సమాంతర సభలు | Parallel Sessions Venues in karimnagar district | Sakshi
Sakshi News home page

సమాంతర సభలు

Published Tue, Aug 18 2015 6:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

Parallel Sessions Venues in karimnagar district

  • ఇటు గ్రామజ్యోతి... అటు 'మన ఊరు-మన ఎంపీ'
  •  జగిత్యాల నియోజకవర్గంలో భిన్న దృశ్యాలు
  •  అధికారుల్లో అయోమయంగామజ్యోతిలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
  •  మన ఊరు-మన ఎంపీ కొనసాగిస్తున్న కవిత
  •  జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన గ్రామజ్యోతి
  •  ఒకవైపు 'గ్రామజ్యోతి'.. ఇంకోవైపు ‘మన ఊరు- మన ఎంపీ’ ఒకేరోజు రెండు కార్యక్రమాలు... రెండు సభలు... ఎజెండా ఒకటే... లక్ష్యం ఒకటే...గ్రామాల సర్వతోముఖాభివృద్ధే రెండింటి ఉద్దేశం. ఇందులో ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా... మరొకటి నిజామాబాద్ ఎంపీ ఆధ్వర్యంలో నడుస్తోంది. జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు డబుల్ ధమాకా మాదిరిగా రెండు సభల్లో పాల్గొని కోర్కెల చిట్టా వివరిస్తుంటే... అధికారులు మాత్రం ఎటువైపు వెళ్లాలో అర్థంకాక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ ఎంపీ పరిధిలోని చల్‌గల్, చర్లపల్లి, అంతర్గాం, నర్సింగాపూర్ గ్రామాల్లో సోమవారం కనిపించిన దృశ్యాలివి.
     సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
     కరీంనగర్ జిల్లాలో గ్రామజ్యోతి కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, జిల్లా పరిషత్  చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా తమ తమ గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకవైపు గ్రామజ్యోతి ఉద్దేశాలు, లక్ష్యాలను వివరిస్తూనే గ్రామ సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో గ్రామస్తుల నుంచి వ్యక్తిగత సమస్యలను ఏక రువు పెడుతూ... దరఖాస్తులను తీసుకుంటూ వాటి పరిష్కారానికి హామీలు ఇచ్చారు. ఇక జగిత్యాల నియోజకవర్గం విషయానికొస్తే... నిజామాబాద్ ఎంపీ కవిత 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమం పేరిట ప్రత్యేక సభలు నిర్వహించారు.జగిత్యాల మండలం చల్‌గల్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత చల్‌గల్ గ్రామంలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి కాలినడకన తిరుగుతూ గ్రామ పరిస్థితిని అంచనా వేశారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన 'మన ఊరు-మన ఎంపీ' సభకు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాభివృద్ధికి ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఆటస్థలం, గ్రంథాలయం, కమ్యూనిటీ హాళ్లు, మహిళా భవన్, శ్మశానవాటిక, బ్రిడ్జి నిర్మాణం, ప్రత్యేక గోదాంల ఏర్పాటు, విద్యుత్ తీగల్లోని లోపాల సవరణ వంటి పనులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని చెప్పారు. మళ్లీ నవంబర్‌లో చల్‌గల్‌లో పర్యటిస్తానని పేర్కొన్నారు. ఎంపీ చల్‌గ ల్‌లో 'మన ఊరు-మన ఎంపీ' సభలో మాట్లాడుతున్న సమయంలోనే అక్కడికి సరిగ్గా పదడుగుల దూరంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామజ్యోతి సభ నడిచింది. స్థానికులు, పార్టీ నాయకులతోపాటు అధికారులంతా కవిత సభలో పాల్గొనడంతో గ్రామజ్యోతి వెలవెలబోయింది. ముఖ్యంగా అధికారుల్లో కొంత గందరగోళం నెలకొంది. గ్రామజ్యోతి కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలనే ఆదేశాలుండటం, అదే సమయంలో ఎంపీ ప్రత్యేకంగా సభ నిర్వహించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయినప్పటికీ అధికారులంతా కవిత నిర్వహించిన కార్యక్రమాల్లోనే పాల్గొనడం గమనార్హం. చల్‌గల్ సభ అనంతరం కవిత పార్టీ నాయకులు, అధికారులతో కలిసి చర్లపల్లి, అంతర్గాం, నర్సింగాపూర్ గ్రామాల్లోనూ పర్యటించి 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమాలు కొనసాగించారు. రాత్రి నర్సింగాపూర్‌లోనే బస చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాత్రం రాయికల్ మండల కేంద్రంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమానికి హాజరై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు గ్రామ సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.
     ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నా : ఎంపీ కవిత
     'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తనను ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉన్నానని, వారిని ప్రత్యక్షంగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం ద్వారా రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement