mana ooru mana mp
-
నిరసన 'జ్యోతి'
అప్పుడు 'మన ఊరు'.. ఇప్పుడు 'గ్రామ జ్యోతా'? సమస్యల పరిష్కారం కోసం ప్రజల ఆందోళన పలుచోట్ల గ్రామసభల బహిష్కరణ ఎక్కడికక్కడ అధికారుల నిలదీత.. ఆగ్రహం తొలిరోజు గ్రామజ్యోతిపై మిన్నంటిన ఆందోళనలు మంత్రి సభలోనూ సమస్యల పరిష్కారానికి డిమాండ్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం ప్రారంభానికి తొలిరోజే జిల్లాలో పలుచోట్ల నిరసనలు హోరెత్తాయి. 'మన ఊరు - మన ప్రణాళిక ఏమైం ది..? ఇప్పుడు మళ్లీ గ్రామజ్యోతితో వచ్చారా..?' అంటూ ప్రజలు, ప్రతిపక్షాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను నిల దీశారు. పలుచోట్ల గ్రామజ్యోతి సభలను బహిష్కరించడం గమనార్హం. అధికారులు కూడా ప్రజా నిరసనతో చేసేదేమీ లేక 'ప్రారంభం సక్సెస్' అన్నట్లు వెనుదిరిగి వచ్చారు. నిరసనలు- బహిష్కరణలు జిల్లా వ్యాప్తంగా సోమవారం గ్రామజ్యోతి సభలు ప్రారంభమయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే మద్దుపల్లిలో మంత్రి హాజరైన సభలోనూ గ్రామకమిటీలో ఇష్టానుసారంగా ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా చర్ల మండలంలోని సుబ్బంపేటలో జరిగిన గ్రామజ్యోతి సభను గ్రామస్తులు బహిష్కరించారు. తమకు గ్రామజ్యోతి కార్యక్రమంలో స్థానం కల్పించలేదని నిరసన తెలుపుతూ ఎంపీటీసీలు సభకు హాజరుకాలేదు. సభకు అన్ని శాఖల అధికారులు హాజరుకాకపోవటంపై గ్రామస్తులు సభను బహిష్కరిస్తున్నట్లుగా చెప్పి వెళ్లిపోయారు. వెంకటాపురం మండలంలోని మొర్రంవాని గూడెం, ఆలుబాక గ్రామాల్లో సభ నిర్వహించగా, ఎంపీటీసీలు హాజరుకాలేదు. కొత్తగూడెం మండలంలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో జరిగిన గ్రామజ్యోతి గ్రామసభలో ప్రజలు అధికారులను నిలదీశారు. మనఊరు-మన ప్రణాళిక కార్యక్రమం నిర్వహించి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, తిరిగి గ్రామజ్యోతి పేరుతో సభలెందుకు పెడుతున్నారని నోడల్ అధికారి తాతారావుపై మండిపడ్డారు. పాల్వంచ మండలంలోని సోములగూడెంలో గ్రామజ్యోతి సభకు ప్రజలు హాజరు కాకపోవడంతో వెలవెలబోయింది. వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ మండలంలోని వల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సోమవరం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎంపీపీ బొంతు సమత గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు ప్రాతినిథ్య కల్పించకపోవటం సరైనది కాదన్నారు. ప్రభుత్వం ఎంపీపీలకు నిధులు మంజూరు చేయటంలో విఫలమైందన్నారు. దీన్ని నిరసిస్తూ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు సభ నుంచి బయటకు వెళ్లారు. వైరా మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ ముళ్ళపాటి సీతారాములు, టీడీపీ ఎంపీటీసీ ముత్యాల కావ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్ళిపోయారు. దమ్మపేట, పట్వారిగూడెంలో సీపీఐ,టీడీపీ నాయకులు అధికారులను నిలదీశారు. గతేడాది చేపట్టిన మన ఊరు-మన ప్రణాళికలో గ్రామసభల్లో చేసిన తీర్మానాలు, గుర్తించిన పనులను మట్టిలో కలిపారని, అదే పథకానికి పేరు మార్చారు.. ఇప్పుడు గ్రామజ్యోతిని దేనిలో కలుపుతారని నిలదీశారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో అభివృద్ధి కమిటీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం జరగడంతో కమిటీల నియామకం రేపటికి వాయిదా వేశారు. పినపాక నియోజకవర్గంలోని పలు గ్రామసభలు ప్రజలు లేక వెలవెలబోయాయి. బూర్గంపాడు మండలంలోని ఇరవెండి గ్రామ సభకు జనం హా జరుకాలేదు . మణుగూరు మండలంలోని సమితిసింగారం, రామానుజవ రం గ్రామసభలకు అధికారులు మాత్రం భారీగా వచ్చినా ప్రజలు ఎవరూ రాకపోవడంతో కమిటీలు ఏర్పాటు చేయలేదు. ఈ సభలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు అవగాహన కల్పించకుండా సభ ఎలా ఏర్పాటు చేస్తారని మండిపడ్డారు. ఇల్లెందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీలో ఎన్డీ నేతలు నరాటి వెంకన్న గ్రామసభలో నిరసన వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన మన ఊరు మన ప్రణాళిక ఏమైందని, నిధులు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. బయ్యారం మండలంలో కొత్తపేట, గౌరారం, వెంకట్రాంపురంలో ప్రజలు హజరు కాకపోవటంతో గ్రామసభలు వాయిదా వేశారు. -
సమాంతర సభలు
ఇటు గ్రామజ్యోతి... అటు 'మన ఊరు-మన ఎంపీ' జగిత్యాల నియోజకవర్గంలో భిన్న దృశ్యాలు అధికారుల్లో అయోమయంగామజ్యోతిలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మన ఊరు-మన ఎంపీ కొనసాగిస్తున్న కవిత జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన గ్రామజ్యోతి ఒకవైపు 'గ్రామజ్యోతి'.. ఇంకోవైపు ‘మన ఊరు- మన ఎంపీ’ ఒకేరోజు రెండు కార్యక్రమాలు... రెండు సభలు... ఎజెండా ఒకటే... లక్ష్యం ఒకటే...గ్రామాల సర్వతోముఖాభివృద్ధే రెండింటి ఉద్దేశం. ఇందులో ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా... మరొకటి నిజామాబాద్ ఎంపీ ఆధ్వర్యంలో నడుస్తోంది. జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు డబుల్ ధమాకా మాదిరిగా రెండు సభల్లో పాల్గొని కోర్కెల చిట్టా వివరిస్తుంటే... అధికారులు మాత్రం ఎటువైపు వెళ్లాలో అర్థంకాక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ ఎంపీ పరిధిలోని చల్గల్, చర్లపల్లి, అంతర్గాం, నర్సింగాపూర్ గ్రామాల్లో సోమవారం కనిపించిన దృశ్యాలివి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో గ్రామజ్యోతి కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా తమ తమ గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకవైపు గ్రామజ్యోతి ఉద్దేశాలు, లక్ష్యాలను వివరిస్తూనే గ్రామ సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో గ్రామస్తుల నుంచి వ్యక్తిగత సమస్యలను ఏక రువు పెడుతూ... దరఖాస్తులను తీసుకుంటూ వాటి పరిష్కారానికి హామీలు ఇచ్చారు. ఇక జగిత్యాల నియోజకవర్గం విషయానికొస్తే... నిజామాబాద్ ఎంపీ కవిత 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమం పేరిట ప్రత్యేక సభలు నిర్వహించారు.జగిత్యాల మండలం చల్గల్లో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత చల్గల్ గ్రామంలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి కాలినడకన తిరుగుతూ గ్రామ పరిస్థితిని అంచనా వేశారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన 'మన ఊరు-మన ఎంపీ' సభకు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాభివృద్ధికి ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఆటస్థలం, గ్రంథాలయం, కమ్యూనిటీ హాళ్లు, మహిళా భవన్, శ్మశానవాటిక, బ్రిడ్జి నిర్మాణం, ప్రత్యేక గోదాంల ఏర్పాటు, విద్యుత్ తీగల్లోని లోపాల సవరణ వంటి పనులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని చెప్పారు. మళ్లీ నవంబర్‌లో చల్గల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు. ఎంపీ చల్గ ల్లో 'మన ఊరు-మన ఎంపీ' సభలో మాట్లాడుతున్న సమయంలోనే అక్కడికి సరిగ్గా పదడుగుల దూరంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామజ్యోతి సభ నడిచింది. స్థానికులు, పార్టీ నాయకులతోపాటు అధికారులంతా కవిత సభలో పాల్గొనడంతో గ్రామజ్యోతి వెలవెలబోయింది. ముఖ్యంగా అధికారుల్లో కొంత గందరగోళం నెలకొంది. గ్రామజ్యోతి కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలనే ఆదేశాలుండటం, అదే సమయంలో ఎంపీ ప్రత్యేకంగా సభ నిర్వహించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయినప్పటికీ అధికారులంతా కవిత నిర్వహించిన కార్యక్రమాల్లోనే పాల్గొనడం గమనార్హం. చల్గల్ సభ అనంతరం కవిత పార్టీ నాయకులు, అధికారులతో కలిసి చర్లపల్లి, అంతర్గాం, నర్సింగాపూర్ గ్రామాల్లోనూ పర్యటించి 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమాలు కొనసాగించారు. రాత్రి నర్సింగాపూర్లోనే బస చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాత్రం రాయికల్ మండల కేంద్రంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమానికి హాజరై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు గ్రామ సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నా : ఎంపీ కవిత 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తనను ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉన్నానని, వారిని ప్రత్యక్షంగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం ద్వారా రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు.