పోస్టర్ ఆవిష్కరిస్తున్న అధికారులు, సమితి సభ్యులు
పెద్దపల్లిరూరల్: పంటలు సాగుచేసిన రైతులు వాటికి బీమా చేసుకుంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశముండదని జిల్లా వ్యవసాయాధికారి తిరుమలప్రసాద్ అన్నారు. పెద్దపల్లి మండలం కాసులపల్లిలో శనివారం రైతులకు పంటల బీమా పథకాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు ఇనుగాల తిరుపతిరెడ్డి, ఏడీఏ కృష్ణారెడ్డి తదితరులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. బ్యాంకు ద్వారా పంటరుణాలు పొందని రైతులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలన్నారు. వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి పంటకు ఈనెల 15 వరకు గడువు ఉందన్నారు. మొక్కజొన్న పంటకు ఈనెలాఖరు, వరిపంటకు ఆగస్టు 31 వరకు గడువు ఉందన్నారు. పూర్తి వివరాలకు వ్యవసాయ విస్తీర్ణాధికారులు, మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఏవో ప్రకాశ్‌రావుతో పాటు రైతు సమన్వయసమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో..
కాల్వశ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ లంక సదయ్య, ఏవో కమలాకర్ రైతులను కోరారు. బీమాపై మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తర్ణాధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.
గర్రెపల్లిలో..
గర్రెపల్లి: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ఆపద కాలంలో వరం లాంటిదని సుల్తానాబాద్ మండల వ్యవసాయాధికారి సురేందర్ తెలిపారు. గర్రెపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. అతి తక్కువ ప్రీమియంతో పంటలకు బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. సర్పంచ్ పడాల అజయ్, ఈవోపీఆర్‌డీ చంద్రప్రకాష్, కార్యదర్శి రమేశ్‌బాబు, మల్లికార్జున్, భిక్షపతి, కనుకయ్య, జొన్నకోటి అంజయ్య, ముత్తునూరి రాజేశం పాల్గొన్నారు.
ఎలిగేడు మండలంలో..
ఎలిగేడు: రైతులు ఫసల్ బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి డేవిడ్ రాజు అన్నారు. ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, ర్యాకల్‌దేవుపల్లి, శివుపల్లి, బుర్హాన్‌మియాపేట, ఎలిగేడు గ్రామాల్లో శనివారం బీమాపై రైతులకు వివరించారు. ఏఈవోలు పద్మ, రమేశ్, అనిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment