వారా వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తామంటున్న రూ.25 వేల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తుందో చెప్పాలంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ద్వారా రావాల్సిన 13వ ఆర్థిక సంఘం బకాయిలు, 14వ ఆర్థిక సంఘం నిధులు కలిపి సుమారు రూ.10 వేల కోట్లు ఉంటాయి. అంతేగాక ఉపాధి హామీ పథకం కింద వచ్చే నాలుగేళ్లలో సుమారు రూ.10 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది. స్థానిక పన్నులు (ఇంటి పన్ను, ఆస్తిపన్ను, వినోదపు పన్ను తదితరాలు) ద్వారా మరో రూ.5 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం గ్రామ పంచాయతీలకు సూచించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఎక్కడ అనే ది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా తయారైందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంటున్నారు.
 
 అధికారాలకు కత్తెరపై అసంతృప్తి..
 ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు వస్తున్నందున వాటిని వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసే అధికారం సర్పంచులకు ఉంటుంది. అయితే గ్రామజ్యోతిలో కొన్ని కమిటీలను వేసి, వాటికి కొందరిని చైర్మన్లుగా నియమించారు. వారి ద్వారా నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒకరకంగా తమ అధికారాలకు కత్తెర వేయడమేనని సర్పంచులు భావిస్తున్నారు. ఉపాధి పథకం కింద కేంద్రం ఇచ్చే నిధుల వ్యయంతో గ్రామ సర్పంచులకు ఏమాత్రం సంబంధం లేదు. అయినా.. గ్రామానికి ఏటా రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కొన్నిచోట్ల ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందని ప్రజలు తమను దొంగలుగా చూస్తున్నారన్న భావన సర్పంచుల్లో నెలకొంది.
 
 ఎంపీటీసీలకు నిధులేవీ?
 ఎమ్మెల్యేలు, ఎంపీల మాదిరిగా తమకు నిధులు, అధికారాలను ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పించకపోవడంపై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన 29 అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించకపోవడంపైనా వీరు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వాలని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామజ్యోతిలో తమను భాగస్వాములను చేయకపోవడంతో ప్రజల దృష్టిలో ఉత్సవ విగ్రహాల కంటే హీనమైపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇలాగైతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యం?
 పంచాయతీరాజ్ చాంబర్
 రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు గ్రామజ్యోతిలో వీసమెత్తు విలువ ఇవ్వకుండా ప్రభుత్వమే అడ్డుపడుతోందని, స్థానిక సంస్థలు బలహీనపడితే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని రాష్ట్ర కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలకు సంబంధించి కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది.
 
 ప్రభుత్వం స్పందించని పక్షంలో అక్టోబరు 9న ‘చలో హైదరాబాద్’ పేరిట ఆందోళన చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర సర్పంచుల సంఘం కన్వీనర్‌గా మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మెంటేపల్లి పురుషోత్తమ్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, చాంబర్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పి.అశోక్‌రావు, బాదెపల్లి సిద్ధార్థ, ఎ.కృష్ణమూర్తి, అందె బాబయ్య, పి.బి.శ్రీశైలం, అంజనీప్రసాద్, అన్నయ్యగౌడ్, బెల్లం శ్రీనివాస్, మధుసూదన్ గుప్త, నర్సింగ్‌రావు, భీంరెడ్డి కుమార్‌గౌడ్, శశికళ యాదవ్ పాల్గొన్నారు.
 
 తీర్మానాల్లో ముఖ్యమైనవి..
 = సీఎం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో 40 శాతం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి.
 = గ్రామ పంచాయతీల్లో జాయింట్ చెక్ పవర్‌ను వెంటనే రద్దు చేయాలి
 = రాజ్యాంగం ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలను బదలాయించాలి.
 = స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పెంచిన గౌరవ వేతనాలు వెంటనే ఇవ్వాలి.
 = రాష్ట్రవ్యాప్తంగా 8,836 గ్రామ పంచాయతీల్లో రూ.1,050 కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలి.
 = వీఆర్వో, వీఆర్‌ఏ, ఏఈవోలను సర్పంచుల ఆధీనంలోకి తేవాలి. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పురస్కారాలను అందజేయాలి.
 = అభివృద్ధి నిధుల కింద ఎంపీటీసీలకు రూ.25 లక్షలు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు రూ.50 లక్షల చొప్పున కేటాయించాలి.
 
 స్వేచ్ఛను హరిస్తే ఎలా!
 గ్రామజ్యోతి కార్యక్రమంతో స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు త లెత్తాయి. వివిధ రకాల కమిటీల పేరిట సర్పంచుల స్వేచ్ఛ హరిస్తున్నారు. సర్పం చులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను బదలాయించకపోవడం, పెంచిన గౌరవ వేతనాలను ఐదు నెలలుగా ఇవ్వకపోవడం పట్ల అందరిలోనూ ఆందోళన నెలకొంది. నెలాఖారులోగా ప్రజాప్రతినిధుల డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం.
     - చింపుల సత్యనారాయణరెడ్డి,
     పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు
 
 స్థానిక ఎమ్మెల్సీలు స్పందించడం లేదు
 ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓట్లతో గెల్చిన ఎమ్మెల్సీలు వారి సమస్యల పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. గ్రామజ్యోతి ద్వారా సర్పంచుల అధికారాలకు కోత పెట్టడం ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం తీరు మారకుంటే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం.
 - మెంటేపల్లి పురుషోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం కన్వీనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement