‘‘ఫసల్ బీమా’’ ధీమా ఇస్తుందా!
సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పాలిట ‘సర్వరోగ నివా రిణి’గా అభివర్ణిస్తోంది. ఈ ‘బీమా పథకం’ విప్లవాత్మకమైన దని, అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ప్రధాని చెబుతున్నారు. నిజంగానే ‘‘ఫసల్ బీమా పథకం’’ రైతుల్లో ధీమా పెంచుతుందా? 1985 తర్వాత వచ్చిన పంటల బీమా పథకాలన్నింటికంటే ‘ఫసల్ బీమా యోజన’ పథకం మెరుగైనదని వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం మాజీ చైర్మన్ టీ.హక్ పేర్కొన్నారు. అందుకు భిన్నంగా, అఖిల భారత కిసాన్‌సభ సంయుక్త కార్యదర్శి విజూ కృష్ణ్ణన్.. కొత్త పథకంలో కొత్తదనమేమీ లేదంటూ.. ‘అసలు రైతులకు రక్షణ ప్రకృతి వైపరీత్యాల నుంచి కాదు.. ప్రభుత్వ వైపరీత్యాల నుంచి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది’.. అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
1985 నుంచి వివిధ పంటల బీమా పథకాలు అందు బాటులోకి వచ్చాయి కానీ, నిజానికి అత్యధిక శాతం మంది రైతులు వాటిని వినియోగించుకోవటం లేదు. ప్రధాన కారణం అవగాహనా లోపం, అననుకూల నిబంధనలు. దేశంలో 95.8 మిలియన్ల రైతులు ఉండగా.. 2011, 2012, 2013 సంవత్సరాల్లో ఆరు వ్యవసాయ సీజన్లలో బీమా సౌకర్యం పొందిన రైతుల సంఖ్య సగటున 12.7 మిలియన్లుగా ఉంది. అంటే, సుమారు 13 శాతం రైతులు మాత్రమే. ‘నేషనల్ శాంపిల్ సర్వే’ ప్రకారం ప్రతి 1000 రైతు కుటుంబాల్లో 208 కుటుంబాలకు అసలు పంటల బీమా పథకం ఉన్నట్లే తెలియదు. 131 కుటుంబాల వారికి తాము ఆ సౌకర్యం పొందవచ్చునన్న అవగాహన లేదు. 191 కుటుంబాల వారికి బీమా పథకం పట్ల ఆసక్తి లేదు. బీమా పథకంలోని సంక్లిష్టమైన షరతులను ఇష్టపడక 97 కుటుంబాలు బీమా పథకం జోలికి పోలేదు.
2013లో ‘జాతీయ నమూనా సర్వే సంస్థ’ దేశవ్యాప్తంగా 4,530 గ్రామాల్లో పంటల బీమా పథకం అమలుపై సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు.. కనిష్టంగా 4% నుంచి గరిష్టంగా 15% రైతులు మాత్రమే బీమా పథకంలో భాగస్వాములు అయ్యారని తేలింది. ముఖ్యంగా చిన్నచిన్న కమతాలను కలిగిన దళితులు, ఆదివాసీలు, చిన్న, సన్నకారు రైతులు నామమాత్రంగానే బీమా పథ కాన్ని వినియోగించుకున్నారు. 28 రాష్ట్రాలలో (తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు) బీమా సౌకర్యాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్న రాష్ట్రాల సంఖ్య 10 మాత్రమే. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 4 లక్షల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఉన్నప్ప టికీ... వారిలో 30 వేల మందికి మించి బ్యాంకు రుణాలు లభించలేదు. దానివల్ల బీమా సౌకర్యం కోల్పోయారు. అలాగే.. నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో.. బ్యాంకులకు అటు ప్రభుత్వం కాని, ఇటు రైతులు కాని బకాయిలు చెల్లించ లేదు. దీనితో రైతులు రుణగ్రస్థులుగానే మిగిలిపోయారు.
వ్యవసాయరంగంలో జరిగే వ్యవస్థాగత కుంభ కోణాల్లో ‘బీమా’ పథకం ఒకటి. ‘బీమా’ పథకాలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని.. ‘బీమా’ ప్రయోజనాలు నిజమైన బాధిత రైతులకు అందడం లేదని వివిధ నేర పరిశోధక ఏజన్సీలు వెల్లడించాయి. బీమా స్కామ్‌ల జాబితా రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా మినహాయింపు కాదు.
అయితే ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకంలో కొన్ని చెప్పుకోదగ్గ అంశాలు ఉన్నారుు. అందులో 1. అతి తక్కువ ప్రీమియం. రబీ పంటలకు 1.5%, ఖరీఫ్ పంటలకు 2%; వాణిజ్య, ఉద్యానవన పంటలకు 5% ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది. 2. ప్రీమియంలో అధిక మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సర్దుబాటు చేస్తాయి. 3. రిమోట్ సెన్సింగ్, స్మార్ట్ ఫోన్ల వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నష్టం మదింపు, జాప్యం లేకుండా నష్టపరిహారం చెల్లింపు, 4. తీవ్ర కరువు పరిస్థితుల్లో పంటలు వేయనప్పటికీ నష్టపరిహారం చెల్లింపు, 5. కోత అనంతరం ముంపుబారిన పడిన పంటకూ బీమా వర్తింపు, 6. పంట రుణాలపైనే కాకుండా, ఇతర వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల నిమిత్తం తీసుకునే రుణాలకూ బీమా, 7. కౌలు రైతులకూ (కిసాన్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు ఉన్నవారికి) బీమా సౌకర్యం.. మొదలైనవి ఉన్నాయి. రైతు కుటుంబా ల్లో అన్ని రకాల భీమా పథకాలకు, అంటే పంటల నష్టం, వ్యక్తిగత ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వ్యవసాయ పంపు సెట్లకు జరిగే నష్టం, విద్యార్థి భద్రత (రైతు కుమా రుడు) భీమా, రైతు జీవిత బీమా.. వీటన్నింటికి ఒకే విడత ప్రీమియంగా సంవత్సరానికి రూ.5,145లు చెల్లిస్తే సరి పోతుంది. జరిగిన పంటనష్టంలో వెంటనే 25% మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయడం అనే అంశం కూడా బాధిత రైతాంగానికి ఊరటనందించేదే.
ఏ పథకం విజయవంతం కావాలన్నా దానిని సద్విని యోగించుకునే చొరవ లబ్ధిదారులకు ఉండాలి. అన్ని పథకాలూ కాగితాలపై అద్భుతంగా కనిపిస్తాయి. అమలు లోనే అవాంతరాలు ఏర్పడతాయి. ఏప్రిల్ నుంచి అమల య్యే ‘‘ప్రధాని ఫసల్ బీమా యోజన’’ పథకాన్ని రైతుల వద్దకు చేర్చే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ కీయ పార్టీలు, రైతు సంఘాలు, మీడియా నిర్వర్తించాలి. నూతనంగా ప్రకటించిన పంటల బీమా పథకంపై రాజకీయ పార్టీలు, మీడియా చర్చించక పోవడాన్ని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మధుకిష్వర్ తప్పుపట్టారు.
అయితే, భారతదేశంలో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం తగ్గిపోతూ. ఏటా 17% మేర ఆహారధాన్యాల దిగుబడి పడిపోతున్న నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన ‘‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’’.. ఒక్కటే మొత్తం రైతాంగాన్ని ఆదుకోలేదు. పంటల బీమా పథకం విజయవంతం కావాలంటే ఎట్టి పరిస్థితులలో... 1. అన్ని పంటలకు బీమా వర్తింపజేయాలి. 2. పంటల బీమా అమలులో ప్రభుత్వాల దృక్పథం మారి... ‘‘బీమా పంటలకు (క్రాప్ ఇన్సూరెన్స్) కాదు... పంటల నుంచి రైతు పొందే ఆదాయానికి బీమా’’...(ఇన్కమ్ ఇన్సూరెన్స్) కల్పించాలి. 3. విధిగా గ్రామం యూనిట్ గానే పంటల ఆదాయం మదింపుచేయాలి. 4. ప్రీమియం భారం మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని స్వామినాధన్ కమిషన్ చేసిన సిఫార్సును అమలు చేయాలి. 60% జనాభాకు ఉపాధిని కల్పించే వ్యవసాయ రంగాన్ని ఎంతగా ప్రోత్స హించగలిగితే.. రైతు ఆర్థిక పరిస్థితి అంత బాగుపడు తుంది, దేశ ఆర్థిక వ్యవస్థ అంత పరిపుష్టం కాగలుగు తుంది, ప్రజలకు ఆహార భద్రత సమకూరుతుంది.
డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు
సెల్ : 99890 24579