ఢిల్లీకి సీఎం కేసీఆర్
♦ నేడు ప్రధాని మోదీతో భేటీ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ
♦ రేపు రాజ్‌నాథ్, జైట్లీతో సమావేశం 14న రాష్ట్రానికి రాక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. గురువారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో హస్తినకు పయనమయ్యారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలుసుకుంటారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధానితో కేసీఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ప్రధానిని రాష్ట్రానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి భేటీ తర్వాత ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అధికారికంగా ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఈ నెల 13న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా సీఎం కలవనున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన తదితర అంశాలపై రాజ్‌నాథ్‌తో చర్చించనున్నట్లు సమాచారం. 13వ ఫైనాన్స్ కమిషన్ కేటాయింపుల పెండింగ్ క్లియరెన్స్, రాష్ట్రానికి రావాల్సిన సీఎస్‌టీ బకాయిలు, తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టు తదితర అంశాలపై అరుణ్‌జైట్లీతో సీఎం చర్చించే అవకాశాలున్నాయి.
కాళేశ్వరానికి జాతీయ హోదాపై..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మార్పుచేర్పులు చేస్తూ కొత్తగా చేపట్టిన ‘కాళేశ్వరం’ ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానికి విన్నవించనున్నారు. ఇప్పటికే కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సూచనలకు అనుగుణంగా ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్) సిద్ధమైనందున.. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరనున్నారు. రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇప్పటికే కేంద్రం హామీ ఇచ్చినందున.. కాళేశ్వరానికి జాతీయ హోదాపై ప్రధానికి మరోమారు నివేదించనున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు గురువారం రాత్రి బయల్దేరి వెళ్లే ముందు సీఎం గవర్నర్‌తో పలు అంశాలపై చర్చించారు. కేంద్రంతో చర్చించనున్న కొన్ని అంశాలతోపాటు విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విషయాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం, మేయర్, డిప్యూటీ మేయర్ల నియామకం, విశ్వనగర అభివృద్ధి ప్రణాళికకు ప్రభుత్వం అనుసరించనున్న అంశాలను గవర్నర్‌కు సీఎం నివేదించారు. టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరేం దుకు ఆసక్తి ప్రదర్శిస్తుండటం, ఇప్పటికే పలువురు పార్టీలో చేరటం చర్చకు వచ్చినట్లు సమాచారం.