సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతృత్వం లోని కూటమిని దీటుగా ఎదుర్కొనే దిశగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థులను ఇంకా ప్రకటించని స్థానాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సామాజిక సమీకరణ లెక్కల ప్రకారమే టీఆర్‌ఎస్ జాబితా ఉండాలని భావిస్తున్నారు. ఈ నేప థ్యంలో కూటమి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే పెండింగ్‌లో ఉన్న 12 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాలని ఆయన నిర్ణయిం చారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకోవాలని పలువురు నేతలకు సూచించారు. ఏ రోజైనా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ది సంస్థ చైర్మన్ ప్రేంసింగ్ రాథోడ్ తన పదవికి రాజీనామా చేశారు. గోషామహల్ స్థానంలో ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించనున్నారు.
అలాగే మిగిలిన స్థానాల విషయంలోనూ పలువురు నేతలకు ఇదే రకమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే ఖైరతాబాద్, చొప్పదండి, హుజూర్‌నగర్ స్థానాల అభ్యర్థులను ప్రకటించే విషయంలో టీఆర్‌ఎస్ అధిష్టానానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మూడు స్థానాల్లోనూ మహిళా నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. చొప్పదండిలో తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, హూజూర్‌నగర్‌లో శంకరమ్మ, ఖైరతాబాద్‌లో విజయారెడ్డి టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ 65 స్థానాలకు ప్రకటించిన తొలి జాబితాలోనే పది మంది మహిళలకు అవకాశం కల్పించింది. టీఆర్‌ఎస్ ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో నలుగురు మహిళలు మాత్రమే ఉన్నారు. దీంతో తుది జాబితాపై సీఎం కేసీఆర్ మరోసారి కసరత్తు చేస్తున్నారు. కూటమి రెండో జాబితాను పరిశీలించి వెంటనే టీఆర్‌ఎస్ తుది జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది.
అభ్యర్థుల రాజీనామాలు...
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను కేసీఆర్ ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి(వనపర్తి), మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి(బాల్కొండ), ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ(రామగుండం), సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్(మానకొండూరు), ఎస్టీ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు(అశ్వారావుపేట), సెట్విన్ చైర్మన్ ఇనాయత్ అలీ బాక్రీ(బహదూర్‌పుర), ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి(సత్తుపల్లి), పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి(నర్సంపేట) తమ పదవులకు రాజీనామా చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
నేడు కేసీఆర్ నామినేషన్...
సీఎం కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఉదయం తొమ్మిది గంటలకు నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకన్న ఆలయానికి వెళతారు. నామినేషన్ పత్రాలను వెంకన్న చెంత పెట్టి పూజలు నిర్వహిస్తారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తారు. అనంతరం గజ్వేల్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. మంత్రి హరీశ్‌రావు సైతం కేసీఆర్‌తోపాటే కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం సిద్ధిపేటలో నామినేషన్ దాఖలు చేస్తారు.
కేసీఆర్ ప్రచార షెడ్యూల్ సిద్ధం...
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార ప్రణాళిక సిద్ధమైంది. వాస్తవానికి గురువారం నుంచే పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించాలని ఆయన ముందుగా నిర్ణయించారు. అయితే కూటమి అభ్యర్థుల పూర్తి జాబితా వెల్లడైన తర్వాతే ప్రచారం మొదలు పెట్టే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ప్రత్యర్థిగా ఉంటారో స్పష్టత వచ్చాకే ప్రచారం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా, కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను, పెండింగ్ స్థానాల అభ్యర్థుల జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment