సీఎం పర్యటనలో పాము కలకలం
జగదేవ్‌పూర్ (మెదక్): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పర్యటనకు అనుకోని అతిథి ఒకటి వచ్చి అందరినీ కలవరానికి గురిచేసింది. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్.. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలో గురువారం పర్యటించారు. అయితే, ఎర్రవెల్లి గ్రామానికి ఆయన వెళ్లిన సమయంలో అక్కడ ఓ పాము కనిపించి కలకలం రేపింది. పాము కనిపించగానే అందరూ కొంతసేపు కంగారు పడ్డారు. అయితే కాసేపటికల్లా దానంతట అదే అక్కడే ఉన్న గుంతలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎర్రవెల్లి గ్రామంలో కేసీఆర్ అందరినీ పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటికో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. అనంతరం గ్రామజ్యోతి సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా చాలా మంది స్థానికులు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రావట్లేదని మొరపెట్టుకున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టివ్వాలని కోరారు.