సమస్యలు గాలికొదిలేసిన సర్కార్
కండువాలు మార్చే పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం
రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి విమర్శ
శంకర్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని, పార్టీ కండువాలు మార్చే పథకాన్ని శరవేగంగా అమలు చేస్తుందని రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక అతిథిగృహంలో శుక్రవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండకాలం తీవ్రంగా ఉందని, వర్షాలు లేక తాగు, సాగునీరు లేక, రైతన్నలు అల్లాడిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ‘గ్రామజ్యోతి’ పేరిట ప్రతి గ్రామంలో కమిటీలు వేశారే తప్ప.. ఇంతవరకు నిధులు కేటాయించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులను గ్రామజ్యోతి నిధులుగా చూపించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వనికి దమ్మూ, ధైర్యం ఉంటే వేసవిలో గ్రామాల్లోకి వెళ్లి గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లా ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఒక్క సమావేశం నిర్వహించలేదంటే ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో తెలుస్తోందన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం పథకానికి కొబ్బరికాయలు కొట్టకముందు ఇళ్ల బిల్లులు చెల్లించని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. రెండు సంవత్సరాలకాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తుందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాజకీయాలను పక్కనపెట్టి ప్రజాసమస్యలపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ నర్సింలు, వైస్ ఎంపీపీ శశిధర్‌రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్‌పాషా, దేవులనాయక్, నాయకులు నారాయణ, విఠలయ్య, ప్రకాశ్, మాణిక్‌రెడ్డి, రవీందర్, సత్యనారాయణరెడ్డి, చెంగల్ గోపాల్‌రెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, యాదయ్య, ఎంపీటీసీ సభ్యుడు మైసయ్య, యాదిరెడ్డి, పార్శి బాలకృష్ణ, లక్ష్మీకాంత్‌రెడ్డి, రమేష్, లింగారెడ్డి, గోవర్దన్ యాదవ్, బాలన్నగారి కాంతిరెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.