
గ్రామజ్యోతికి గవర్నర్ అభినందన
- 24న మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటన
- రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు. తాను సైతం గ్రామజ్యోతిలో పాల్గొనేందుకు వస్తానని.. గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుకు మాటిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలంలోని హజీపేట, కిషన్‌నగర్ గ్రామాల్లో పర్యటించేందుకు ఆయన అంగీకరించారు. శుక్రవారం ఉదయం మంత్రి కేటీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుసుకున్నారు.
గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. గ్రామాల్లో సమూల మార్పులు తెచ్చి సమగ్రాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని మంత్రి వివరించారు. పారిశుద్ధ్య, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రజల కనీస అవసరాలతో పాటు మౌలిక వసతులు, సహజ వనరుల నిర్వహణ వంటి కీలకమైన ఏడు అంశాల్లో అభివృద్ధికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు గవర్నర్‌కు చెప్పారు. కాగా, నాలుగు రోజులుగా గ్రామజ్యోతి గురించి తెలుసుకుంటున్నానని చెప్పిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో జరగనున్న టీ-హబ్ ప్రారంభోత్సవానికి కూడా రావాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రితోపాటు గవర్నర్‌ను కలసిన వారిలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ-హబ్ డెరైక్టర్లు ఉన్నారు.