ప్రతీకాత్మక చిత్రం
కరీంనగరానికి చెందిన రాజు ప్రయివేటు లెక్చరర్. కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పనిచేస్తున్న సంస్థ జీతాలు ఇవ్వడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలిసినవారిని అడిగితే.. డబ్బు సాయం చేయలేదు. తప్పనిసరి పరిస్థితిలో 5శాతం ఫైనాన్స్ వడ్డీకి రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అసలు కన్నా వడ్డీనే ఎక్కువ కావడంతో చివరికి భార్య బంగారం తాకట్టుపెట్టి తీర్చాడు.
కరీంనగర్‌కు చెందిన మల్లేశ్ ప్రయివేటు ఉద్యోగి.10వేల జీతంతో భార్యా, పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇటీవల తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రిలో చూపించగా.. డబ్బులు చాలా వరకు ఖర్చయ్యాయి. కోలుకుని ఇంటికి రాగా.. మందులకు కూడా డబ్బులు లేని పరిస్థితి. తెలిసినవారికి అడిగినా.. ఇవ్వలేదు. దీంతో దూరపు స్నేహితుడి సాయంతో 10శాతం వడ్డీకి రూ.30 వేలు అప్పు తీసుకున్నాడు. వచ్చే జీతంలో నెలకు రూ.3వేలు వడ్డీనే కడుతున్నాడు.
సాక్షి, కరీంనగర్: కరోనా విజృంభణతో ప్రతీఒక్కరి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉద్యోగాలు పోయి.. ఉపాధి కరువై చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి నెలకొంది. లాక్‌డౌన్ అనంతరం పనులు ప్రారంభం అయినా.. కుటుంబాన్ని పోషించేందుకు అప్పులే దిక్కయ్యాయి. అందిన చోటల్లా అప్పులు చేస్తుండగా.. ఫైనాన్స్ వ్యాపారులు ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు. లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని ఇబ్బడిముబ్బడిగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. అత్యవసరం ఉన్న సమయంలో 5నుంచి 10శాతం వరకు వడ్డీకి ఇస్తూ.. సామాన్యుల నడ్డీ విరుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లైసెన్స్ ఉన్న ఫైనాన్స్ కంపెనీలు పదుల సంఖ్యలోనే కొనసాగుతుండగా.. అనుమతి లేకుండా వందల సంఖ్యలో వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
అవసరాన్ని ఆసరాగా..
►2020 మార్చి నుంచి జిల్లాలో కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఆ సమయంలో విధించిన లాక్‌డౌన్‌తో చాలా వరకు ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులను తొలగించారు. చిరువ్యాపారులు, కూలీపని చేసుకునేవాళ్లకు ఉపాధి కరువైంది.
►ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించేందుకు అప్పులే దిక్కయ్యాయి. ఏడాది క్రితం 3శాతం నుంచి 5శాతం వరకు వడ్డీలకు ఇచ్చిన నిర్వాహకులు సెకండ్ వేవ్ నేపథ్యంలో అందినకాడికి దండుకుంటున్నారు.
► సెకండ్‌వేవ్ ప్రభావం జిల్లాపై తీవ్రంగానే ఉండగా.. చాలా మంది వైరస్ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. అప్పులు చేసి మరీ బిల్లులు కట్టగా.. కొందరి ప్రాణాలు సైతం పోయాయి.
► ఈ క్రమంలో ఫైనాన్సర్లు తమదందాను పెంచుకునే పనిలో పడ్డారు. అవసరం ఉన్నవారికి అప్పులిస్తూ.. 10శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు.
నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులు
జిల్లాలో పదుల సంఖ్యలో అనుమతి ఉన్న ఫైనా న్స్ కంపెనీలు ఉండగా.. కొందరు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా అప్పులు ఇస్తుంటారు. అత్యవసరం ఉన్నవారు కంపెనీలను ఆశ్రయించేంత సమయం లేకపోవడంతో వడ్డీవ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటున్నారు. వారు అవతలి వ్యక్తి అవసరాన్ని ఆసరాగా తీసుకుని.. 10నుంచి 15శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. అది కూడా కేవలం రెండు, మూడుమాసాల్లో చెల్లించాల్సిందే. లేకుంటే ఏదైనా వస్తువు కుదవపెట్టాల్సిందే. అప్పు కట్టలేని పరిస్థితుల్లో ప్రామిసరీ నోట్లపై సంతకాలు, బంగారం, వస్తువులు తీసుకుంటున్నారు. ఏవైనా భూములు ఉంటే.. పేపర్లు రాయించుకుని దగ్గరుంచుకుంటున్నారు. కొన్నాళ్లకు ఇతరులకు సదరు భూమిని అమ్మేస్తుంటారు.
కుటుంబ పోషణకే అప్పు..
► జిల్లావ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఇల్లుగడవని పరిస్థితిలో వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారు.
► వారి అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు పెద్దఎత్తున వడ్డీలకు అప్పులు ఇస్తూ జిల్లావ్యాప్తంగా చాలా మంది అందినకాడికి దండుకుంటున్నారు.
► ప్రయివేటు గోల్డ్‌లోన్ కంపెనీలను పరిశీలిస్తే.. సాధారణ పరిస్థితుల్లో కన్నా 20శాతం రుణాలు పెరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
► అనుమతి ఉన్న కంపెనీలు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తుండగా.. అనుమతి లేని ఫైనాన్సియర్లు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. చెప్పిన సమయానికి అందివ్వని పరిస్థితిలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
► ఇంత జరుగుతున్నా.. వడ్డీవ్యాపారులపై పోలీసుల నిఘా కరువైందని ప్ర జలు అంటున్నారు. నిలువరించాల్సినవారు వత్తాసు పలుకుతున్నారని చెబు తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అధికవడ్డీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment