సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ గ్రామస్థాయిలో తీసుకురావాలని.. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి గ్రామాల అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పల్లె పల్లెనా విస్తృతస్థాయిలో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రజలే సారథులుగా నిలబడాలి. సంఘటితంగా పనిచేస్తే వచ్చే ఫలితాలెలా ఉంటాయో కళ్ల ముందే ఉన్నాయి. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి, నిజామాబాద్ జిల్లా అంకాపూర్ లాంటి గ్రామాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు... కరీంనగర్ జిల్లా ముల్కనూరు గ్రామం సహకార వ్యవస్థకు మంచి ఉదాహరణలు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ చాలా గొప్పగా జరిగింది. అదే స్ఫూర్తితో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం నిర్వహించాలి..’’ అని ఆయన పేర్కొన్నారు.
గ్రామజ్యోతి ప్రజలదే..
‘గ్రామజ్యోతి’ అంటే గ్రామాలకు నిధులు కేటాయించడమే కాదని, ప్రతి పౌరుడిని చైతన్యపరిచి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘తొలి దశలో ప్రజలం తా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి. తమ గ్రామానికి ఏ సదుపాయం అత్యవసరమో వారే నిర్ణయించాలి. జిల్లాలో ఉండే అధికారులు ఒక్కో మండలానికి ఒకరు ఛేంజ్ ఏజెంట్‌లుగా ఉండాలి. నిర్లక్ష్యానికి గురైన దళిత వాడలు, గిరిజన తండాల నుంచే ఈ మార్పునకు శ్రీకారం చుట్టాలి. వచ్చే ఐదేళ్ల కోసం ప్రతి గ్రామానికి ప్రణాళిక సిద్ధం కావాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాలు రూపొందించాలి. చెత్త లేకుండా చేయడం, ముళ్ల పొదల తొలగింపు, రహదారుల మరమ్మతులు, మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పాత బావులు పూడ్చడం వంటి చిన్నపాటి శ్రమదానంతో చేసే పనులను ముందుగా చేపట్టాలి. మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుంది. బాగా పనిచేసిన గ్రామాలకు అవార్డులు ఇస్తాం..’’ అని కేసీఆర్ చెప్పారు. ప్రతి ముఖ్యమైన అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని పనులు పర్యవేక్షించాలని సూచించారు. మండలానికో అధికారి ఇన్‌చార్జిగా ఈ కార్యక్రమాలను సమన్వయం చేయాలని, ఆ ఇన్‌చార్జి ఆధ్వర్యంలోనే గ్రామసభ నిర్వహించాలని చెప్పారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, సివిల్ సప్లయిస్, రహదారుల నిర్మాణం, పెన్షన్లు తదితర పథకాలన్నింటా వస్తున్న కోట్లాది రూపాయలను గ్రామ ప్రణాళికకు అనుసంధానం చేసుకోవాలని సూచించారు.
సీనరేజీ నిధులు చెల్లిస్తాం..
సీనరేజీ, కమర్షియల్ ట్యాక్స్, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. పంచాయతీలకు అవసరమైన సిబ్బందిని నియమిస్తామన్నారు. గ్రామ పంచాయతీల విధులు-బాధ్యతలు అనే అంశంపై విధివిధానాలు రూపొందించాలని, అవి కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. గంగదేవిపల్లి గ్రామం మాదిరిగా కమిటీలు వేసుకొని ప్రజల భాగస్వామ్యం పెంచాలని చెప్పారు. గ్రామజ్యోతి తరహాలో త్వరలోనే ‘పట్టణ జ్యోతి’ కార్యక్రమం చేపడతామని తెలిపారు. కాగా.. గ్రామ పంచాయతీలు పన్నులు వసూలు చేయడమే కాకుండా ఇతర ఆదాయ వనరులపైనా దృష్టిపెట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. విలువైన భూములు వినియోగించడం ద్వారా, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించడం ద్వారా, ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనల ద్వారా.. ఇలా ఆదాయ మార్గాలను అన్వేషించుకోవాలని చెప్పారు. అనంతరం ‘గ్రామజ్యోతి’ కార్యక్రమంపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా... జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులు తమ అభిప్రాయలు, సూచనలు చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం, మం త్రులు కేటీఆర్, ఈటల, హరీశ్‌రావు, జోగు రామన్న, తుమ్మల, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆగస్టు 15న ప్రకటన..
స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న సీఎం కేసీఆర్ ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రకటిస్తారు. 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే రోజున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 17 నుంచి 24వ తేదీ వరకు ‘గ్రామజ్యోతి’ వారోత్సవం జరుగుతుంది. దీనిపై ప్రజలను చైతన్యపరిచేందుకు సాంస్కృతిక సారథి కళాబృందాలు గ్రామాలకు తరలివెళతాయి.
పల్లెపల్లెనా ‘గ్రామజ్యోతి’
Published Fri, Jul 31 2015 3:17 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement