grama jyothi
-
సమస్యలు గాలికొదిలేసిన సర్కార్
కండువాలు మార్చే పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి విమర్శ శంకర్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని, పార్టీ కండువాలు మార్చే పథకాన్ని శరవేగంగా అమలు చేస్తుందని రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక అతిథిగృహంలో శుక్రవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండకాలం తీవ్రంగా ఉందని, వర్షాలు లేక తాగు, సాగునీరు లేక, రైతన్నలు అల్లాడిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ‘గ్రామజ్యోతి’ పేరిట ప్రతి గ్రామంలో కమిటీలు వేశారే తప్ప.. ఇంతవరకు నిధులు కేటాయించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులను గ్రామజ్యోతి నిధులుగా చూపించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వనికి దమ్మూ, ధైర్యం ఉంటే వేసవిలో గ్రామాల్లోకి వెళ్లి గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లా ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఒక్క సమావేశం నిర్వహించలేదంటే ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుస్తోందన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకానికి కొబ్బరికాయలు కొట్టకముందు ఇళ్ల బిల్లులు చెల్లించని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. రెండు సంవత్సరాలకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాజకీయాలను పక్కనపెట్టి ప్రజాసమస్యలపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ నర్సింలు, వైస్ ఎంపీపీ శశిధర్‌రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్‌పాషా, దేవులనాయక్, నాయకులు నారాయణ, విఠలయ్య, ప్రకాశ్, మాణిక్‌రెడ్డి, రవీందర్, సత్యనారాయణరెడ్డి, చెంగల్ గోపాల్‌రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, యాదయ్య, ఎంపీటీసీ సభ్యుడు మైసయ్య, యాదిరెడ్డి, పార్శి బాలకృష్ణ, లక్ష్మీకాంత్‌రెడ్డి, రమేష్, లింగారెడ్డి, గోవర్దన్ యాదవ్, బాలన్నగారి కాంతిరెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారుపై ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల సమరభేరి..!
* అధికారాలకు కత్తెర వేస్తోందంటూ సర్పంచుల మండిపాటు * గ్రామజ్యోతిలో పక్కనపెట్టేశారంటూ ఎంపీటీసీల ఆవేదన * అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదంటూ జెడ్పీటీసీల ఆగ్రహం * ఈనెల 24న ‘చలో అసెంబ్లీ’కి జెడ్పీటీసీల ఫోరం పిలుపు * అక్టోబర్ 9న పంచాయతీరాజ్ చాంబర్ ‘చలో హైదరాబాద్’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారుపై స్థానిక ప్రజాప్రతినిధులు సమరానికి సిద్ధమవుతున్నారు. తమ అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేస్తోందని అటు సర్పంచ్‌లు, నిధులివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్రామజ్యోతి’లో తమకు తగిన ప్రాధాన్యం కల్పించకపోగా.. కేంద్రం ఇచ్చే నిధులకు సైతం ఎసరు పెడుతోందన్నది వారి ఆగ్రహానికి కారణమవుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణ జెడ్పీటీసీల ఫోరం ఈనెల 24న ‘చలో అసెంబ్లీ’కి పిలుపునివ్వగా.. తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అక్టోబరు 9న ‘చలో హైదరాబాద్ ’ పేరిట ఆందోళన చేపడుతున్నట్లు ప్రకటించింది. న్యాయమైన డిమాండ్లను సర్కారు పరిష్కరించని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ వివిధ ఫోరంల నేతలు పంచాయతీరాజ్ చాంబర్‌కు మద్దతు ప్రకటించారు. గ్రామజ్యోతి ఓ అభూత కల్పన! ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమం ఓ అభూత కల్పనగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొట్టి పారేస్తున్నారు. ఏటా ఐదారు వేల కోట్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో పాతిక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటూ సర్కారు అసత్యాలు చెబుతోందని దుయ్యబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 13, 14 ఫైనాన్స్ కమిషన్ల ద్వారా ఇచ్చే నిధులనే.. తామిస్తున్నట్లుగా రాష్ట్ర సర్కారు నమ్మబలుకుతోందని విమర్శిస్తున్నారు. గతంలో ఆర్థిక సంఘం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు 50 శాతం, జిల్లా పరిషత్‌లకు 30 శాతం, మండల పరిషత్‌లకు 20 శాతం నిధులు వచ్చేవి. అయితే ఆర్థిక సంఘం నుంచి వంద శాతం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. అంతేకాకుండా గతంలో కంటే 400 రెట్లు అధికంగా నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనను ఆసరా చేసుకొని రాాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఏటా రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల దాకా ఇస్తున్నట్లు చెప్పుకుంటోందని సర్పంచులు అంటున్నారు. రూ.25 వేల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు? గ్రామజ్యోతి ద్వారా వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తామంటున్న రూ.25 వేల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తుందో చెప్పాలంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ద్వారా రావాల్సిన 13వ ఆర్థిక సంఘం బకాయిలు, 14వ ఆర్థిక సంఘం నిధులు కలిపి సుమారు రూ.10 వేల కోట్లు ఉంటాయి. అంతేగాక ఉపాధి హామీ పథకం కింద వచ్చే నాలుగేళ్లలో సుమారు రూ.10 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది. స్థానిక పన్నులు (ఇంటి పన్ను, ఆస్తిపన్ను, వినోదపు పన్ను తదితరాలు) ద్వారా మరో రూ.5 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం గ్రామ పంచాయతీలకు సూచించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఎక్కడ అనే ది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా తయారైందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంటున్నారు. అధికారాలకు కత్తెరపై అసంతృప్తి.. ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు వస్తున్నందున వాటిని వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసే అధికారం సర్పంచులకు ఉంటుంది. అయితే గ్రామజ్యోతిలో కొన్ని కమిటీలను వేసి, వాటికి కొందరిని చైర్మన్లుగా నియమించారు. వారి ద్వారా నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒకరకంగా తమ అధికారాలకు కత్తెర వేయడమేనని సర్పంచులు భావిస్తున్నారు. ఉపాధి పథకం కింద కేంద్రం ఇచ్చే నిధుల వ్యయంతో గ్రామ సర్పంచులకు ఏమాత్రం సంబంధం లేదు. అయినా.. గ్రామానికి ఏటా రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కొన్నిచోట్ల ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందని ప్రజలు తమను దొంగలుగా చూస్తున్నారన్న భావన సర్పంచుల్లో నెలకొంది. ఎంపీటీసీలకు నిధులేవీ? ఎమ్మెల్యేలు, ఎంపీల మాదిరిగా తమకు నిధులు, అధికారాలను ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పించకపోవడంపై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన 29 అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించకపోవడంపైనా వీరు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వాలని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామజ్యోతిలో తమను భాగస్వాములను చేయకపోవడంతో ప్రజల దృష్టిలో ఉత్సవ విగ్రహాల కంటే హీనమైపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యం? పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు గ్రామజ్యోతిలో వీసమెత్తు విలువ ఇవ్వకుండా ప్రభుత్వమే అడ్డుపడుతోందని, స్థానిక సంస్థలు బలహీనపడితే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని రాష్ట్ర కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలకు సంబంధించి కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది. ప్రభుత్వం స్పందించని పక్షంలో అక్టోబరు 9న ‘చలో హైదరాబాద్’ పేరిట ఆందోళన చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర సర్పంచుల సంఘం కన్వీనర్‌గా మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మెంటేపల్లి పురుషోత్తమ్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, చాంబర్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పి.అశోక్‌రావు, బాదెపల్లి సిద్ధార్థ, ఎ.కృష్ణమూర్తి, అందె బాబయ్య, పి.బి.శ్రీశైలం, అంజనీప్రసాద్, అన్నయ్యగౌడ్, బెల్లం శ్రీనివాస్, మధుసూదన్ గుప్త, నర్సింగ్‌రావు, భీంరెడ్డి కుమార్‌గౌడ్, శశికళ యాదవ్ పాల్గొన్నారు. తీర్మానాల్లో ముఖ్యమైనవి.. = సీఎం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. = గ్రామ పంచాయతీల్లో జాయింట్ చెక్ పవర్‌ను వెంటనే రద్దు చేయాలి = రాజ్యాంగం ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలను బదలాయించాలి. = స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పెంచిన గౌరవ వేతనాలు వెంటనే ఇవ్వాలి. = రాష్ట్రవ్యాప్తంగా 8,836 గ్రామ పంచాయతీల్లో రూ.1,050 కోట్ల విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలి. = వీఆర్వో, వీఆర్ఏ, ఏఈవోలను సర్పంచుల ఆధీనంలోకి తేవాలి. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పురస్కారాలను అందజేయాలి. = అభివృద్ధి నిధుల కింద ఎంపీటీసీలకు రూ.25 లక్షలు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు రూ.50 లక్షల చొప్పున కేటాయించాలి. స్వేచ్ఛను హరిస్తే ఎలా! గ్రామజ్యోతి కార్యక్రమంతో స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు త లెత్తాయి. వివిధ రకాల కమిటీల పేరిట సర్పంచుల స్వేచ్ఛ హరిస్తున్నారు. సర్పం చులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను బదలాయించకపోవడం, పెంచిన గౌరవ వేతనాలను ఐదు నెలలుగా ఇవ్వకపోవడం పట్ల అందరిలోనూ ఆందోళన నెలకొంది. నెలాఖారులోగా ప్రజాప్రతినిధుల డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం. - చింపుల సత్యనారాయణరెడ్డి, పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్సీలు స్పందించడం లేదు ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓట్లతో గెల్చిన ఎమ్మెల్సీలు వారి సమస్యల పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. గ్రామజ్యోతి ద్వారా సర్పంచుల అధికారాలకు కోత పెట్టడం ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం తీరు మారకుంటే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం. - మెంటేపల్లి పురుషోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం కన్వీనర్ -
కిషన్ నగర్ గ్రామజ్యోతిలో పాల్గొన్న గవర్నర్!
-
గ్రామజ్యోతిలో పాల్గొన్న గవర్నర్
షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామంలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్ పాల్గొన్నారు. సోమవారం ఆయన మంత్రి కేటీఆర్‌తో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జరుగుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటున్నారా..వైద్యులు ఎక్కడి నుంచి వస్తున్నారో గవర్నర్ ఆరా తీశారు. గ్రామంలో వ్యాధుల నివారణ ఎలా ఉందో అడిగి తెలసుకున్నారు. అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తల పని తీరును కూడా గవర్నర్ ఈ సందర్భంగా పర్యవేక్షించారు. -
దత్తత గ్రామంలో మంత్రి మహేందర్ రెడ్డి
యాలాల (రంగారెడ్డి) : గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా రవాణా మంత్రి మహేందర్ రెడ్డి తాను దత్తత తీసుకున్న ముద్దాయి గూడెంలో పర్యటించారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం ముద్దాయిగూడెం గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. గ్రామ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామంలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. -
ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసిన మంత్రి
గద్వాల్ (మహబూబ్‌నగర్) : గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి సరైన వివరాలు తెలుపకపోవడంతో.. ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ మండలంలోని జమ్మిచేడ్ వద్ద జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో శనివారం జరిగింది. గ్రామజ్యోతి కార్యక్రమానికి వెళ్లిన పౌర సరఫరాల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుకు గ్రామానికి సంబంధించి సరైన వివరాలు తెలపకపోవడంతో ఆగ్రహం చెందిన ఆయన వెంటనే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు గౌడ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
గ్రామజ్యోతికి గవర్నర్ అభినందన
24న మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభినందించారు. తాను సైతం గ్రామజ్యోతిలో పాల్గొనేందుకు వస్తానని.. గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు మాటిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలంలోని హజీపేట, కిషన్‌నగర్ గ్రామాల్లో పర్యటించేందుకు ఆయన అంగీకరించారు. శుక్రవారం ఉదయం మంత్రి కేటీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుసుకున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. గ్రామాల్లో సమూల మార్పులు తెచ్చి సమగ్రాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని మంత్రి వివరించారు. పారిశుద్ధ్య, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రజల కనీస అవసరాలతో పాటు మౌలిక వసతులు, సహజ వనరుల నిర్వహణ వంటి కీలకమైన ఏడు అంశాల్లో అభివృద్ధికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు గవర్నర్‌కు చెప్పారు. కాగా, నాలుగు రోజులుగా గ్రామజ్యోతి గురించి తెలుసుకుంటున్నానని చెప్పిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో జరగనున్న టీ-హబ్ ప్రారంభోత్సవానికి కూడా రావాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రితోపాటు గవర్నర్‌ను కలసిన వారిలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ-హబ్ డెరైక్టర్లు ఉన్నారు. -
మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
-
సీఎం పర్యటనలో పాము కలకలం
జగదేవ్‌పూర్ (మెదక్): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పర్యటనకు అనుకోని అతిథి ఒకటి వచ్చి అందరినీ కలవరానికి గురిచేసింది. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్.. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో గురువారం పర్యటించారు. అయితే, ఎర్రవెల్లి గ్రామానికి ఆయన వెళ్లిన సమయంలో అక్కడ ఓ పాము కనిపించి కలకలం రేపింది. పాము కనిపించగానే అందరూ కొంతసేపు కంగారు పడ్డారు. అయితే కాసేపటికల్లా దానంతట అదే అక్కడే ఉన్న గుంతలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. ఎర్రవెల్లి గ్రామంలో కేసీఆర్ అందరినీ పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటికో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. అనంతరం గ్రామజ్యోతి సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా చాలా మంది స్థానికులు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రావట్లేదని మొరపెట్టుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టివ్వాలని కోరారు. -
'మీ గ్రామస్తుడినే కాబట్టి నిధులకు కొరత ఉండదు'
మెదక్: వచ్చే ఆరునెలల్లో ఎర్రవల్లి గ్రామస్వరూపాన్ని సమూలంగా మార్చివేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎర్రవల్లిలో గురువారం గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. ఆ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతానని తెలిపారు. 'నేను మీ గ్రామస్తుడినే. అందుచేత నిధులకు కొరత ఉండదు. వచ్చే ఆరునెలల్లో ఎర్రవల్లిని బంగారు వల్లిగా తీర్చిదిద్దుతాం' అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎర్రవల్లి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా మెదక్ జాయింట్ కలెక్టర్ నియమిస్తున్నట్లు తెలిపారు. రేపు ఎర్రవల్లిలో గ్రామ ప్రజలతో కలిసి కేసీఆర్ శ్రమదానం కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రజలతో సహపంక్తి భోజనం, ఎల్లుండి మొక్కలు నాటే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. -
గ్రామాల అభివృద్ధి కోసమే 'గ్రామజ్యోతి'
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : గ్రామాల అభివృద్ధి కోసమే 'గ్రామజ్యోతి' కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామజ్యోతి ద్వారా అన్ని రకాల నిధులను పంచాయతీ ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ నిధులతో సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి చేపడతామని మంత్రి తెలిపారు. కాగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ జిల్లాలో అఖిల పక్షాలు చేపట్టిన దీక్ష ఆయా పార్టీల మనుగడ కోసమేనని మంత్రి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని తాండూరు, చేవెళ్ల ప్రాంతాలకు నీరందిస్తామన్నారు. -
టీఆర్ఎస్ నిరంకుశత్వానికి నిదర్శనం
హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీటీడీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. గురువారం హైదరాబాద్‌లో టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ... తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం టీఆర్ఎస్ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. కొడంగల్‌లో ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌ను ఆహ్వానించలేదని వారు ఆరోపించారు. రేవంత్‌ను అరెస్ట్ చేయడం.. ఆపై లాఠీచార్జీ చేసి.. దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయాలని వెళ్లాం కానీ వారు అందుబాటులో లేరని ఎర్రబెల్లి, రావుల తెలిపారు. -
ఎర్రవెల్లిలో గ్రామజ్యోతి ప్రారంభించిన కేసీఆర్
మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే తిగుల్, మునిగడప గ్రామాల్లో ఆయన పర్యటించనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో సీఎం ఎప్పుడైనా ఈ రెండు గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఆదివారం వరకూ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటారని సమాచారం. -
ప్రభుత్వ విధానాల్లోకి శ్రీమంతుడు కాన్సెప్ట్
-
గ్రామజ్యోతిలో తన్నులాట
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయిగిరిలో బుధవారం జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమం రసాభాసగా మారింది. సర్పంచ్, వార్డు మెంబర్ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కార్యక్రమం నుంచి వెళ్లిన వెంటనే గ్రామంలోని సమస్యలపై సర్పంచ్ బి.విమల, ఎనిమిదో వార్డు సభ్యుడు యాదగిరి మధ్య వాదన జరిగింది. కోపంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు వారిని సముదాయించారు. -
నిరసన 'జ్యోతి'
అప్పుడు 'మన ఊరు'.. ఇప్పుడు 'గ్రామ జ్యోతా'? సమస్యల పరిష్కారం కోసం ప్రజల ఆందోళన పలుచోట్ల గ్రామసభల బహిష్కరణ ఎక్కడికక్కడ అధికారుల నిలదీత.. ఆగ్రహం తొలిరోజు గ్రామజ్యోతిపై మిన్నంటిన ఆందోళనలు మంత్రి సభలోనూ సమస్యల పరిష్కారానికి డిమాండ్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం ప్రారంభానికి తొలిరోజే జిల్లాలో పలుచోట్ల నిరసనలు హోరెత్తాయి. 'మన ఊరు - మన ప్రణాళిక ఏమైం ది..? ఇప్పుడు మళ్లీ గ్రామజ్యోతితో వచ్చారా..?' అంటూ ప్రజలు, ప్రతిపక్షాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నిల దీశారు. పలుచోట్ల గ్రామజ్యోతి సభలను బహిష్కరించడం గమనార్హం. అధికారులు కూడా ప్రజా నిరసనతో చేసేదేమీ లేక 'ప్రారంభం సక్సెస్' అన్నట్లు వెనుదిరిగి వచ్చారు. నిరసనలు- బహిష్కరణలు జిల్లా వ్యాప్తంగా సోమవారం గ్రామజ్యోతి సభలు ప్రారంభమయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే మద్దుపల్లిలో మంత్రి హాజరైన సభలోనూ గ్రామకమిటీలో ఇష్టానుసారంగా ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా చర్ల మండలంలోని సుబ్బంపేటలో జరిగిన గ్రామజ్యోతి సభను గ్రామస్తులు బహిష్కరించారు. తమకు గ్రామజ్యోతి కార్యక్రమంలో స్థానం కల్పించలేదని నిరసన తెలుపుతూ ఎంపీటీసీలు సభకు హాజరుకాలేదు. సభకు అన్ని శాఖల అధికారులు హాజరుకాకపోవటంపై గ్రామస్తులు సభను బహిష్కరిస్తున్నట్లుగా చెప్పి వెళ్లిపోయారు. వెంకటాపురం మండలంలోని మొర్రంవాని గూడెం, ఆలుబాక గ్రామాల్లో సభ నిర్వహించగా, ఎంపీటీసీలు హాజరుకాలేదు. కొత్తగూడెం మండలంలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో జరిగిన గ్రామజ్యోతి గ్రామసభలో ప్రజలు అధికారులను నిలదీశారు. మనఊరు-మన ప్రణాళిక కార్యక్రమం నిర్వహించి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, తిరిగి గ్రామజ్యోతి పేరుతో సభలెందుకు పెడుతున్నారని నోడల్ అధికారి తాతారావుపై మండిపడ్డారు. పాల్వంచ మండలంలోని సోములగూడెంలో గ్రామజ్యోతి సభకు ప్రజలు హాజరు కాకపోవడంతో వెలవెలబోయింది. వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ మండలంలోని వల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సోమవరం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎంపీపీ బొంతు సమత గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు ప్రాతినిథ్య కల్పించకపోవటం సరైనది కాదన్నారు. ప్రభుత్వం ఎంపీపీలకు నిధులు మంజూరు చేయటంలో విఫలమైందన్నారు. దీన్ని నిరసిస్తూ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు సభ నుంచి బయటకు వెళ్లారు. వైరా మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ ముళ్ళపాటి సీతారాములు, టీడీపీ ఎంపీటీసీ ముత్యాల కావ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్ళిపోయారు. దమ్మపేట, పట్వారిగూడెంలో సీపీఐ,టీడీపీ నాయకులు అధికారులను నిలదీశారు. గతేడాది చేపట్టిన మన ఊరు-మన ప్రణాళికలో గ్రామసభల్లో చేసిన తీర్మానాలు, గుర్తించిన పనులను మట్టిలో కలిపారని, అదే పథకానికి పేరు మార్చారు.. ఇప్పుడు గ్రామజ్యోతిని దేనిలో కలుపుతారని నిలదీశారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో అభివృద్ధి కమిటీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం జరగడంతో కమిటీల నియామకం రేపటికి వాయిదా వేశారు. పినపాక నియోజకవర్గంలోని పలు గ్రామసభలు ప్రజలు లేక వెలవెలబోయాయి. బూర్గంపాడు మండలంలోని ఇరవెండి గ్రామ సభకు జనం హా జరుకాలేదు . మణుగూరు మండలంలోని సమితిసింగారం, రామానుజవ రం గ్రామసభలకు అధికారులు మాత్రం భారీగా వచ్చినా ప్రజలు ఎవరూ రాకపోవడంతో కమిటీలు ఏర్పాటు చేయలేదు. ఈ సభలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు అవగాహన కల్పించకుండా సభ ఎలా ఏర్పాటు చేస్తారని మండిపడ్డారు. ఇల్లెందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీలో ఎన్డీ నేతలు నరాటి వెంకన్న గ్రామసభలో నిరసన వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన మన ఊరు మన ప్రణాళిక ఏమైందని, నిధులు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. బయ్యారం మండలంలో కొత్తపేట, గౌరారం, వెంకట్రాంపురంలో ప్రజలు హజరు కాకపోవటంతో గ్రామసభలు వాయిదా వేశారు. -
సమాంతర సభలు
ఇటు గ్రామజ్యోతి... అటు 'మన ఊరు-మన ఎంపీ' జగిత్యాల నియోజకవర్గంలో భిన్న దృశ్యాలు అధికారుల్లో అయోమయంగామజ్యోతిలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మన ఊరు-మన ఎంపీ కొనసాగిస్తున్న కవిత జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన గ్రామజ్యోతి ఒకవైపు 'గ్రామజ్యోతి'.. ఇంకోవైపు ‘మన ఊరు- మన ఎంపీ’ ఒకేరోజు రెండు కార్యక్రమాలు... రెండు సభలు... ఎజెండా ఒకటే... లక్ష్యం ఒకటే...గ్రామాల సర్వతోముఖాభివృద్ధే రెండింటి ఉద్దేశం. ఇందులో ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా... మరొకటి నిజామాబాద్ ఎంపీ ఆధ్వర్యంలో నడుస్తోంది. జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు డబుల్ ధమాకా మాదిరిగా రెండు సభల్లో పాల్గొని కోర్కెల చిట్టా వివరిస్తుంటే... అధికారులు మాత్రం ఎటువైపు వెళ్లాలో అర్థంకాక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ ఎంపీ పరిధిలోని చల్గల్, చర్లపల్లి, అంతర్గాం, నర్సింగాపూర్ గ్రామాల్లో సోమవారం కనిపించిన దృశ్యాలివి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో గ్రామజ్యోతి కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా తమ తమ గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకవైపు గ్రామజ్యోతి ఉద్దేశాలు, లక్ష్యాలను వివరిస్తూనే గ్రామ సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో గ్రామస్తుల నుంచి వ్యక్తిగత సమస్యలను ఏక రువు పెడుతూ... దరఖాస్తులను తీసుకుంటూ వాటి పరిష్కారానికి హామీలు ఇచ్చారు. ఇక జగిత్యాల నియోజకవర్గం విషయానికొస్తే... నిజామాబాద్ ఎంపీ కవిత 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమం పేరిట ప్రత్యేక సభలు నిర్వహించారు.జగిత్యాల మండలం చల్గల్లో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత చల్గల్ గ్రామంలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి కాలినడకన తిరుగుతూ గ్రామ పరిస్థితిని అంచనా వేశారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన 'మన ఊరు-మన ఎంపీ' సభకు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాభివృద్ధికి ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఆటస్థలం, గ్రంథాలయం, కమ్యూనిటీ హాళ్లు, మహిళా భవన్, శ్మశానవాటిక, బ్రిడ్జి నిర్మాణం, ప్రత్యేక గోదాంల ఏర్పాటు, విద్యుత్ తీగల్లోని లోపాల సవరణ వంటి పనులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని చెప్పారు. మళ్లీ నవంబర్‌లో చల్గల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు. ఎంపీ చల్గ ల్లో 'మన ఊరు-మన ఎంపీ' సభలో మాట్లాడుతున్న సమయంలోనే అక్కడికి సరిగ్గా పదడుగుల దూరంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామజ్యోతి సభ నడిచింది. స్థానికులు, పార్టీ నాయకులతోపాటు అధికారులంతా కవిత సభలో పాల్గొనడంతో గ్రామజ్యోతి వెలవెలబోయింది. ముఖ్యంగా అధికారుల్లో కొంత గందరగోళం నెలకొంది. గ్రామజ్యోతి కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలనే ఆదేశాలుండటం, అదే సమయంలో ఎంపీ ప్రత్యేకంగా సభ నిర్వహించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయినప్పటికీ అధికారులంతా కవిత నిర్వహించిన కార్యక్రమాల్లోనే పాల్గొనడం గమనార్హం. చల్గల్ సభ అనంతరం కవిత పార్టీ నాయకులు, అధికారులతో కలిసి చర్లపల్లి, అంతర్గాం, నర్సింగాపూర్ గ్రామాల్లోనూ పర్యటించి 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమాలు కొనసాగించారు. రాత్రి నర్సింగాపూర్లోనే బస చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాత్రం రాయికల్ మండల కేంద్రంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమానికి హాజరై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు గ్రామ సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నా : ఎంపీ కవిత 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తనను ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉన్నానని, వారిని ప్రత్యక్షంగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం ద్వారా రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు. -
'గ్రామజ్యోతి పథకం ప్రచార ఆర్భాటమే'
-
'గ్రామజ్యోతి'తో పైసా ఉపయోగం లేదు: ఎంపీ గుత్తా
నల్లగొండ: టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంతో గ్రామాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార ఆర్భాటానికే తప్ప ఈ పథకానికి పైసా విదిల్చేది ఉండదని విమర్శించారు. సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడిన గుత్తా.. గ్రామజ్యోతి పథకానికి సరైన ప్రణాళిక లేదన్నారు. పథకంలో ఎంపీటీసీ, జెడ్సీటీసీలను భాగస్వామ్యులు చేయకపోవడం తగదన్నారు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం అందించే నిధులే తప్ప గ్రామజ్యోతి కోసం ప్రత్యేకంగా ఒక్క పైసా కేటాయించడంలేదని వివరించారు. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే, మన ఊరు- మన ప్రణాళికలు చెత్తబుట్టకే పరిమితమయ్యాయన్నారు. -
గంగదేవపల్లిలో గ్రామజ్యోతికి శ్రీకారం!
-
'గ్రామజ్యోతి' కార్యక్రమంలో మంత్రి
సూర్యాపేటరూరల్: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి 'గ్రామజ్యోతి' సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు సూచనలు చేశారు. సూర్యాపేట పట్టణంలో బోనాల సందర్భంగా మంత్రి ఊరమైసమ్మ, కోటమైసమ్మ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. -
మంత్రి ఈటెలను నిలదీసిన నాయకులు
కరీంనగర్ టౌన్ : గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కరీంనగర్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు నిలదీశారు. గురువారం కరీంనగర్ నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని 'గ్రామజ్యోతిలో మా హక్కులు ఏమిటి?' అని జిల్లాకు చెందిన పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు నిలదీశారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో మా విధులు, నిధులు, హక్కులు ఏమిటో మంత్రి చెప్పాలని వారు కోరారు. సర్పంచ్‌లతో సమానంగా గ్రామజ్యోతి కార్యక్రమంలో హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. -
పల్లెకు వెలుగు
- సంఘటితశక్తి చాటాలి.. అభివృద్ధికి బాటలు పరచాలి - ‘గ్రామజ్యోతి’పై అవగాహన సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం - గ్రామాల ప్రగతితోనే రాష్ట్రాభివృద్ధి.. ఇప్పటిదాకా - స్థానిక సంస్థల ద్వారా ఆశించిన అభివృద్ధి జరగలేదు - ప్రజలను భాగస్వామ్యం చేయకపోవడమే ఇందుకు కారణం - గ్రామజ్యోతికి నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తాం - గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్‌లే మనకు ఆదర్శం - అక్షరాస్యత సాధనకు యువశక్తిని వినియోగించుకోవాలి - ప్రతి గ్రామంలో ఒకరోజు పవర్‌డే నిర్వహించాలి - ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండేలా చూడాలి - పల్లెల నుంచి గుడుంబాను తరిమికొట్టాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వెలుగులు నింపడమే గ్రామజ్యోతి లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పల్లెల్లో మార్పు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా గ్రామీణ ప్రాంతాల్లో గుణాత్మకమైన మార్పు ఆశించినంత స్థాయిలో రాలేదన్నారు. సంఘటితశక్తి గురించి ప్రజలకు బలంగా చెప్పలేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ద్వారా ఆశించిన మేరకు అభివృద్ధి జరగని పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకురావాల్సి వచ్చిందని వివరించారు. గ్రామజ్యోతిలో మార్పు సాధకుల (చేంజ్ ఏజెంట్స్) పాత్ర ఎంతో కీలకమైందని చెప్పారు. ఈనెల 17 నుంచి నిర్వహించ తలపెట్టిన ‘గ్రామజ్యోతి’పై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, మండలాల చేంజ్ ఏజెంట్లకు మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘స్థానిక సంస్థల ద్వారా వచ్చే నిధులను ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేయకపోవడం, గ్రామాభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములుగా చేయకపోవడం వల్లనే పల్లెల్లో అభివృద్ధి జరగలేదు. సరైన ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యంతో బాగుపడిన గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్ గ్రామాలు మన తెలంగాణలోనే ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ, సహకార వ్యవస్థలు ఈ గ్రామాల్లో పటిష్టంగా ఉన్నాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు ముందుకు పోవాలి. దేశంలోని చాలా గ్రామాలు ఈ మూడు గ్రామాలను చూసి ఎంతో నేర్చుకుంటున్నాయి. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు ‘తెలంగాణ రాష్ట్ర సాధనే’ ఉదాహరణ’’ అని సీఎం పేర్కొన్నారు. రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తాం గ్రామజ్యోతి ద్వారా రానున్న నాలుగేళ్లలో రూ.25 వేల కోట్లు ఖర్చుపెడతామని సీఎం చెప్పారు. దీన్ని కేవలం సర్పంచుల కార్యక్రమంగా చూడొద్దని, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలంతా పాల్గొని గ్రామాల ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకొనేలా ప్రణాళిక రూపొందించుకొని, ఆ గ్రామాన్ని మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు. ‘‘గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. గ్రామాల్లో చెత్తను సేకరించడానికి 25 వేల రిక్షాలను ప్రభుత్వం కొని ఇస్తుంది. ప్రతి 750 మంది జనాభాకు ఒక చెత్త రిక్షాను ఇస్తాం. అలాగే శ్మశాన వాటికల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలి. ఒకరోజును ‘పవర్‌డే’గా నిర్వహించి వంగిన విద్యుత్ స్తంభాలను, వేలాడే తీగలను సరిచేయాలి. ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండేలా చూడాలి. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని గుర్తించి వారికి వైద్యం చేయించాలి’’ అని సీఎం అధికారులను కోరారు. కూనం రాజమౌళికి ఘన సన్మానం గంగదేవిపల్లి గ్రామాన్ని దే శంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కూనం రాజమౌళిని ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం చేసిన కృషిని రాజమౌళి వివరించారు. గ్రామజ్యోతిపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె.తారక రామారావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, జోగురామన్న, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న ముల్కనూరూ బాగోలేదు ‘‘మొన్న నేను దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరుకు వెళ్లా. అక్కడ కూడా పరిస్థితి ఏమీ బాగోలేదు. దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. మీరంతా గ్రామాలకు వెళ్లినపుడు కూడా ఇదే నిరుత్సాహ పరిస్థితి కనిపిస్తుంది. కానీ నీరు కారిపోవద్దు. గ్రామానికి వెళ్లగానే పరిస్థితిపై అంచనాకు రావాలి. అక్కడి ప్రజలతో కలిసి ప్రణాళికలు రూపొందించాలి. సంఘటిత శక్తిలో ఎంతో బలముందని ప్రజలకు చెప్పాలి. గ్రామానికి ఏమౌవసరం, మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి, తదితర అంశాలపై అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలి’’ అని సీఎం వివరించారు. గ్రామజ్యోతికి మార్గదర్శకాలివీ.. గ్రామాల్లో వంద శాతం అక్ష్యరాస్యత సాధనకు చదువుకున్న యువతను వినియోగించుకోవాలి ప్రజలను చైతన్యపరచడం, అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడం మార్పు సాధకుల కర్తవ్యం మురికి కాలువల నుంచి వచ్చే నీటి కోసం ఊరి అవతల సోక్ ట్యాంకులు నిర్మించాలి గ్రామాల్లో గుడుంబా మహమ్మారి ఓ విష వలయంగా తయారైంది. గ్రామాల నుంచి దీన్ని తరిమికొట్టేలా ప్రజల్లో చైతన్యం తేవాలి గిరిజన తండాలు, ఆదివాసీ గూడేల కోసం ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, దళిత వాడల కోసం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు వాడుకోవచ్చు గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల, పంచాయతీ సిబ్బంది వేతనాలను సవరించుకోవచ్చు. గతంలో ఉన్న 30శాతం ఆదాయాన్ని ఖర్చు చేసే వెసులుబాటు పరిమితిని తాజాగా 50 వేలకు పెంచాం. అధికారులు గ్రామసభల షెడ్యూల్ రూపొందించాలి గ్రామసభలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు తప్పనిసరిగా పాల్గొనాలి. నాలుగేళ్లకుగాను అభివృద్ధి ప్రణాళికను గ్రామసభలోనే రూపొందించాలి. గ్రామాల శక్తిని పరిపుష్టం చేయాలి -
గ్రామజ్యోతిపై సీఎం కేసీఆర్ సమావేశం
-
'మండలంలో ఒక ఊరును ఎమ్మెల్యేలు దత్తత తీసుకోవాలి'
హైదరాబాద్: గ్రామజ్యోతి పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు, కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీసీఈవోలు హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రామజ్యోతి విధివిధానాలు, అమలుచేయాల్సిన తీరు, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై వారికి వివరించారు. గ్రామాల్లో పేదరికాన్ని తరిమికొట్టాలని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు. మండలానికి ఒక ఊరును ఎమ్మెల్యేలు దత్తత తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత స్థానికులేదనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈనెల 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టాలని ఇప్పటికే కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిప్రకారం ప్రతి గ్రామంలో విధిగా గ్రామ సభలు నిర్వహించి వచ్చే నాలుగేళ్లకు ప్రణాళికలు రూపొందించడం, జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో తయారైన ప్రణాళికలను అనుసరించి నిధులు విడుదల చేయడం, ఏ గ్రామానికి ఏ పని కోసం ఎన్ని నిధులు విడుదలయ్యాయో ప్రజలకు చెప్పడంవంటివి చేస్తారు. -
గ్రామజ్యోతి పధకంపై కేసీఆర్ విస్తృత చర్చ
-
సమగ్ర అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’
- మంత్రి కేటీఆర్ ఈనెల 17 నుంచి 23 వరకు కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ తెలంగాణ రూపురేఖలను సమూలంగా మార్చేందుకే ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టిందని, పారిశుద్ధ్య వారోత్సవాలతో ఈ కార్యక్రమానికి ఈనెల 17న శ్రీకారం చుట్టనున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమ విధివిధానాల రూపకల్పన కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో మరోమారు భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులతో పాటు తాగునీరు, విద్య, సామాజిక భద్రత, వ్యవసాయం, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి కీలకమైన అంశాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంతోనే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బందిని, ప్రజాప్రతినిధులను, ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని ఉన్నతాధికారులకు సూచించామన్నారు. ప్రధానంగా ఈ నెల 17 నుంచి 23 వరకు చేపట్టాల్సిన గ్రామజ్యోతి కార్యక్రమాల షెడ్యూల్ పైనే మంత్రివర్గ ఉప సంఘం చర్చించిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపాకే పూర్తిస్థాయి ప్రణాళికను విడుదల చేయాలని సబ్ కమిటీ నిర్ణయించిందన్నారు. సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, హరీశ్‌రావు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామజ్యోతిలో భాగమవుతాం పల్లెసీమల బాగు కోసం చేపడుతున్న గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీటీసీలను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం విజ్ఞప్తి చేసింది. ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర నాయకులు సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. గ్రామాల్లో ఎంపీటీసీలకు ప్రత్యేక కార్యాలయాల ఏర్పాటు, స్థానిక సంస్థల నిధుల్లో కేటాయింపులు, అలవెన్సులతో కలిపి వేతనం రూ.20 వేలకు పెంపు, ఎంపీ, ఎమ్మెల్యేలకు మాదిరిగా ప్రతి ఏటా సీడీపీ నిధులు, ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఆరోగ్యబీమా తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి కేటీఆర్‌కు అందించారు. -
పల్లెపల్లెనా ‘గ్రామజ్యోతి’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ గ్రామస్థాయిలో తీసుకురావాలని.. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి గ్రామాల అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పల్లె పల్లెనా విస్తృతస్థాయిలో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రజలే సారథులుగా నిలబడాలి. సంఘటితంగా పనిచేస్తే వచ్చే ఫలితాలెలా ఉంటాయో కళ్ల ముందే ఉన్నాయి. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి, నిజామాబాద్ జిల్లా అంకాపూర్ లాంటి గ్రామాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు... కరీంనగర్ జిల్లా ముల్కనూరు గ్రామం సహకార వ్యవస్థకు మంచి ఉదాహరణలు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ చాలా గొప్పగా జరిగింది. అదే స్ఫూర్తితో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం నిర్వహించాలి..’’ అని ఆయన పేర్కొన్నారు. గ్రామజ్యోతి ప్రజలదే.. ‘గ్రామజ్యోతి’ అంటే గ్రామాలకు నిధులు కేటాయించడమే కాదని, ప్రతి పౌరుడిని చైతన్యపరిచి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘తొలి దశలో ప్రజలం తా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి. తమ గ్రామానికి ఏ సదుపాయం అత్యవసరమో వారే నిర్ణయించాలి. జిల్లాలో ఉండే అధికారులు ఒక్కో మండలానికి ఒకరు ఛేంజ్ ఏజెంట్లుగా ఉండాలి. నిర్లక్ష్యానికి గురైన దళిత వాడలు, గిరిజన తండాల నుంచే ఈ మార్పునకు శ్రీకారం చుట్టాలి. వచ్చే ఐదేళ్ల కోసం ప్రతి గ్రామానికి ప్రణాళిక సిద్ధం కావాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాలు రూపొందించాలి. చెత్త లేకుండా చేయడం, ముళ్ల పొదల తొలగింపు, రహదారుల మరమ్మతులు, మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పాత బావులు పూడ్చడం వంటి చిన్నపాటి శ్రమదానంతో చేసే పనులను ముందుగా చేపట్టాలి. మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుంది. బాగా పనిచేసిన గ్రామాలకు అవార్డులు ఇస్తాం..’’ అని కేసీఆర్ చెప్పారు. ప్రతి ముఖ్యమైన అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని పనులు పర్యవేక్షించాలని సూచించారు. మండలానికో అధికారి ఇన్చార్జిగా ఈ కార్యక్రమాలను సమన్వయం చేయాలని, ఆ ఇన్చార్జి ఆధ్వర్యంలోనే గ్రామసభ నిర్వహించాలని చెప్పారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, సివిల్ సప్లయిస్, రహదారుల నిర్మాణం, పెన్షన్లు తదితర పథకాలన్నింటా వస్తున్న కోట్లాది రూపాయలను గ్రామ ప్రణాళికకు అనుసంధానం చేసుకోవాలని సూచించారు. సీనరేజీ నిధులు చెల్లిస్తాం.. సీనరేజీ, కమర్షియల్ ట్యాక్స్, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. పంచాయతీలకు అవసరమైన సిబ్బందిని నియమిస్తామన్నారు. గ్రామ పంచాయతీల విధులు-బాధ్యతలు అనే అంశంపై విధివిధానాలు రూపొందించాలని, అవి కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. గంగదేవిపల్లి గ్రామం మాదిరిగా కమిటీలు వేసుకొని ప్రజల భాగస్వామ్యం పెంచాలని చెప్పారు. గ్రామజ్యోతి తరహాలో త్వరలోనే ‘పట్టణ జ్యోతి’ కార్యక్రమం చేపడతామని తెలిపారు. కాగా.. గ్రామ పంచాయతీలు పన్నులు వసూలు చేయడమే కాకుండా ఇతర ఆదాయ వనరులపైనా దృష్టిపెట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. విలువైన భూములు వినియోగించడం ద్వారా, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించడం ద్వారా, ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనల ద్వారా.. ఇలా ఆదాయ మార్గాలను అన్వేషించుకోవాలని చెప్పారు. అనంతరం ‘గ్రామజ్యోతి’ కార్యక్రమంపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా... జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులు తమ అభిప్రాయలు, సూచనలు చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం, మం త్రులు కేటీఆర్, ఈటల, హరీశ్‌రావు, జోగు రామన్న, తుమ్మల, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 15న ప్రకటన.. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న సీఎం కేసీఆర్ ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రకటిస్తారు. 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే రోజున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 17 నుంచి 24వ తేదీ వరకు ‘గ్రామజ్యోతి’ వారోత్సవం జరుగుతుంది. దీనిపై ప్రజలను చైతన్యపరిచేందుకు సాంస్కృతిక సారథి కళాబృందాలు గ్రామాలకు తరలివెళతాయి. -
'త్వరలో పట్టణాల్లో పట్టణజ్యోతి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గ్రామాల సమగ్ర అభివృద్ధికోసమే గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టనున్నట్టు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి ప్రజలే సారథులుగా ఉండాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామజ్యోతి పథకం విజయవంతమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమంగా జరిగితే ఫలితం రాదని చెప్పారు. నిర్లక్ష్యానికి గురైన దళితవాడలు, గిరిజన తండాల నుంచి మార్పుకు శ్రీకారం చుట్టాలన్నారు. గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమంలాగానే.. పట్టణాల్లో త్వరలో 'పట్టణ జ్యోతి' కార్యక్రమం ప్రారంభిస్తామని కేసీఆర్ తెలిపారు.