'మండలంలో ఒక ఊరును ఎమ్మెల్యేలు దత్తత తీసుకోవాలి'
హైదరాబాద్: గ్రామజ్యోతి పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు, కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీసీఈవోలు హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రామజ్యోతి విధివిధానాలు, అమలుచేయాల్సిన తీరు, పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై వారికి వివరించారు. గ్రామాల్లో పేదరికాన్ని తరిమికొట్టాలని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు. మండలానికి ఒక ఊరును ఎమ్మెల్యేలు దత్తత తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత స్థానికులేదనని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈనెల 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టాలని ఇప్పటికే కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిప్రకారం ప్రతి గ్రామంలో విధిగా గ్రామ సభలు నిర్వహించి వచ్చే నాలుగేళ్లకు ప్రణాళికలు రూపొందించడం, జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో తయారైన ప్రణాళికలను అనుసరించి నిధులు విడుదల చేయడం, ఏ గ్రామానికి ఏ పని కోసం ఎన్ని నిధులు విడుదలయ్యాయో ప్రజలకు చెప్పడంవంటివి చేస్తారు.