అభ్యర్థులతో రేపు కేసీఆర్‌ భేటీ | KCR Meeting With MLA Candidates In Hyderabad | Sakshi
Sakshi News home page

అభ్యర్థులతో రేపు కేసీఆర్‌ భేటీ

Published Sat, Nov 10 2018 1:21 AM | Last Updated on Sat, Nov 10 2018 1:21 AM

KCR Meeting With MLA Candidates In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వ్యూహంలో టీఆర్‌ఎస్‌ మరో ముందడుగు వేయనుంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళం... బీఫారాల పంపిణీలోనూ ఇదే దూకుడును ప్రదర్శించనుంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఒకరోజు ముందే అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకుగాను ఇప్పటికే ప్రకటించిన 107 స్థానాల అభ్యర్థులతో కేసీఆర్‌ ఆదివారం తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలోనే పార్టీ అభ్యర్థులకు బీఫారాలను అందించనున్నారు. బీఫారాల పంపిణీతోపాటు ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. 

ప్రచారంపై సమీక్ష... 
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో సోమవారం నుంచి అసలైన ఎన్నికల పోరు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పార్టీ అభ్యర్థులకు మరోసారి ఎన్నికల వ్యూహానికి సంబంధించిన కీలకాంశాలను వివరించే అవకాశం ఉంది. బీఫారాలను పంపిణీ చేయడంతోపాటు ఎవరెవరు ఏయే రోజుల్లో నామినేషన్‌ వేయాలనే విషయంలోనూ సూచనలు చేసే అవకాశం ఉందని తెలిసింది. 

ప్రచార షెడ్యూల్‌ సిద్ధం... 
సీఎం కేసీఆర్‌ ప్రచారం కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, శ్రేణులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌ 7న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్‌... ఆ తర్వాత నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మహాకూటమి అభ్యర్థుల ఖరారు తర్వాతే పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. కూటమి అభ్యర్థులను ప్రకటించగానే టీఆర్‌ఎస్‌ అధినేత వరుసగా బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు, నియోజకవర్గాలవారీగా ప్రచార షెడ్యూల్‌ను ఇప్పటికే రూపొందించారు. కూటమి అభ్యర్థులు ఖరారు కాగానే ఈ షెడ్యూల్‌ను అమలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి అభ్యర్థులను శనివారం ప్రకటిస్తే కేసీఆర్‌ సోమవారం నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల సమావేశంలో కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కేసీఆర్‌ ప్రచారం కోసం హెలికాప్టర్, ప్రత్యేక బస్సు సిద్ధమయ్యాయి. వాటి వాడకానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 

పూర్తిస్థాయి మేనిఫెస్టో రెడీ... 
ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్‌ పూర్తిస్థాయి మేనిఫెస్టోనూ రూపొందించారు. రుణమాఫీ, ఆసరా పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్థి పథకం హామీలకు ప్రజల్లో ఇప్పటికే మంచి స్పందన వస్తోందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అందరికీ జీవిత బీమా వంటి వినూత్న పథకాలను తుది మేనిఫెస్టోలో చేర్చనున్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి పథకం ఎలా ఉండాలనే అంశంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే కేసీఆర్‌కు నివేదిక ఇచ్చింది. ఈ పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చనున్నారు. మేనిఫెస్టో రూపకల్పన పూర్తయినా ఇంకా ఎలాంటి అంశాలను చేర్చాలో చెప్పాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, ముఖ్యనేతలకు కేసీఆర్‌ సూచిస్తున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. తుది మేనిఫెస్టోలో అన్ని అంశాలను చేర్చే అవకాశం ఉంది. 

రేపు గజ్వేల్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ... 
తాను పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రచారంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. గజ్వేల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సుమారు 15 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు.  

స్టార్‌ క్యాంపెయినర్లు.. 
టీఆర్‌ఎస్‌ నుంచి అధికారికంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వారి జాబితాను సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. ప్రచారం కోసం 40 మందిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ నేతలను     స్టార్‌ క్యాంపెయినర్లుగా టీఆర్‌ఎస్‌ నియమించనుంది.  

పెండింగ్‌ స్థానాలపై  2–3 రోజుల్లో నిర్ణయం 
అభ్యర్థులను ప్రకటించాల్సిన 12 స్థానాల విషయంలోనూ సీఎం కేసీఆర్‌ 2–3 రోజుల్లో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఈ స్థానాలపై ప్రకటన చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అయితే కూటమి అభ్యర్థుల ప్రకటన ఇంకా ఆలస్యమైతే మాత్రం టీఆర్‌ఎస్‌ వెంటనే ఆ స్థానాలను ప్రకటించనుందని తెలిసింది. హుజూర్‌నగర్, కోదాడ, వరంగల్‌ తూర్పు, చొప్పదండి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్, చార్మినార్‌ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement