విభజన చట్టంలో ఆస్తులు, అప్పులపై చర్చించిన సీఎంలు
విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు ఏర్పాటుకు నిర్ణయం
మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయం
మరోసారి సీఎస్‌ల స్థాయిలో భేటీ నిర్వహించాలని నిర్ణయం
హైదరాబాద్‌లో కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలన్న చంద్రబాబు
హైదరాబాద్‌లో స్థిరాస్తులు ఏపీకి ఇవ్వడానికి రేవంత్ నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా సమావేశం కొనసాగింది విభజన చట్టంలో ఆస్తులు, అప్పులపై సీఎంలు చర్చించారు. ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. కాగా, సీఎంల భేటీకి ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. పవన్ ఎందుకు హాజరుకాలేదంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది.
విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై చర్చిస్తూ.. హైదరాబాద్‌లో కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరగా.. హైదరాబాద్‌లో ఉన్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకే చెందుతాయని రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. కావాలంటే ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలో భవనం కట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తామని తెలంగాణ సర్కార్ చెప్పింది.
భద్రాచలంలో నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని ఐదు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగింది. కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోసారి సీఎస్‌ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. విభజన సమస్యలపై రెండు కమిటీలు ఏర్పాటుకు నిర్ణయించగా, మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయనున్నారు.
షెడ్యూల్ 9,10లోని ఆస్తుల పంపకం, ఏపీ రావాల్సిన 7,200 కోట్ల విద్యుత్ బకాయిలు, ఉమ్మడి సంస్థలపై షీలా భిడే కమిషన్ సిఫార్సుల అమలు, ఫైనాన్స్ కార్పొరేషన్, ఉద్యోగుల విభజన అంశాలు, లేబర్ సెస్ పంపకాలపై చర్చ జరిగింది.
ముఖ్యమంత్రుల భేటీ.. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు:
- రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలుపబడ్డ 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000కి.మీ మేర విస్తారమైన తీరప్రాంతం (Coastal Corridor) ఉంది. తెలంగాణకు ఈ తీరప్రాంతంలో భాగం కావాలి
- తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి. తెలంగాణకు కూడా టీటీడీలో భాగం కావాలి
- కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలి
- తెలంగాణ విద్యుత్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని చెల్లించడం జరుగుతుంది
- తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి
Comments
Please login to add a commentAdd a comment