సాక్షి, హైదరాబాద్: కనీసం 500 జనాభా.. ప్రధాన గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరం.. ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు.. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటులో ఈ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఏర్పడతాయని ప్రాథమికంగా అంచనా వేస్తోంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా గిరిజన తండాలు, కోయ, గోండు గూడేలు, చెంచు పల్లెలను, ప్రధాన పంచాయతీలకు దూరంగా ఉన్న శివారు గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే కసరత్తు ప్రారంభించింది.
జనాభా, దూరం వివరాలతో..
ప్రతిపాదనల తయారీకి సదరు ఆవాసం (పల్లె, తండా, గూడెం)లో ఉన్న జనాభా, ప్రస్తుతమున్న పంచాయతీకి ఎంత దూరంలో ఉందనేది కీలకంగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. 500, ఆపై జనాభా ఉన్న ఆవాసాలు, ప్రస్తుతం పంచాయతీకి కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉన్న వాటి సమాచారం వెంటనే పంపించాలని కోరింది. అనంతరం మరిన్ని వివరాలతో మరో విడత సమాచారం పంపించాలని సూచించింది. అందులో ప్రధాన పంచాయతీకి కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉండి.. 600కు పైగా, 750కు పైగా, 1000కిపైగా జనాభా ఉన్న ఆవాసాల వివరాలను మూడు వేర్వేరు కేటగిరీలుగా పంపించాలని స్పష్టం చేసింది. వీటితోపాటు ప్రస్తుత పంచాయతీకి 3, 4, 5 కిలోమీటర్లకు మించి దూరమున్న ఆవాసాల జాబితాలను విడిగా పంపించాలని సూచించింది.
ఇప్పుడున్నవి 8,685 గ్రామాలు
ప్రస్తుతం రాష్ట్రంలో 8,685 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తంగా 21,768 జనావాసాలు (హ్యాబిటేషన్లు) ఉన్నాయి. కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలో రెండు, మూడు ఆవాసాలుండగా... ఆదిలాబాద్ జిల్లా వంటి ప్రాంతాల్లో పలుచోట్ల ఒకే పంచాయతీ పరిధిలో ఇరవై నుంచి 30 వరకు ఆవాసాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భౌగోళికంగా ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ కనీసం 50, 60కిపైగా ఇళ్లున్న ఆవాసాలను సైతం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
చిన్న రాష్ట్రాల తరహాలో చిన్న గ్రామాలుంటేనే పల్లెల సమగ్ర అభివృద్ధి సాధ్యమవు తుందని.. బాధ్యతాయుతమైన స్థానిక సంస్థల పాలన ప్రజల చెంతకు చేరుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనన్ని అం శాల ఆధారంగా కొత్త పంచాయతీల ప్రతిపాద నలు తయారు చేస్తామని అధికారులు చెబుతు న్నారు. ప్రస్తుత అంచ నాల ప్రకారమైతే మరో నాలుగు వేలకుపైగా కొత్త పంచాయతీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని... దీంతో రాష్ట్రంలో గ్రామపంచాయతీల సంఖ్య దాదాపు 13 వేలకు చేరుతుందని పంచాయతీరాజ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి.
మూడు అంశాలతో..
కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు మూడు అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ జనావాసం ప్రధాన గ్రామం నుంచి ఎంత దూరంలో ఉంది, ఆవాసంలో ఉన్న జనాభా ఎంత, అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏమిటనేది పరిశీలించనుంది. ఇక కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు సమయంలో తరహాలోనే.. ఇప్పుడు కూడా ప్రజల అవసరాన్ని బట్టి కోరినన్ని కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. దీంతో ఆగమేఘాలపై ప్రతిపాదనల తయారీకి పంచాయతీరాజ్ శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు అవసరమైన సమాచారం కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది.
స్థానిక సంస్థల సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. ఒక రోజు వ్యవధిలోనే ఆయా సమాచారం పంపించాలని పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా పక్కాగా ప్రతిపాదనలు తయారు చేసేందుకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment