సాక్షి, జగిత్యాల : జిల్లాలో అసెంబ్లీ పోరు రసదాయకంగా మారింది. ప్రజల ప్రాణాలు కాపాడే పవిత్ర వృత్తిలో ఉన్న డాక్టర్లు... రాజ్యంగ హక్కులను కాపాడేలా పేద, ధనిక తారతమ్యలకు తావు లేకుండా అన్నివర్గాలకు న్యాయం చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతున్న న్యాయవాదులు.. నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజినీర్లు.. ఉన్నత విద్యావంతులు చట్ట సభల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఒకప్పుడు రాజకీయాలను మురికికూపంలా భావించే విద్యావంతులు ఇప్పుడు అందులో ప్రవేశించి స్వచ్ఛమైన పాలన అందించేందుకు నడుం బిగించారు. జనం నాడి పట్టుకుని... రాజకీయాల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నుంచి ఈ సారి ఉన్నత విద్యావంతులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
తమ వృత్తితోపాటు సమాజ సేవ చేయాలని కొందరు... తమకున్న రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని కొందరు ఎన్నికల వైపు మెుగ్గు చూపుతున్నారు. రాజకీయ అండదండలతో ప్రధాన పార్టీల టిక్కెట్లు సాధించుకుని బరిలో దిగారు. వృత్తుల్లో ఏర్పడ్డ పరిచయాలు, ఇంతకాలం తమ సేవలకు లభించిన గుర్తింపు తమకు కలిసొస్తుందనే ధీమాతో ఉన్నారు. అందుకు ప్రధాన పార్టీల నుంచి రేసులో ఉన్నవారు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గం నుండే ఆరుగురు విద్యావంతులు బరిలో ఉన్నారు.
2014 సాధారణ ఎన్నికల్లో జగిత్యాల సెగ్మెంట్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన డాక్టర్ సంజయ్‌కుమార్ ఈసారి మళ్లీ అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి గెలుపొందినా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుండే సంజయ్‌కుమార్ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్లలో పార్టీనే నమ్ముకుని పని చేసిన ఆయనకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ టిక్కెట్ కేటాయించారు. దీంతో సంజయ్‌కుమార్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మెట్‌పల్లికి చెందిన డాక్టర్ జేఎన్.వెంకట్ ఏడాది క్రితం వరకు వైద్య సేవలందించారు. ప్రస్తుతం కోరుట్ల స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మొదట్నుంచే కాంగ్రెస్‌లో కొనసాగిన వెంకట్ 2009లో పీఆర్పీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో తన భార్య సునీతను పీఆర్పీ నుంచి కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపారు. అయితే ఆమె ఓడిపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన వెంకట్ రెండు నెలల క్రితం వరకు పార్టీలోపీసీసీ కార్యదర్శిగా పని చేశారు. తర్వాత బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
జగిత్యాల పట్టణానికి చెందిన సిరికొండ రవిశంకర్ ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జగిత్యాలకు మెడికల్ కాలేజీ సాధన.. నియోజకవర్గంలో నెలకొన్న అపరిష్కృత సమస్యల సాధనే ప్రధాన ఎజెండాగా చేసుకున్న రవిశంకర్ ఏడాది క్రితమే తన ఆస్పత్రిని సైతం మూసేసి జనం మద్యలో తిరుగుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గమంతా పాదయాత్ర చేపట్టారు. అన్నివర్గాలను కలుస్తూ తనను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్ధిగా డాక్టర్ సత్యనారాయణమూర్తి బరిలో ఉన్నారు. ఆయన జగిత్యాల స్ధానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇది రెండోసారి. 2014లోనూ అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పట్టణంలో ఆయనకు మంచి వైద్యుడిగా పేరుంది.
జగిత్యాల నియోజకవర్గం నుండి మహాకూటమీ అభ్యర్థిగా బరిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి న్యాయవాది. ఇప్పటికీ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు జననేతగా పేరుంది. ఇప్పటి వరకు తొమ్మిది పర్యాయాలు పోటీ చేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా మళ్లీ బరిలో ఉన్నారు.
ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం అంజయ్య న్యాయవాది. ఆయనా రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే 2014లో కమలం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన 13,267 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి మళ్లీ అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment