సాక్షి, సిరిసిల్ల/వేములవాడరూరల్ : జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమదైన ప్రచారంతోపాటు వివిధ వర్గాల ఓట్లు గంపగుత్తగా పొందే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. అందులో భాగంగా కుల సంఘాలను ప్రసన్నం చేసుకోవడానికి వారితో ప్రత్యేకంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కులాల వారీగా ఆత్మీయ సభల పేరిట సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో పలు కులసంఘాలతో సమావేశాలు పూర్తిచేసుకొని మరోసారి సమావేశమవడానికి అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. నేరుగా అభ్యర్థులే రంగంలోకి దిగకుండా పార్టీలోని నాయకుల ద్వారా సంప్రదింపులు నెరపుతున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలీల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ జిల్లాకేంద్రంలో పద్మశాలీలతో కృతజ్ఙత సభ నిర్వహించి వారిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కార్మిక క్షేత్రంలోని నేతన్నల సామాజిక వర్గంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వారినే లక్ష్యంగా చేసుకుని ప్రచారశైలిని కొనసాగిస్తున్నారు. మరోవైపు వేములవాడ నియోజకవర్గంలో మున్నూరు కాపు వర్గం ఓ ట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
కుల సంఘాలపైనే గురి..
వేములవాడ నియోజకవర్గంలో కులసంఘాల వైపు అభ్యర్థులు దృష్టి సారించారు. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులు కుల సంఘాలపై దృష్టి సారించి వారికి మొదటి దఫా విందులతో సమావేశాలు నిర్వహించారు. రెండో విడత కూడా మళ్లీ కుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి ఆయా పార్టీలకు చెందిన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. వేములవాడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,92,669 మంది ఉండగా అందులో బీసీలు 1,37,372 మంది ఉన్నారు. వీరిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 40 వేల వరకు ఉన్నారు. ఎన్నికల్లో ఈ వర్గం ఓటర్లు ప్రభావం చూపనున్నారు. అయితే వీరంతా ఎటువైపు మొగ్గనున్నారో మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేములవాడ టీఆర్‌ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబు మొదటి నుంచే నియోజకవర్గంలోని మున్నూరుకాపు సంఘంపై ప్రత్యేక దృష్టి పెట్టి స మావేశాన్ని నిర్వహించారు. కిందిస్థాయి నేతలతో మళ్లీమళ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
టీఆర్‌ఎస్‌లోని మున్నూరుకాపు నేతలతో సంఘ నేతల మద్దతు పొందేలా పావులు కదుపుతున్నారు. మరోవైపు తాను మున్నూరుకాపు కులానికి చెందిన వ్యక్తినంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్.. వేములవాడ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, మున్నూరు కాపు సత్రం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్యే బొమ్మ వెంకన్నతోపాటు మున్నూరుకాపు కుటుంబాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిం చారు. మూడుసార్లు ఓటమి పాలయ్యానని, మీ వాడిగా, కుల సభ్యునిగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటున్నారు. మనలో ఒకరికి ఈ అవకాశం వచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకుందామని విజ్ఙప్తి చేస్తున్నారు. ఈసమయంలో కులబంధువులు అండగా ఉండాలని కోరుతున్నారు.
రోజూవారీగా ప్రత్యేక సమావేశాలు..
టీఆర్‌ఎస్‌లో ఉన్న మున్నూరుకాపు సభ్యులు కొం దరు వేములవాడ మున్నూరుకాపు సంఘంలో ఉన్న సభ్యులతో సంప్రదింపులు జరుపుతూ రెగ్యులర్‌గా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నా రు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా పోటాపోటీగా రోజూవారీగా మీటింగ్‌లతో వారిని తమవైపుకు తిప్పుకుంటున్నారు. కులసంఘ సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తుంటే మరో పార్టీలో ఉన్న మున్నూరు కాపు సభ్యులు కులం పేరుతో సంఘంను వాడుకోవడం సరికాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వేములవాడ నియోజకవర్గంలోని మున్నూరుకాపు సంఘ సభ్యులు, కులస్తులు అయోమయానికి గురవుతున్నారు. ఈనేపథ్యంలో వారంతా కలసి చర్చించుకోవడానికి నియోజకవర్గస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ చర్చల తర్వాతే ఏ గట్టున ఉండాలో తేల్చుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నియోజకవర్గంలోని ఓటర్లలో వేములవాడ మున్నూరుకాపు సంఘంలో అత్యధిక ఓటర్లు ఎవరివైపు నిలబడనున్నరోనని ఆసక్తి నెలకొంది. ఈ సంఘ సభ్యులు ఎటువైపు మొగ్గుచూపితే అటువైపే గెలుపుకు అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే కులసంఘాల నాయకుల వెంటే కులస్తులు ఉంటారా? వారి మాటకు కట్టుబడి వారి చెప్పిన వారికే మొగ్గు చూపుతారా అన్నది మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment