పల్లెకు వెలుగు | grama jyothi sceme will lightup the villages, says cm kcr | Sakshi
Sakshi News home page

పల్లెకు వెలుగు

Published Wed, Aug 12 2015 2:19 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

మంగళవారం ‘గ్రామ జ్యోతి’ అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ - Sakshi

మంగళవారం ‘గ్రామ జ్యోతి’ అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

- సంఘటితశక్తి చాటాలి.. అభివృద్ధికి బాటలు పరచాలి
- ‘గ్రామజ్యోతి’పై అవగాహన సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
- గ్రామాల ప్రగతితోనే రాష్ట్రాభివృద్ధి.. ఇప్పటిదాకా
- స్థానిక సంస్థల ద్వారా ఆశించిన అభివృద్ధి జరగలేదు
- ప్రజలను భాగస్వామ్యం చేయకపోవడమే ఇందుకు కారణం
- గ్రామజ్యోతికి నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తాం
- గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్‌లే మనకు ఆదర్శం
- అక్షరాస్యత సాధనకు యువశక్తిని వినియోగించుకోవాలి
- ప్రతి గ్రామంలో ఒకరోజు పవర్‌డే నిర్వహించాలి
- ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండేలా చూడాలి
- పల్లెల నుంచి గుడుంబాను తరిమికొట్టాలని పిలుపు
 
సాక్షి, హైదరాబాద్:
గ్రామాల్లో వెలుగులు నింపడమే గ్రామజ్యోతి లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పల్లెల్లో మార్పు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా గ్రామీణ ప్రాంతాల్లో గుణాత్మకమైన మార్పు ఆశించినంత స్థాయిలో రాలేదన్నారు. సంఘటితశక్తి గురించి ప్రజలకు బలంగా చెప్పలేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

 

స్థానిక సంస్థల ద్వారా ఆశించిన మేరకు అభివృద్ధి జరగని పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకురావాల్సి వచ్చిందని వివరించారు. గ్రామజ్యోతిలో మార్పు సాధకుల (చేంజ్ ఏజెంట్స్) పాత్ర ఎంతో కీలకమైందని చెప్పారు. ఈనెల 17 నుంచి నిర్వహించ తలపెట్టిన ‘గ్రామజ్యోతి’పై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, మండలాల చేంజ్ ఏజెంట్లకు మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు.

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘‘స్థానిక సంస్థల ద్వారా వచ్చే నిధులను ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేయకపోవడం, గ్రామాభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములుగా చేయకపోవడం వల్లనే పల్లెల్లో అభివృద్ధి జరగలేదు. సరైన ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యంతో బాగుపడిన గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్ గ్రామాలు మన తెలంగాణలోనే ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ, సహకార వ్యవస్థలు ఈ గ్రామాల్లో పటిష్టంగా ఉన్నాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు ముందుకు పోవాలి. దేశంలోని చాలా గ్రామాలు ఈ మూడు గ్రామాలను చూసి ఎంతో నేర్చుకుంటున్నాయి. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు ‘తెలంగాణ రాష్ట్ర సాధనే’ ఉదాహరణ’’ అని సీఎం పేర్కొన్నారు.

రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తాం
గ్రామజ్యోతి ద్వారా రానున్న నాలుగేళ్లలో రూ.25 వేల కోట్లు ఖర్చుపెడతామని సీఎం చెప్పారు. దీన్ని కేవలం సర్పంచుల కార్యక్రమంగా చూడొద్దని, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలంతా పాల్గొని గ్రామాల ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకొనేలా ప్రణాళిక రూపొందించుకొని, ఆ గ్రామాన్ని మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు.

‘‘గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. గ్రామాల్లో చెత్తను సేకరించడానికి 25 వేల రిక్షాలను ప్రభుత్వం కొని ఇస్తుంది. ప్రతి 750 మంది జనాభాకు ఒక చెత్త రిక్షాను ఇస్తాం. అలాగే శ్మశాన వాటికల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలి. ఒకరోజును ‘పవర్‌డే’గా నిర్వహించి వంగిన  విద్యుత్ స్తంభాలను, వేలాడే తీగలను సరిచేయాలి. ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండేలా చూడాలి. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని గుర్తించి వారికి వైద్యం చేయించాలి’’ అని సీఎం అధికారులను కోరారు.

కూనం రాజమౌళికి  ఘన సన్మానం
గంగదేవిపల్లి గ్రామాన్ని దే శంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కూనం రాజమౌళిని ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం చేసిన కృషిని రాజమౌళి వివరించారు. గ్రామజ్యోతిపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె.తారక రామారావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జోగురామన్న, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
చిన్న ముల్కనూరూ బాగోలేదు
‘‘మొన్న నేను దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరుకు వెళ్లా. అక్కడ కూడా పరిస్థితి ఏమీ బాగోలేదు. దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. మీరంతా గ్రామాలకు వెళ్లినపుడు కూడా ఇదే నిరుత్సాహ పరిస్థితి కనిపిస్తుంది. కానీ నీరు కారిపోవద్దు. గ్రామానికి వెళ్లగానే పరిస్థితిపై అంచనాకు రావాలి. అక్కడి ప్రజలతో కలిసి ప్రణాళికలు రూపొందించాలి. సంఘటిత శక్తిలో ఎంతో బలముందని ప్రజలకు చెప్పాలి. గ్రామానికి ఏమౌవసరం, మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి, తదితర అంశాలపై అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలి’’ అని సీఎం వివరించారు.

గ్రామజ్యోతికి మార్గదర్శకాలివీ..

  • గ్రామాల్లో వంద శాతం అక్ష్యరాస్యత సాధనకు చదువుకున్న యువతను వినియోగించుకోవాలి
  • ప్రజలను చైతన్యపరచడం, అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడం మార్పు సాధకుల కర్తవ్యం
  • మురికి కాలువల నుంచి వచ్చే నీటి కోసం ఊరి అవతల సోక్ ట్యాంకులు నిర్మించాలి
  • గ్రామాల్లో గుడుంబా మహమ్మారి ఓ విష వలయంగా తయారైంది. గ్రామాల  నుంచి దీన్ని తరిమికొట్టేలా ప్రజల్లో చైతన్యం తేవాలి
  • గిరిజన తండాలు, ఆదివాసీ గూడేల కోసం ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, దళిత వాడల కోసం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు వాడుకోవచ్చు
  • గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల, పంచాయతీ సిబ్బంది వేతనాలను సవరించుకోవచ్చు. గతంలో ఉన్న 30శాతం ఆదాయాన్ని ఖర్చు చేసే వెసులుబాటు పరిమితిని తాజాగా 50 వేలకు పెంచాం.
  • అధికారులు గ్రామసభల షెడ్యూల్ రూపొందించాలి
  • గ్రామసభలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు తప్పనిసరిగా పాల్గొనాలి. నాలుగేళ్లకుగాను అభివృద్ధి ప్రణాళికను గ్రామసభలోనే రూపొందించాలి. గ్రామాల శక్తిని పరిపుష్టం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement